Friday, April 27, 2012

కొండవాగులో బంతి -- కథ వెనక కథ


కవిగా నా జీవితంలో 2004 నుండి 2007 వరకు మరుపురాని కాలం. సేదదీర్చిన ప్రతి చెట్టు నీడనీ కాసేపు ప్రతిఫలిస్తూ ఒక ప్రవాహంలా సాగిపోతున్న రోజులు. ఆ రోజుల్లోనే ఇస్మాయిల్ "రాత్రి వచ్చిన రహస్యపు వాన" లో పూర్తిగా తడిసిపోయాను. జీవితం ఇంత ఆనందమయమా? కవిత్వం ఇంత సరళమా? అని అబ్బురపడుతున్నాను. అప్పుడు చదివిన కరుణ ముఖ్యం వ్యాసాలు వాటి ద్వారా పరిచయమైన జెన్ కవిత్వం , హైకూలు నా జీవితం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపాయి. సరిగ్గా ఆ రోజుల్లో ఒక ఆదివారం మిత్రులు నండూరి గారు ఫోన్ చేసి బాపు గారి బొమ్మలు, కొన్ని పుస్తకాలు ప్రదర్శన ఉంది వెళ్దామా అన్నారు. అక్కడ పుస్తకాల్లో "త్రిపుర కథలు" పుస్తకం చూసాను. రచయిత పేరు వినలేదు. వాంగో స్కేరీ నైట్స్ పెయింటింగ్ ఆ పుస్తకానికి కవర్ పేజీ. లోపలి పేజీలు తిరగేసాను..


Who calls my poems poems?

My poems are not poems.

Knowing my poems are not poems

Together we can begin to speak of poetry.


                                                                -- ryokan


 నాకు బాగా ఇష్టమైన ర్యోకన్ కవిత. ఈయనకి కూడా నచ్చిందే అని ఒక అబ్బురం. ఇంకేమీ ఆలోచించకుండా పుస్తకం కొనుక్కున్నాను. ఇంటికి వచ్చి "పాము" కథ చదివాను. కొత్తగా ఉందే అనిపించింది. కథలు నన్ను చదివించాయి. మళ్ళీ మళ్ళీ చదివించాయి. ఆ కథల్లో కల్పించిన వాతావరణం అంతా నాకు కొత్త. బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిసరాలు, మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్, బర్మా ఇవన్నీ. వ్యక్తుల మనస్తత్వం కూడా నాకు కొత్త. ఉన్నత తరగతిలోంచి వచ్చిన మనుషులు. అయినా చిత్రంగా కథలన్నీ నాకు విపరీతంగా నచ్చాయి. ఆయన పదాలతో బొమ్మ కట్టే తీరు, సముద్రపు హోరులో కెరటానికీ, కెరటానికీ మధ్య ఉన్న అమోఘమైన నిశ్శబ్దాన్ని తన కథల్లోకి ప్రవేశపెట్టగల ఆయన ప్రజ్న నన్ను అబ్బుర పరిచింది. రెండు మూడు బ్రష్ స్ట్రోక్స్ తోనే ఒక బొమ్మ గీయగల నేర్పు కూడా ఆయన కథల్లో చూడొచ్చు. సాఫీగా తాపీగా సాగే "అనగనగా..." కథలకి అలవాటు పడిన నన్ను ఒక్కసారిగా ఒక మహాప్రవాహంలోకి తోసేసినట్లైంది. మనిషి సాటి మనిషి కోసం చెయ్యగలిగిన త్యాగం ఒక వైపు, ద్రోహం మరోవైపు ఈ రెండిటి మధ్యా ఈయన కథలు ఊగిసలాడతాయి. ఆయన కథల్లో అంతర్లీనంగా ఉండే జెన్ బౌద్ధం కూడా నన్ను ఆకర్షించింది. నేను ఎన్నో పుస్తకాలు కొని చదివేసాకా ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను. ఇంట్లో లైబ్రరీలు మెయింటైన్ చెయ్యాలనీ, చదివిన పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవాలనీ ఉండదు. కానీ నా దగ్గర ఉంచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకాల్లో త్రిపుర కథలు కూడా ఒకటి.


 త్రిపుర కథల్లో నాకు బాగా నచ్చిన "జర్కన్" అనే కథను ఒక ప్రేమ కథగా రాద్దామని ఉండేది. అదే ఆలోచన దాదాపు రెండేళ్ళ తర్వాత "కొండవాగులో బంతి"గా బయటకి వచ్చింది. "కొండవాగులో బంతి" రాసే సమయానికి నేను జెన్ తాత్వికతలో మునిగితేలుతున్నాను. అసలు జెన్ ఒక తాత్వికత కూడా కాదు. అదో జీవన విధానం. తరచి తరచి చూసాకా ఆ జెన్ మూలాలు నాలో ఉన్నాయని నాకర్ధమైంది. ఉదాహరణకి సెలయేరు ఒక జెన్ ప్రతీక. జెన్ బౌద్ధం గురించి తెలీక మునుపే నేను సెలయేరు మీద చాలా కవితలు రాసి ఉన్నాను. ఆ దశలో ప్రకాష్ అని మా ఫ్రెండుతో 2006 లో ఒక అర్ధరాత్రి వైజాగు బీచ్లో కెరటాలు జూలు గుర్రాల్లా తీరం వైపు దూసుకొస్తుంటే చూస్తూ ఒక చర్చ నడిచింది. నేను కవిత్వ సాధన , జెన్ అధ్యయనం ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు వాడు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్న సూక్తి అనుభవంలోకి వచ్చింది.


