హంపిలో సూర్యాస్తమయమైంది. తన అవశేషాల్ని
తుంగభద్రలో వదిలేసి సూర్యుడు చీకటి ఏకాంతంలోకి జారుకుంటున్నాడు. ఒడ్డుకి చేరుకున్న జాలర్లు తెప్పలు బోర్లించేసి, నదిలో
చేతులు కడుక్కుంటున్నారు రాయి మీద కూచుని తదేకంగా నదిలో సంధ్య కాంతిని
చూస్తోంది భువన. డిజిటల్ కెమెరాలో అప్పుడే తీసిన ఫొటోని
ఆమెకు చూపిస్తూ పెడుతూ పక్కన కూచున్నాడు మోహన్. జాలర్లు చేతులు కడుక్కుంటుంటే
వాళ్ళ వేళ్ళ సందుల్లోంచి జారే నీటిబొట్లతో సహా చిత్రం కెమెరా స్క్రీను మీద
కనబడుతోంది.
"బావుంది!" ముభావంగా అనేసి మళ్ళీ తన ప్రపంచంలోకి
వెళ్ళిపోయింది.
మామూలుగా ఐతే అద్భుతమనో,
వండ్రఫుల్ అనో అనకుండా ఉండదే , ఈమెకేమైందో
ఇవాళ అనుకుంటూ కెమెరాని బ్యాగులో పెట్టేసి అతను కూడా
నదిని చూస్తున్నాడు. రాళ్ళగుట్టల మధ్య గంభీరంగా ప్రవహిస్తూ
తుంగభద్ర. చుట్టూ
నిశ్శబ్దం. ఏ రాయిని కదిపినా సంగీతాన్నో , ఒక కన్నీటి కథనో వినిపించే ఆ సీమలోని నిశ్శబ్దంలో ఒక వింతైన మార్మికత ఉంది. మూడురోజుల పాటు కన్నుల పండగగా
జరిగిన హంపీ ఉత్సవాలు నిన్నటితో ముగిసాయి. ఒక మహోత్సవం
పూర్తయ్యాక ఆవరించే నిస్త్రాణ హంపీని ఆవరించింది. తమతో పాటు ఉత్సవాన్ని చూడ్డానికి
వచ్చిన కళాకారులంతా ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోయారు. ఆర్టిస్ట్
శ్యాం బలవంత పెట్టడంతో వీళ్ళిద్దరూ మాత్రం
ఉండిపోయారు.
శ్యాంతో తమ పరిచయం కూడా చిత్రంగా
జరిగింది. విశాఖపట్నం
లాస్య డేన్స్ అకాడమీలో భరతనాట్యం నేర్చుకుంటున్న వాళ్ళిద్దరూ, హంపీ ఉత్సవం చూడ్డానికి అకాడమీలోని ఇతర విద్యార్ధులతో కలిసి మూడు రోజుల
క్రితమే అక్కడకి వచ్చారు. ఉదయం హంపీ అంతా తిరగడం, రాత్రయ్యేసరికి వేదికల వద్ద సంగీతం, నాట్యం
ప్రోగ్రాముల దగ్గర సెటిలవడం. ఇదే వారి దినచర్య గత మూడు
రోజులుగా. స్వయానా
కళాకారులు కావడంతో ఇద్దరికీ ఏదో లోకంలోకి వచ్చినట్టుంది. అలా రెండో రోజు సాయంత్రం హేమకూట
పర్వతంపైన రాతి మండపం పక్కన ఉన్న బండరాయి మీద భువనని భరతనాట్య భంగిమలో నిలబడమని
కెమెరా ఫోకస్ చేస్తున్నాడు మోహన్ పక్కనే నిల్చుని
"భంగిమా" అంటూ
ఏడిపిస్తున్న ఫ్రెండ్స్ ని "ఉండండర్రా" అని అదిలిస్తూ.
"బావుంది.. కానీ" , ఎవరివో మాటలు వినబడడంతో ఫొటో ఎలా వచ్చిందోనని ఆతృతగా స్క్రీన్లోకి
చూసుకుంటున్న మోహన్ పక్కకి తిరిగాడు. పక్కన ఉన్నతను ఇంకా
స్క్రీన్లోకే చూస్తున్నాడు. వయసు నలభై నలభై ఐదు మధ్య ఉండొచ్చు. బ్లూ జీన్స్ మీద, వైట్ కలర్ షార్ట్ కుర్తా వేసుకున్నాడు. గుబురు
గెడ్డం, కళ్ళద్దాలు.
"చెప్పండి" అన్నాడు మోహన్.
