Saturday, May 23, 2009

చిరుజల్లులో పూలు


1.

కొలనులో చంద్రుడు

తుళ్ళి పడ్డాడు

తూనీగ రెక్క తగిలి

2.

తట్టలో చూసే కాయలు

చెట్టుకే చూడ్డం

ఎంత బావుంది!

౩.

జలపాతానికి

రంగుల ముఖద్వారం

ఇంద్రధనస్సు!

4.

ఒకే తోటలో చెట్లు

కొన్ని పొట్టి

కొన్ని పొడుగు

5.

పావురాళ్ళకి మేత

వాటి కడుపు నిండుతుంటే

నా గుండె నిండుతోంది

6.
దట్టమైన అడవి

ఒకటో రెండో

సూర్య కిరణాలు

7.

ఖాళీ బాల్చీ

నిండుతున్న సవ్వడి

ఏదో చెప్తోంది

8.

పిల్ల కాలువని

మీటుతున్నాయి

మర్రి ఊడలు

9

ఈ సెలయేరు

క్షణం క్రితం

జలపాతం

10.

తామరాకుల కింద

దాక్కుంది

కొలను.

Saturday, May 2, 2009

ఎక్కడికో...

ఇవాళైనా ఏమైనా చెప్తావని

ప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చి

నిల్చుంటాను


మలుపులు తిరుగుతూ

ఏ మార్మికతల్లోకో

మౌనంగా వెళ్ళిపోతావు


కదిలే ప్రవాహంలో

కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా

"నేను" మిగిలిపోతాను!