  వాడన్నాడు "ఈ కాలంలో బుద్దుడు బోధి చెట్టుకింద కూచోనక్కరలేదు రా" అని, దాదాపు నేనూ అదే అభిప్రాయంతో ఉండడంతో అమితాశ్చర్యంతో "నేషనల్ జియోగ్రఫీ చానల్ చూస్తే చాలు" అని పూరించాను. ఈసారి ఆశ్చర్యపోవడం వాడి వంతయ్యింది. ఎందుకంటే వాడు సరిగ్గా అదే విషయం చెప్దామనుకున్నాట్ట. ఇద్దరికీ ఆ రోజు చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. ఆ చర్చలూ ఆలోచనలూ అన్నీ ఆ కథలో ప్రతిబింబిస్తాయి.

 నాకెంతో ఇష్టమైన త్రిపుర గారు గత పాతికేళ్ళ నుంచీ వైజాగులోనే ఉంటున్నా , చాలా సార్లు బీచ్ కి వెళ్ళినప్పుడు పాండురంగాపురం డౌన్లోంచే వెళ్ళినా, ఆ సముద్రపొడ్డున చిన్న అపార్టుమెంటులో మరో సముద్రం ఉందని నాకు తెలీలేదు. గత సంవత్సరం కనక ప్రసాద్ గారు, మరొక త్రిపుర గారి వీరాభిమాని రామయ్య గారు వీళ్ళిద్దరి ద్వారా త్రిపుర గారితో పరిచయం కలిగింది. ఆయన వాత్సల్యాన్నీ, కరుణనీ పొందగలిగాకా "త్రిపుర గారే ఉండగా ఆయన కథలెందుకులే" అని కనకప్రసాద్ గారి మాటలు ఎంత నిజమో అనిపిస్తాయి.


 కొండవాగులో బంతి కథని ఎవరైనా పొగిడినప్పుడల్లా అది ఒరిజినల్ కథ కాదనీ, త్రిపుర గారి జర్కన్ కథకి అనుసరణ మాత్రమే అనీ ఆ పొగడ్తలన్నీ ఆయనకే చెందాలనీ చెప్పాలని ఉంటుంది .అందుకే ఈ పోస్టు.

Thursday, April 5, 2012

కొండవాగులో బంతి

IIT Kharagpur లో Phd లో చేరిన రెండేళ్ళకి ఒక paper ప్రచురించగలిగాను. అదీకాక ఈ సంవత్సరం బెంగుళూరులో జరుగుతున్న International conference లో పబ్లిష్ అయ్యింది. నా presentationకి మంచి స్పందనే వచ్చింది. ఈ విశేషాలన్నీ మా గైడుకి ఫోన్ చేసి చెప్పాలని బయటకొచ్చి , మొబైల్ ఆన్ చేసేసరికి రెండు కొత్త మెసేజిలు వచ్చాయి. ఒకటి ఎప్పటిలాగే Airtel wishes you a pleasent stay in karnataka అని, మరొకటి హిమబిందు దగ్గరనుంచి "Ravi, Please Call me immediately, Bindu" అని ఉంది. ముందు గైడుకి ఫోన్ చేసి విశేషాలన్నీ చెప్పేసి,వెంటనే హిమబిందుకి ఫోన్ చేసా. అర్జంటుగా నన్ను కలవాలట. ఎందుకో కలిసినప్పుడే చెప్తుందట. ప్రస్తుతం భద్రాచలంలో ఉందట.

ఆమెని భరించడం కష్టం. ఆమెలో ఒక సెలయేరుతో పాటు ఒక జలపాతం కూడా ఉంది. ఒక్కోసారి వెల్లువెత్తినట్టు మెయిల్స్ , ఫోన్స్ కురిపిస్తుంది. మరొక సారి కొన్ని నెలలపాటు మౌనంగా ఉండిపోతుంది.

నేను ఇప్పుడు కలవడం కుదరదన్నా తను వినదు. అందుకని ఇవాళ conference ఐపోగానే ఫ్రెండ్ ని కలవడానికి వైజాగ్ వెళ్తున్నాననీ, ఎల్లుండి అంతా అక్కడే ఉంటానని, ఎల్లుండి వైజాగ్ రాగలిగితే కలవొచ్చనీ చెప్పాను.సరే ఐతే jan 12th, 6 o clock, RK Beach అని చెప్పి పెట్టేసింది.

 మొదటిసారి ఆమెని రాజమండ్రిలో కలిసాను. నేను hermitary.com వెబ్సైట్ కి రాసిన, A modern buddha need not sit under bodhi tree అన్న వ్యాసం చదివి, నాకు మొదటిసారి మెయిల్ చేసింది. నా ఫిలాసఫీ ఆమెకి నచ్చిందని. ఆ తర్వాత మా మధ్య చాలా మెయిల్స్ నడిచాయి. తన ఇష్టాయిష్టాలన్నీ రాసేది. తనకి నదులంటే ప్రాణం అనీ, భారతదేశంలోని నదుల మీద పరిశోధన చేస్తున్నాననీ, ప్రస్తుతం దక్షిణ గంగ అయిన గోదావరి మీద రీసెర్చిలో భాగంగా రాజమండ్రిలో ఉన్నాననీ వీలైతే కలుద్దామనీ చెప్పింది. నేను అప్పుడు వింటర్ ఇంటర్న్ షిప్ హైదరాబాద్ క్వాల్ కాం కంపెనీలో చేస్తుండేవాడిని. అది పూర్తికాగానే తిరిగి ఖరగ్పూర్ వెళ్ళిపోతూ మధ్యలో రాజమండ్రిలో దిగాను.