"ఆమెని అటు తిరిగి నిల్చోమని, మీరు అటువైపు వెళ్ళి
లాంగ్ షాట్లో , ఆమెనీ, కొలనులో ఆమె
రిఫ్లెక్షన్నీ కేప్చర్ చేస్తే ఇంకా బావుంటుందేమో! " అన్నాడు.
వచ్చేటప్పుడు కొలన్ని దాటుకునే వచ్చినా ఈ ఐడియా తనకి రాలేదేంటా
అనుకుంటూ , అభినందన పూర్వకంగా అతనివైపు చూసాడు.
"ఇంకా ఎంత సేపు నిల్చోవాలి?" రాయి మీంచి భువన
అరుస్తోంది.
"ఇంకొక్క ఫొటో భువనా.. ఇటు తిరుగు ప్లీజ్"
అంటూ కెమెరా పటుకుని వెనకవైపు పరుగెత్తాడు మోహన్.
"అబ్బా నీ ఫొటోల పిచ్చితో చంపేస్తున్నావ్" అంటూ
ఇటు తిరిగింది భువన.
కెమెరా క్లిక్ మనిపించి "వండ్రఫుల్ ..
సింప్లీ ఫెంటాస్టిక్" అంటూ అటునుండి
పరిగెత్తుకొస్తున్నాడు మోహన్. సాయంకాలపు నిశ్చలమైన కొలనులో ఆమె ప్రతిబింబం, పక్కనే
రాతి మండపం. నిజంగానే ఫొటో అద్భుతంగా వచ్చింది.
"ఏది ఏది..చూపించు" అంటూ అంతా అతని వెనక్కి చేరారు. ఫొటో చూసి "వావ్.. సూపర్" అంటూ
అభినందిస్తున్నారు. భువన కూడా సంబరంగా బ్యూటిఫుల్ అంటోంది.
"నే చెప్పలేదూ.." అన్నట్టు అతను కళ్ళతోనే
నవ్వుతున్నాడు.
"ఇంతకీ మీరు?"
"నా పేరు శ్యాం. నేనో ఆర్టిస్ట్ ని. ఇక్కడే హోస్పేట్లో ఉంటాను."
"గ్లాడ్ టు మీట్ యు" చేయందించాడు మోహన్.
అంతా ఏదో ఒక కళాకారులే కావడంతో రెండ్రోజుల్లోనే చాలా క్లోజ్ అయిపోయారు. పదేళ్ళ క్రితం ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చేస్తున్నప్పుడు,
ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాట్ట శ్యాం ఇక్కడకి. ఇక్కడ
కళ చూసి ముగ్ధుడై ఇంక ఇక్కడే ఉండిపోయాట్ట. ఉత్సవ్ అయిపోయాకా
రెండు మూడు రోజులు ఉంటే తీరిగ్గా హంపీ అంతా చూపిస్తానని బలవంత పెట్టడంతో వీళ్ళిద్దరూ
ఉండిపోయారు.
"ఇంక వెళ్దామా" అన్నాడు చీకటి పడుతుండడంతో మోహన్. ఆమె
వినిపించుకోలేదు. ఇంకా చీకట్లో మునిగిపోతున్న తుంగభద్రనే
చూస్తోంది.
"భువనా.. ఏమైంది నీకు.. మళ్ళీ మీ అమ్మానాన్నా ఏమైనా గొడవ పడ్డారా?" కాదని తల అడ్డంగా ఊపి
"వచ్చే ఏడాది హంపీ ఉత్సవంలో మనం పెర్ఫార్మ్ చెయ్యాలి"
"ప్రయత్నిద్దాం"
"ప్రయత్నించడం కాదు. మనం చేస్తున్నాం అంతే!"
"సరే చేస్తున్నాం.. ఇంక వెళ్దామా?" అతను లేచాడు. ఆమె కూడా అతన్ని అనుసరించింది.
***
మేడ మీద వెన్నెల్లో రెండు కుర్చీల్లో కూచున్నారు ఇద్దరూ. ఎవరితోనో ఫోన్ ముగించుకునొచ్చిన శ్యాం, "ఎలా గడిచింది మధ్యాహ్నం? సారీ అర్జెంటు పని తగలడంతో
బళ్ళారి వెళ్ళాల్సి వచ్చింది. రేపటి నుండీ ఐ విల్ అకంపెనీ యు" అన్నాడు.
"ఇట్సొకె సార్.. విఠలాలయం మళ్ళీ చూశాం. మొన్న హడావిడిలో సరిగ్గా చూడలేదు. అద్భుతమైన శిల్పకళ
. సాయంత్రం అలా తుంగభద్ర ఒడ్డుకి వెళ్ళొచ్చాం.." చెప్పాడు మోహన్.
"ఓ..ఒకె...గ్రేట్... ఎస్... విఠలాలయం ఈజ్ ఎ మాష్టర్ పీస్.. " అన్నాడు శ్యాం.
