Wednesday, December 23, 2009

దివ్వెలు

1.
భూమ్మీద
ప్రతి చెరువులోనూ
మునుగుతాడు
చంద్రుడు

2.
గాలి కచేరీ
చెట్టు నుండి
చెట్టుకి
ఆకుల చప్పట్లు

3.
వెలుగు నీడ
శబ్దం నిశ్శబ్దం
జీవం మృత్యువు
అలవోకగా కలసిపోయి
అడవి

4.
మూసుకుని తెరుచుకోవడంలోనే
జీవమైనా రాగమైనా
చెప్తునే ఉంటాయి
గుండె.. పిల్లనగ్రోవి

5.
అడ్డొచ్చిన వాటిని
తొలగించక
వెలిగిస్తాడు
సూర్యుడు

Thursday, December 3, 2009

ఇస్మాయిల్‌కి మరోసారి


ఆకాశపు నీలిమలో మునకలేసి
కిలకిలల పాటల్లో తేటపడి
మౌనంగా గూట్లోకి ముడుచుకుంటూ

పక్షి రెక్కల్లో
మీ అక్షరాలు

ఒడ్డున సేదదీరిన మనసుల్ని చల్లగా స్పృశిస్తూ
పున్నమి రాత్రి పూర్ణ బింబం కోసం ఎగసిపడుతూ
ఏ లోతుల్లోంచి... ఏ తీరాలకో...

కడలి అలల్లో
మీ అక్షరాలు

తెరుచుకున్న ప్రతి కిటికీనీ వెచ్చగా పలకరిస్తూ
సంధ్య అందమైన వర్ణాల్ని లోకమంతా నింపుతూ
అలవోకగా అరణ్యాల్ని అణువణువూ అన్వేషిస్తూ

సూర్య కిరణాల్లో
మీ అక్షరాలు

నది మీద వాన చినుకుల్లా
మీ అక్షరాలు

సెలయేటి గలగలల్లో
మీ అక్షరాలు

బంతిపూల బంగారు వర్ణాల్లో
మీ అక్షరాలు

మౌనపు తలుపు తడుతుంటే
వచ్చే సవ్వడి మీ కవిత్వమే కదూ
విస్మయపరుస్తునే ఉండండి
ఇస్మాయిల్ గారూ!

(నవంబరు 25 ఇస్మాయిల్ వర్ధంతి)