ఆ రోజు నాకు బాగా గుర్తు. సాయంత్రం గోదావరి ఒడ్డున కూచున్నాం ఇద్దరం. తను లేత నీలి రంగు చీర కట్టుంకుంది. పొట్టి పొడవూ లావూ సన్నం కాని రూపం. సంధ్య కాంతి ఆమె మొహం మీద పడి మెరుస్తోంది. కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత "అంత పెద్ద పెద్ద articles రాస్తారు కదా ఏమైనా మాట్లాడండి" అంది నవ్వుతూ..

"మీ మెయిల్సూ, అభిప్రాయాలూ చూసి మీరేదో జీన్ ప్యాంటూ, స్లీవ్లెస్సుతోనూ ప్రత్యక్షమౌతారనుకున్నా ఇలా అచ్చతెలుగు బాపూబొమ్మలా ఉంటారనుకోలేదు" అన్నాను.

మామూలుగా ఎలా ఉన్నా నది ఒడ్డుకి వచ్చేటప్పుడు మాత్రం చీర కట్టుకోవాలనిపిస్తుందిట. అటు చూడండి గోదావరికి సూర్యుడు బంగారు చీర కడుతున్నాడు అని చూపించింది. నిజంగానే సంధ్య కాంతి గోదావరి మీద పడుతున్న ఆ దృశ్యం అద్భుతంగా ఉంది.

"ఇంకా నయం కస్తూరిగా మారి నీ నుదిటనే చేరి కడదాక కలిసుండనా" అని సూర్యుడు గోదావరితో పాటపాడుతున్నాడనలేదు" అని నవ్వాను. ఆమె నవ్వి "మీ nihilism, tao philosophy చదివి, మీరేదొ పరమ జిడ్డుగా, బట్టతల, గుబురు గెడ్డంతో ప్రత్యక్షమౌతారనుకున్నా, తీరా చూస్తే మీరేమో సర్ఫ్ రోష్ లో అమీర్ ఖాన్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చి, జంధ్యాల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లా జోకులు కూడా వేస్తున్నారు అని, సరేగానీ మీ గురించి చెప్పండి" అంది.

"నా గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదండీ. చాలావరకు మీకు తెలిసిందే... రేపే మృత్యువు నా తలుపు తడుతుందని ఊహించుకుని ఇవాళ గడపడం అన్నిటికన్నా నాకిష్టమైన పని. అలా బ్రతకడంలో గొప్ప థ్రిల్ ఉంది. Mathematics, music నా passions" అన్నాను.

ఐతే మీరూ, నేనూ ఇలా సరిగ్గా ఈ సాయంత్రం గోదావరి ఒడ్డున కలుసుకుని కబుర్లు చెప్పుకోవడంలో ఎన్ని complicated equations solve అయ్యుంటాయో చెప్పుకోండి చూద్దాం అని నవ్వింది. నవ్వినప్పుడు ఆమె కళ్ళు సగం మూసుకుపోతాయి.అమాయకత్వం,కొంటెతనం కలబోసిన కళ్ళు. కోపం వచ్చినప్పుడు కళ్ళతోనే అవతలి వ్యక్తిని అదుపులో పెట్టగల కళ్ళు ఈమెవి అనుకున్నాను. ఆమె కళ్ళల్లోకి అలా తదేకంగా చూస్తే బావుండదని చూపులు మరల్చి నా గురించి అడిగారు గానీ మీ గురించి చెప్పనే లేదు అన్నాను.

"మెయిల్స్ లో చెబుతునే ఉన్నాగా.. డాడీ పెద్ద కాంట్రాక్టర్ చెన్నైలో. పక్కా బిజినెస్ మైండెడ్. పోటీ వచ్చినవాళ్ళని నామరూపాల్లేకుండా చేసాడు. చిన్నప్పుడు ఏదో చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారితే అమ్మని పీక పిసికి చంపేసి , రెండు నెలలు తిరక్కుండానే మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. అంతా సవతి తల్లిని అంత కౄరంగా ఎందుకు చిత్రిస్తారో అర్ధం కాదు. నన్ను మాత్రం కన్నతల్లి కన్నా సవతి తల్లే బాగా చూసుకునేది.నాకో తమ్ముడున్నాడు. చదువు పెద్దగా అబ్బలేదుగానీ బిజినెస్లో తండ్రిని మించిన తనయుడు. రోజుకో అమ్మాయితో తిరుగుతాడు. ఐతే ఎవరినీ వెంటపడి వేధించడు. పెళ్ళి చేసుకుంటాననీ ప్రేమనీ అబద్ధాలు కూడా చెప్పడు. అయినా బోలెడుమంది అమ్మాయిలు వాడి చుట్టూ ఎందుకు చేరుతారో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటి నిండా ఎప్పుడూ నౌకర్లు.. కార్లు..ఐశ్వర్యం.. వీటన్నిటి మధ్యా పెరిగినా నాలో ఏదో అసంతృప్తి.. ఈ రీసెర్చిలో నాకు కొంత ప్రశాంతత లభిస్తోంది.. డాడీ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు.. ఇప్పటికీ రీసెర్చి అనీ అదనీ ఇదనీ కొన్ని నెలల పాటు ఇంటికి దూరంగా ఉన్నా ఏమీ అనరు"

ఇలా ఆమె చెప్పుకుంటూ పోతోంది. నాకు ఎందుకో తన మాటలు వింటుంటే తామర పువ్వు గుర్తొచ్చింది. మౌనంగా ఆలోచిస్తున్న నన్ను చూసి ఏంటండీ మా వాళ్ళ మంచి చెడ్డలు అంచనా వేస్తున్నారా అని అడిగింది.