"హంపీ చాలా బావుంది. కానీ పదేళ్ళ పాటు మిమ్మల్ని కట్టి పడేసిందంటే మాకు
అందనిదేదో హంపీలో ఉండి ఉండాలి" అని నవ్వింది భువన
కాసేపు మౌనంగా ఉండిపోయి శ్యాం అలా చీకట్లో ఊగుతున్న కొబ్బరి చెట్లని చూస్తూ
"ఇక్కడి రాళ్ళు రాళ్ళు కాదు భువనా.. ఒక్కోటీ ఒక్కో కన్నీటి కావ్యం.. అసలు హంపీ శిథిలాల్ని చూసి కళాదేవత కార్చిన
కన్నీరే తుంగభద్ర అనిపిస్తుంది... నాకిప్పటికీ అనుమానం నేను హంపీలో ఉంటున్నానా, హంపీనే నాలో ఉందా
అని! " అతను ఉద్వేగంగా చెప్పుకుపోతున్నాడు.
"Beautifully quoted"
అంది భువన.
కొత్తవాళ్ళ ముందు అంత ఎమోషనల్ అవడం ఎందుకు అనుకుని అతను నవ్వేసి , "ఐతే చెప్పండి,
ఈ డేన్స్ మీద మీ ఇద్దరికీ ఆసక్తి ఎలా కలిగింది? అని అడిగాడు.
భువన చెప్పడం మొదలు పెట్టింది.
"చిన్నప్పటి నుండీ ఏ పాట విన్నా
లయబద్దంగా కాళ్ళు కదిలినా, నాట్యం నేర్చుకునేందుకు ఎప్పుడూ టైం
దొరకలేదు. ఒక్కోసారి మన దారి ఏది అని
తెలుసుకోడానికి చాలా టైం పట్టేస్తుందనుకుంటాను. అందుకే భరతనాట్యం పుట్టిన గడ్డ మీద NIT , తిరుచ్చి
లో ఇంజనీరింగ్ చేసినా నాట్యం నేర్చుకునే ప్రయత్నం చెయ్యలేదు. మాస్టర్స్ కోసం
స్విట్జర్లాండ్ వెళ్ళాను. ప్రాజెక్టు
వర్కు రోభోటిక్స్ మీద చేస్తున్నప్పుడు మా కాలేజిలో ఒక ఇండియన్ సీనియర్ రాసిన Computational model for
robotic grasps using Indian classical dance. అనే పేపర్ నా
కళ్ళబడింది.. రోబోటిక్స్ లో రకరకాల గ్రేస్ప్స్ ని వర్ణించేందుకు భరతనాట్యంలోని ముద్రల్ని వాడుకునే ఆలోచన. That paper was quite interesting.. నేను ఆ వర్కుని ముందుకు
తీసుకెళ్దామనుకున్నాను. అప్పుడే భరతనాట్యం
మీద నా రీసెర్చి మొదలయ్యింది.ఒకవైపు యంత్రాలకి ప్రాణం పొయ్యాలన్న తపన, మరోవైపు
విశ్వమోహనమైన లాస్యం. భరతనాట్యం ఎలాగైనా నేర్చుకోవాలని తపన కలిగింది. దేశం కాని
దేశం. భరతనాట్యం ఎవరు నేర్పుతారు? అప్పుడే చూసాను ఇంటర్నెట్లో.. మోహన్
నిర్వహించే "ఆన్లైన్ భరతనాట్యం ట్రైనింగ్". బిగినింగ్ నుంచీ మొదలుపెట్టి
వీడియోలు, ఫొటోలు , వ్యాసాలు. ఆ
కృషి అమోఘం అనిపించింది. అలా మోహన్ పరిచయం. తనకి తెలిసిన కళని నలుగురికీ పంచాలన్న
అతని తపన నన్ను కదిలించింది. అలా ఇరవై రెండేళ్ళు నాలో నిద్రాణంగా ఉన్న కళ మోహన్
పుణ్యమా అని బయటకి వచ్చింది. మాస్టర్స్ మధ్యలో మానేసాను.ఇండియా వచ్చేసాను.
ఐదేళ్ళుగా నాట్యమే నా జీవితం ఐపోయింది. ఇప్పుడు ఇద్దరం కలిసి
నేర్చుకుంటున్నాం.. ఒక విధంగా నాలో కళకి
మోహనే కారణం" అంది
"అబ్బే.. నేను చేసింది ఏమీ లేదండీ.. నాట్యం, ఫొటోగ్రఫీ నా హాబీలు. భుక్తికోసం ఒక కంప్యూటర్ ఇనిస్టిట్యూట్
ఉంది. చిన్నప్పుడు చదువుకున్న పల్లెటూళ్ళో నాట్యం నేర్పేవాళ్ళు లేక నేను పడిన
ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకని నేను నేర్చుకోవడం మొదలు పెట్టాక బుర్రలోకి ఈ
ఆలోచనొచ్చింది. వెంటనే అమలు పరిచా. ఒకవైపు నేర్చుకుంటూనే అది ఆన్లైన్ లో అందరికీ
నేర్పించాను" మోహన్ అందుకున్నాడు.