"ఒకరి మంచి చెడ్డలు అంచనా వెయ్యడానికి నేనెవరండీ" అదేం లేదు అన్నాను.

ఆమె వెంటనే "ఈ అమ్మాయేంటి తన వ్యక్తిగత విషయాలు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముక్కూ మొహం తెలీని, మొదటి సారి కలిసిన వ్యక్తికి చెప్పేస్తోందనేగా మీ అనుమానం" అంది.

ఈమె మనుషుల్ని భలే చదువుతుంది అనుకున్నా మనసులో.

మరొకసారి నవ్వి, "నేను M Phil చదివే రోజుల్లో స్నేహ అని ఒక రూమ్మేట్ తో సంవత్సరం  పాటు కలిసి  ఉన్నాను.  అయినా ఒకరి ఇష్టమైన రంగేమిటో కూడా మరొకరికి తెలీదంటే అతిశయోక్తి కాదేమో అని, ఒంటరితనం ఒక్క దేహానికేనా?" అంది సూటిగా చూస్తూ

నేనేమీ మాట్లాడలేదు

"ఇంతకీ మీకు ఈ చైనీస్ ఫిలాసఫీ మీద ఆసక్తి ఎప్పుడు కలిగింది? అని అడిగింది

 అంతకు ముందు చాలా మందే నన్నా ప్రశ్న అడిగారు. నిజానికి నాకు ఈ విషయాల మీద ఆసక్తి కలిగి అప్పటికి ఒక  సంవత్సరమే అయ్యింది. అప్పటిదాకా నేను కూడా అందరిలాగే ఐశ్వర్యం వెనక, అబద్ధాల వెనకా పరిగెత్తిన వాడినే. ఆ దశలో ఒక రోజు రాత్రి అకస్మాత్తుగా చనిపోయినట్టు పీడకల వచ్చింది. ఆ రాత్రి మరి నిద్రపోలేదు భయంతో వణికిపోయాను. అప్పుడనిపించింది అసలు కలకీ, వాస్తవానికీ తేడా ఏముందని? రెప్పలు తెరిచేవరకూ కల కూడా నిజంగా జరిగిందేమో అన్నంతలా  కలుగుతుంది. బహుశా మనం నిజం అనుకుంటున్న ఈ జీవితం కూడా మరొక ప్లేన్లో కలేనేమో! అకస్మాత్తుగా నాకేదో రహస్యం తెలిసిపోయిన అనుభూతి. అప్పటినుండే ప్రవాహానికి ఎదురీదడం మానేసి, ప్రవాహంతో పాటు అలా హాయిగా కొట్టుకుపోతున్నాను. అప్పుడే చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి Phdలో చేరాను

ఈ విషయాలన్నీ ఆమెతో చెబితే, "చాలా interesting గా ఉందండీ మీ కథ.. ఐతే అది కొట్టుకుపోవడం ఎలా ఔతుంది?మీరు సెలయేటితో ఒక perfect harmonyలో ఉన్నారు. "కొట్టుకుపోవడం" అనే పదం తప్పు.. Its a kind of ecastasy" అంది

"సెలయేరంటే గుర్తొచ్చింది.. ఇంతకీ నదుల మీద పరిశోధించాల్సినంత ఏముందండీ?" అని అడిగాను.

"అసలు నా దృష్టిలో పరిశోధించాల్సిన అవసరం లేని విషయమేదీ లేదు. ప్రతి దాన్లోనూ మనకి తెలియని లోతులు ఎన్నో ఉంటాయి, కాదంటారా?" అని అడిగి మళ్ళీ కొనసాగించింది. నదుల గురించి ఒక్కో విషయం తెలుసుకుంటుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. మనిషి సంస్కృతి , కళలు, నాగరికత ఇవన్నీ నదులతో ఎలా మమేకమైపోయాయోనని తెలుసుకున్నకొద్దీ పట్టరాని సంతోషం కలుగుతుంది. నిన్నే తెలిసింది గాంధీ గారు తన తల్లి చనిపోయినప్పుడు గోదావరిలో స్నానం చేసారుట తెలుసా అంది. ఈ విషయాలు చెప్తుంటే ఆమె కళ్ళల్లో మెరుపు.

ఐతే ఫైనల్ గా మీరు వైజాగ్లో సెటిల్ ఔతారన్నమాట అన్నా. ఎందుకండీ అని అడిగితే నదులన్నీ చివరికి సముద్రాన్నే కదండీ చేరాల్సింది అన్నాను.

ఆమె సవ్వడి చెయ్యకుండా నవ్వింది. శీతాకాలపు చలిగాలి నెమ్మదిగా తాకుతోంది. ఆ గాలికి ఆమె ముంగురులు నాట్యం చేస్తున్నాయి. రాజమండ్రి దీపాలు గోదాట్లో తమ మొహాలు చూసుకు మురిసిపోతున్నాయి. నేను ఈమె కళ్ళల్లో నన్ను నేను చూసుకు మురిసిపోతున్నట్టే!  ఆకాశంలో అక్కడక్కడా పక్షులు. జనం పల్చబడుతున్నారు. చాలాసేపు అలా మౌనంగా కూచుండిపోయాం. ఆమెతో మాటలతో పాటు మౌనం కూడా బావుంది. silence is ever speaking!! నిజమే కాబోలు.

 "ఇలాంటప్పుడు వేడి టీ తాగితే భలే ఉంటుంది కదండీ" నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె అంది. ఐతే పదండి.అలా నడుస్తూ దగ్గర్లో ఏమైనా మంచి హోటల్ ఉందేమో చూద్దాం అన్నా. ఈ మాత్రం దానికి హోటల్ ఎందుకండీ అదిగో అక్కడేదో టీ బండి ఉంది అక్కడ తాగుదాం పదండి అని తీసుకెళ్ళింది. రెండు టీలు చెప్పాం. చలిగాలి రివ్వున వీస్తోంది. తను చేతులు రుద్దుకుని బుగ్గలకి అద్దుకుంటోంది.

రెండు గ్లాసులు అందుకుని ఒకటి ఆమెకి అందించాను. ఆ సాయంత్రం ఆమెతో కబుర్లు చెబుతూ పొగలు కక్కుతున్న టీ తాగడం! అదొక అనుభవం. కాలాన్ని కట్టివేసిన ఆ క్షణంలో నిన్న లేదు. రేపు లేదు. ఆమె లేదు. నేను లేను. అనంతంగా విస్తరించిన వర్తమానమే!

 తర్వాత ఒక రిక్షా మాట్లాడుకుని రాజమండ్రిలో కొంచెం సేపు తిరిగి, టిఫిన్ చేసి రాత్రి 8.30 కి స్టేషన్ కి చేరుకున్నాం. కోరమాండల్ ఎక్స్ప్రెస్ సరిగ్గా తొమ్మిదికి వచ్చింది.రీసెర్చిలో భాగంగా తను గోదావరిని వివిధ ప్రాంతాల్లో తీసిన అరుదైన ఫొటోలున్న ఒక ఆల్బం నాకు బహుమతిగా ఇచ్చింది.నేను The mighty and mystical rivers of india అనే పుస్తకాన్నిస్తే చూసుకుని కవర్ పేజీని చిన్న పిల్లల్ని తడిమినట్టు తడిమి మురిసిపోయింది. రైలు మెల్లగా కదిలిపోతుంటే, ఆమె చేతులూపుతున్న దృశ్యం ఎప్పటికీ మరవలేను.

 తర్వాత నేను ఖరగ్పూర్ వెళ్ళిపోయి మళ్ళీ నా రీసెర్చితో బిజీ ఐపోయాను. ప్రొఫెస్సర్ నుంచి కూడా చాలా ఒత్తిడి ఉండేది. ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేది.పొరపాటున మా ప్రొఫెస్సర్ కాస్త ఇబ్బంది పెడుతున్నాడని చెబితే మిమ్మల్ని ఇంకెవరో ఎలా ఇబ్బంది పెట్టగలరండీ అనేది. తన మాటలు వింటుంటే నేను ఇంకా ఎంతో ఎదగాలనిపించేది.నేను పగలూ రాత్రీ రీసెర్చి ప్రోబ్లెం సొల్యూషన్ గురించే ఆలోచించేవాడిని. తన నుంచి కుడా సడన్ గా మెయిల్స్ ఆగిపోయాయి. బహుశా బిజీగా ఉందేమో అని నేను కుడా మెయిల్ చెయ్యలేదు.

 తర్వాత ఒక సారి కాశీ నుండి ఫోన్ చేసింది. నీలాచల్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరుతున్నా, వీలైతే ఖరగ్పూర్లో స్టేషన్ కి రమ్మని. ఆమె గొంతులో ఏదో తేడాని నేను గుర్తించకపోలేదు. వెళ్ళాను. చాలా గంభీరంగా ఉంది. ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు అని అడిగితే, నది కూడా అప్పుడప్పుడు గంభీరంగా ప్రవహించాలి కదండీ అని , "తత్వ శాస్త్రం,సాహిత్యం మనిషిని అవసరమైన సమయాల్లో ఎంతవరకు ఆదుకుంటాయంటారు అంది? జరగరానిదేదో జరిగిందని తెలుస్తోంది. ఏం జరిగిందండీ అనడిగితే, వాళ్ళ తమ్ముడు ఏదో Accidentలో చనిపోయాట్ట. చిన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని accident నుండి తప్పించినందుకు govt వాళ్ళు బ్రేవరీ అవార్డు కుడా ఇచ్చారనీ, ఇప్పుడు అదే accident కి బలైపోయాడు అంది.

 తన చేతిని నా రెండు చేతుల మధ్యకి తీసుకున్నాను. ఆమె నిశ్చలంగా ఉంది. చచ్చు ఓదార్పు మాటలతో ఆ సమయాన్ని కలుషితం చెయ్యదల్చుకోలేదు. మౌనంగానే ఉండిపోయాను. రైలు కదిలిపోయింది. ఈ స్టేషన్లో కొందరిని దించేసినట్టే, రైలు తనని కూడా తన స్టేషన్లో దించేసి మౌనంగా కదిలిపోతుంది. ఇంతే. చివరికి మిగిలేదింతే. అనంతానంత వైరుధ్యాల మనిషి జీవితంలో పరమ పవిత్రమైనది మృత్యువొక్కటే. పుట్టుక ఎంత సహజమో ఇది కూడా అంతే.లోతుగా చూస్తే చావు, పుట్టుక వేరు కాదు. జీవితానికి అర్ధమేమిటన్న ప్రశ్నే అర్ధరహితంగా తోచింది ఆ క్షణంలో. జీవితానికి అర్ధమేఇమిటి? జీవితానికి అర్ధం జీవించడమే! Life is a random event.. a ball in the mountain stream.. బరువెక్కిన మనసుతో వెనక్కి వచ్చేసాను.

 తర్వాత కొన్ని నెలలపాటు ఆమెనుంచి ఎలాంటి సమాచారం లేదు. తను ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు మొబైల్ నంబర్ మార్చేస్తుంది. ఇంటి నెంబరు ఎప్పుడూ ఇవ్వదు. అయినా ఆమె ఇంట్లో ఎప్పుడైనా ఉంటేగా! బహుశా ఒక దగ్గర నిలవలేని తత్వమే ఆమెని నదులకి దగ్గర చేసి ఉండొచ్చు. అసలు ఆమె నదుల మీద పరిశోధన చేస్తోందా లేక తనని తనే శోధించుకుంటోందా? అకస్మాత్తుగా ఏ లోతుల్లోనో ఒక మెరుపు. లోపలా బయటా, చావు పుట్టుకా, మంచి చెడూ ద్వంద్వాలన్నీ మాయమయ్యాయి ఆ క్షణం. హిమబిందుకి అవధుల్లేవు. ప్రకృతిని ఉన్నదున్నట్టు చూస్తుంది. తర్కంతో ముక్కలు ముక్కలుగా కోసి చూడదు. అసలు ఆమే ప్రకృతి వేరు కాదు. సకల జగత్తులోనూ ఆమే నిండి ఉంది.. పువ్వులు, పక్షులు, సెలయేళ్ళు,ఆకాశం, హిమబిందు.. అంతే.. బుద్ధిజంలో చెబుతారు.. "Expand the I in you to fill the entire universe"అని. ఈ భావాలన్నీ ఒక చోట చేర్చి "Non-Duality" and "one" are not synonyms అని నేను రాసిన article చూసి ఒక రోజు సడన్ గా ఫోన్ చేసింది. చాలా చక్కగా రాసారని. కావేరి జన్మస్థలం తలకావేరీ వెళుతోందట.

 మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంటుంది బిందు. ఒక నదిలో ఉన్న వైరుధ్యాలూ, మలుపులు మీ జీవితంలో కూడా ఉన్నాయి అంటే "ఈర్ష్య", "అసూయ" మొదలైన పదాలని తుడిచెయ్యాలన్న ప్రయత్నంలో ఉన్న మీరుఅనవసరంగా వాటిని గుర్తుకు తెచ్చుకోకండి "The path is without any difficulty.. go on.. just like a ball in the mountain stream..." మీరు ఆర్టికిల్లో రాసిన విషయాలే అని నవ్వేది. ఇలా ఎన్నో జ్ఞాపకాలు. ఇంతకీ ఇప్పుడు ఇంత అర్జంటుగా ఎందుకు కలవాలందో? ఆమెను అర్ధం చేసుకోవడం కష్టం. మిగతా వాళ్ళకి అతి సాధారణంగా కనిపించే విషయాలు ఆమెకి చాలా పెద్ద విషయాలు. మిగతా వాళ్ళకి చాలా గొప్పగా కనిపించే విషయాలకి ఆమె అస్సలు ప్రాధాన్యం ఇవ్వదు.ఒక సారి ఇలాగే ఫోన్ చేసి ఇవాళొక గొప్ప పని చేసా తెలుసా అంది. ఏమిటని అడిగితే "తెల్లవారుఝామున గులాబీ పువ్వు మీద కూచుని నన్ను నేను ఫొటో తీసుకున్నా" అంది

What an expression ! అప్రయత్నంగా మాటలు నా నోట్లోంచి వెలువడ్డాయి. "ఏమీ తెలీనట్టు మాట్లాడకండి, నేను ఇదంతా చేస్తుంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు" అంది. నేనెప్పుడు చూసానా అనుకుంటుంటే , తమరు అప్పుడే నిద్ర లేచి ఆకాశంలో morning walk కి వచ్చారు. గుర్తు లేదా అని నవ్వింది. అప్పటికి గానీ నా పేరు రవి అని నాకు గుర్తు రాలేదు. ఎల్లుండి కలిసినప్పుడు కూడా ఇలాంటి మంచు బిందువు స్టోరీ ఏదో చెబుతుందని నిర్ధారణకి వచ్చేసి, ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి conferenceలో నిమగ్నమయ్యాను.అది ఐపోగానే బెంగుళూరులో కలవాల్సిన ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ని కలిసి, మరికొన్ని పనులు పూర్తి చేసుకుని రాత్రి భోజనం చేసి 11 కల్లా బెంగుళూరు సెంట్రల్ స్టేషన్ కి చేరుకున్నాను. గౌహతి ఎక్స్ప్రెస్ అప్పటికే ప్లాట్ఫాం మీద ఉంది. అందులోకి ఎక్కి నా బెర్తు చూసుకుని కూలబడ్డాను. చాలా అలసటగా ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది.

తెల్లారేసరికి రైలు చెన్నై చేరుకుంది. మొహం కడుక్కుని, కాఫీ తాగి కాసేపు పేపర్ చదివి, పక్కన పెట్టేసాను. అదేంటో కిటికీ పక్క కూచుంటే ఏదీ చదవాలనిపించదు. అలా బయటకి చూస్తూ గంటలు గంటలు గడిపెయ్యొచ్చు. ఇదే కిటికీ పక్కన ఎంతో మంది కూచుని ఉంటారు. ఏ ఒక్కరి ఆలోచనలూ ఒకేలా ఉండవు. అయినా కిటికీ మాత్రం అమాయకంగా ఎవరికనా ఒకే దృశ్యం చూపుతుంది. "అందరిలాగే "నేను" కూడా రైలు కిటికీలోంచి అనంతంలోకి విస్తరిస్తుంటాను" డిసెంబరు చలి రాత్రి రాజమండ్రిలో నాకు వీడ్కోలివ్వడానికి వచ్చి, నేను కిటికీ పక్కన కూచున్నప్పుడు ప్లాట్ఫాం మీద నిలబడి హిమబిందు అన్న మాటలు ఎందుకో జ్ఞాపకం వచ్చాయి. అక్కడ "నేను" అనడంలో ఎంత అర్ధం ఉంది. కిటికీలోంచి దూరంగా ఏవో శిఖరాల మీద ఆమె ఒక్క క్షణం కనిపించి మాయమైంది.

ఇంతకీ ఇంత అర్జంటుగా ఎందుకు కలవాలందో? వైజాగ్ చేరేవరకు మళ్ళీ అవే ఆలోచనలు. వైజాగ్ చేరేసరికి రాత్రి 9 అయ్యింది. ట్రైన్ దిగ్గానే తనకి ఫోన్ చేసాను. భద్రాచలంలో అప్పుడే బయలుదేరుతున్నా , ఉదయానికల్లా వైజాగ్ లో ఉంటా అని చెప్పింది. మర్నాడు సాయంత్రం 6 గంటలకి RK beach లోని రామకృష్ణ ఆశ్రమంలో కలవాలని నిర్ణయించుకున్నాం.

                                         ****

 నేను కొంచెం ముందుగా వెళ్ళాను.ఆశ్రమంలో చాలా మంది ధ్యానం చేసుకుంటున్నారు. నేను కూడా ఒక చాప తీసుకుని కూచున్నాను.కొంతసేపటికి ఆమె వచ్చింది. కొంచెం సేపు మౌనంగా కూచున్నాకా లేచి అలా RK beach లోకి నడిచాం. బీచ్ లో కూచున్నాకా చెప్పండి ఇంత సడన్ గా ఎందుకు కలవాలన్నారు అని అడిగాను

"గోదావరికి వరదలొచ్చాయి" అంది.

"వరద రావడానికి కారణం?"

"ప్రతిదానికీ కారణాలుండాలనుకోవడం అమాయకత్వం"

"కానీ ఇంత అకస్మాత్తుగా వచ్చిందంటే బలమైన కారణం ఉండాలి కదా"

"వరదంటేనే అకస్మాత్తుగా వచ్చేదని. అకస్మాత్తుగా రాని వరదకూడా ఉంటుందేమిటి?"

"మీతో నేను వాదించలేను గానీ, విషయం చెప్పండి. ఎందుకు అర్జంటుగా కలవాలన్నారు?"

అలా రండి దారికి అని నా కళ్ళల్లోకి వెర్రిగా చూస్తూ, నా చేతులు పట్టుకుని "నన్ను పెళ్ళి చేసుకోండి" అంది

నేను స్థాణువునైపోయాను ఒక్క క్షణం. ఆమె జీవితంలో ఎవరినీ పెళ్ళి చేసుకో(లే)దని నా ప్రగాఢ విశ్వాసం. ఆనకట్ట కట్టడం ప్రవాహానికి ఇష్టం ఉండదు. ఇదే విషయం ఆమెతో అంటే,

"ఇది ఆనకట్ట అని ఎందుకనుకుంటున్నారు? సాగరసంగమం అనుకోవచ్చు కదా"

"కానీ ఆ సముద్రం నేనే అని మీకెందుకు అనిపించింది?"

"నిజం చెప్పండి...మీలో సంగమించే నది ఏమిటన్నది మీకు మాత్రం తెలీదా? మీరు నన్ను ప్రేమించలేదా అంది..

కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి...చీకటి వెలుగులు సముద్రంతో దోబూచులాడుతున్నాయి... అల్లంత దూరంలో అవని ఆకాశం కలిసిపోయినట్టు భ్రమ...

ఆమెకు చెప్పగలను..." ఆమె సమక్షంలో నా హృదయం లయ తప్పుతుందని. నా మాటలు చెల్లాచెదురౌతాయని. ఆంక్షల్లేని ప్రేమలో నేను పూర్తిగా కరిగిపోతానని... నాలో ఒక సముద్రం పొంగి ఆ అలలు ఆమె పాదాల్ని స్పృశించడానికి మౌనంగా పరవళ్ళు తొక్కుతాయని... ఆమె సమక్షంలో నేను ప్రతి క్షణం మరణించి మళ్ళీ కొత్తగా జన్మిస్తానని..

"మీరు నన్ను ప్రేమించలేదా" అని అడిగింది.. నాకామెతో చెప్పాలనుంది "నేను" "ఆమె" "ప్రేమ" వేరు కాదని..

కానీ ఆమెకెలా చెప్పగలను? రెండేళ్ళ క్రితం నాకు చనిపోయినట్టు వచ్చింది కల కాదని..

త్వరలో నిజమవబోతోందని...

రేపు మృత్యువు నా తలుపు తడుతుందన్నది ఊహ కాదని..

నిజమని...

నేనిక ఎన్నాళ్ళో బ్రతకనని...

ఆమెతో..

ఎలా...?

                              -------------------- x --------------------

(రచనా కాలం : 2007, ఫిబ్రవరి)

Monday, April 2, 2012

శూన్యంలో పూలు

పొగ త్రాగరాదులో "దు" చెరిపి వేసే చిలిపి బాల్యాలునావల్ల కాదు మొర్రో అని స్కెచ్చు పెన్ను మొత్తుకుంటే వెనక కుచ్చు తీసి దాన్లో నీళ్ళు పోసి ఇంకా రంగులు రాబట్టే ప్రయత్నాలు, కరెంటు పోయిన వేసవి రాత్రి కొవ్వొత్తి వెలుగుతుంటే కొవ్వు కరిగి రకరకాల కళాకృతులు, నాలాగేసినాడు దొంగ అని పంటలేసుకోడాలువినాయక చవితి నాడు పనసాకుల బుట్టల్లో రుచిగా ఉడికే కుడుములు, "రెండు సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే ఏర్పడే ఏకాంతర కోణాలు సమానాలు" అని వల్లెవేస్తున్న సూర్యారావు మేష్టారి మేడ మీద ట్యూషన్ పిల్లలు, చెల్లా చెదురైన ఏడు పెంకులూ దొంతు పెట్టేసామని పొంగిపోతుండగానే మళ్ళీ కూలిపోడాలు,  వైజాగు పాత పోస్టాఫీసుకీ, కైలాసపురానికీ మధ్య అలుపెరుగక ట్రిప్పులు కొట్టే 48A బస్సులు, మిలే సుర్ మేరా తుమారా అని డిడిలో వస్తుంటే అర్ధం తెలీపోయినా కళ్ళప్పగించి చూడ్డాలు, వానజల్లు కొడుతుంటే కిటికీ పాసుపోత్తోంది అనే చంటాళ్ళు, టీచరు రాని క్లాసురూంలో బ్లాక్ బోర్డుమీదకెక్కే మాట్లాడిన వాళ్ళ పేర్లూ, మొదటిసారి గెడ్డం చేసుకున్నాకా చెంపల మీద జిల్లుమన్న ఆఫ్టర్ షేవ్ లోషన్లు, పరిక్ష రోజు ఉదయం హాల్ టిక్కెట్లకి అంటిన పసుపు కుంకుమలు, 045 రేనాల్డ్స్ ఫైన్ కేర్బ్యూర్ పెన్నులతో రాసి రాసి నింపిన అడిషినల్ షీట్లూ, పీచు మిఠాయి జాడీలోంచి పొట్లాంలోకి ఎన్ని పుల్లలొస్తున్నాయో అని ఆశగా చూడ్డాలు, బాత్రూంలో బాల్టీకి అతికించబడిన బొట్టుబిళ్ళలు, వానలో తడిసి పరిమళించే నీలగిరి చెట్టు బొంగరాలు, సాయంకాలపు రైలు కిటికీలో బింబప్రతిబింబాల నాట్యాలు, హైద్రాబాద్ కోఠీలోనూ, విజయవాడ లెనిన్ సెంటర్లోనూ, వైజాగు పోలీస్ బేరెక్సు దగ్గరా పాత వాసన వేసే పుస్తకాల కొట్లూ, తిరుపతి పాసింజర్లో కరకరలాడే సమోసాల మధ్య తొక్క తియ్యని బంగాళాదుంపలు, బయట వాన పడుతుంటే బాత్రూంలో వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి అద్దం మీద ఆవిరిని అరచేత్తో తుడిచి మొహం చూసుకోడాలూ, వెయ్యి సంవత్సరాలు వేలాడే పోలిథీన్ కవర్లో ఒక్కరోజులోనే వాడిపోయే మల్లెపూలు, "ఓయబ్బో మీ బొట్టెడు నోట్లో ఏలెడితే కొరకనేడు మరి" అనుకుంటూ పల్లెటూరి తగూలు, హాస్టల్ బయట టెలిఫోను బూతులో మాటకి విలువ పెరగడాలూ, తిరునాళ్ళలో కళ్ళముందు ఎగిరే రంగు రంగుల సబ్బు బుడగలు, నూతి చప్టాలో నానుతున్న బాదం చెట్టు ఆకులు, గూట్లో ఇసక అంటుకున్న లైఫ్ బాయ్ సబ్బులు, రైలొస్తుంటే గుండె దడ హెచ్చే ప్లాట్ ఫారాలు, క్లాసు పుస్తకాల మధ్య ఒద్దికగా ఒదిగిపోయే చందమామ బాలమిత్రలు, తిరుపతి గుండు మీద చల్లటి నీళ్ళు పోసుకున్నాకా వెచ్చగా తగిలే అరచేతుల వింత స్పర్శ, గరుకు గచ్చు మీద అష్టాచెమ్మా కోసం చింత పిక్కలు అరగదీస్తుంటే పుట్టే వేడి, రాజమండ్రిలో సంధ్య వేళ జాలరి వల మీద చీకటి వెలుగులు చిత్రించే వింత చిత్రాలు, కోరమండల్ ఎక్స్ ప్రెస్లోంచి గోదావరిలోకి భక్తిగా జారే చిల్లరనాణేలు, స్టేషన్ చేరువవుతుంటే అనంతంగా చీలిపోయే రైలు పట్టాలు, దిద్దీ దిద్దీ లావెక్కిపోయే పలక మీద , ఆలు, దారిపక్కన ఏమీ ఆశించకుండా పూసే చంద్రకాంతం పూలూ, కావేరీ తీరాన రంగనాథుని కోవెళ్ళూ...