"వావ్.. ఐతే భువన మోహన్ కి
ఏకలవ్య శిష్యురాలన్నమాట.. గుడ్.. గుడ్.." అన్నాడు శ్యాం.
"నేను బ్రొటనవేలు మాత్రం అడగలేదు సార్" మోహన్ నవ్వాడు.
"Jokes
Apart... మీ ఇద్దరి కథ అద్భుతంగా ఉంది... మన జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఏక్సిడెంటల్
గానే జరుగుతాయన్న నా థీరీకి మీ కథ మరింత బలాన్నిచ్చింది.. నాట్యం మీద మీకున్న Passion చూస్తుంటే మీ ఇద్దరి నాట్యాన్ని వెంటనే నాకు చూడాలని ఉంది.. కెన్ యు
పెర్ఫార్మ్ నౌ? ఎనీ సాంగ్.. వుయ్ కెన్
ప్లే ఫ్రం నెట్ టూ.."
"సడన్ గా అంటే.. " భువన , మోహన్
ఒకేసారి అన్నారు.
"కొన్ని సడన్ గానే బావుంటాయి" అంటూ లోపలికి పరుగెత్తాడు శ్యాం.
బహుధారిలో రూపకల్పన చేసిన జతిస్వరం..
సా ని ప మ.. నీ ప మ గ... సా మా గా... స గ మ ప... గ మ ప ద ని స.. ని ప మ .. నీ
ప మ గ.. సా మా గా..
ఎంత పురాతన స్వరాలో అధునాతన డివిడి ప్లేయర్లో
హాయుగా సాగిపోతున్నాయి. అతి జటిలమైన నృత్త జతుల రీతుల్ని సునాయాసంగా చేసి తమ పటువు చాటుకుంటున్నారు. జతులకు స్వరాలను జోడించి ప్రదర్శించే జతిస్వరంలో మాటలుండవు, పూర్తిగా నృత్తమే. మిగతా నాట్యాల్లో ఉండే అభినయం, ఒక కథని ముఖంలోని భావాల ద్వారా చెప్పడం ఇందులో ఉండదు. అయినా ఒక జతుల వరుస పూర్తయినప్పుడల్లా సరిగ్గా తాళానికి తగ్గట్టు నర్తిస్తూ శ్యాంని కట్టిపడేసారిద్దరూ.
"వండ్రఫుల్.. "
పూర్తవగానే చప్పట్లు కొట్టాడు శ్యాం..
"థాంక్యూ" అంది భువన . మోహన్
చిరునవ్వు నవ్వాడు.
"మీరిద్దరూ ఇంత మంచి డేన్సర్స్ అని అనుకోలేదు.. What a grace and clarity of movements !!. It is a delight watching you perform here. " అని ఒక్క నిముషం ఆగి మళ్ళీ
కొనసాగించాడు. "నా నెక్స్ట్ సెట్ ఆఫ్ పెయింటింగ్స్ నాట్యం మీద వేద్దామన్న
ఆలోచనొచ్చింది... భువనా కెన్ యు బీ మై మోడల్?"
అప్పటిదాకా ముందు పొగడ్తకి ఎలా
స్పందించాలో తెలీక చూస్తున్న భువన "వ్వాట్?? " అంది
"ఇప్పటిదాకా నాట్యం మీద పెయింటింగ్స్ వెయ్యలేదు.. సో ఇఫ్ యు కెన్ బి మై
మోడల్.. దట్ వుడ్ బి గ్రేట్.."
"ఐ హావ్ బెటర్ తింగ్స్ టు డు" అనేసి చకచకా మెట్లు దిగి
వెళ్ళిపోయింది.
* * *
"నేను వచ్చేసాక ఏం మాట్లాడుకున్నారు?"
"ఏం లేదు నిన్ను రిక్వెస్టు చెయ్యడంలో అతనికి ఎలాంటి దురుద్దేశము
లేదన్నారు.."
"నిజంగా దురుద్దేశం ఉన్నవాళ్ళెవరూ అలా ఒప్పుకోరు మోహన్.. లేకపోతే ముక్కు
మొహం తెలీని మనల్ని మరో వారం ఉంటే హంపీలో మనకి తెలీని వింతలు చూపిస్తానని ఉంచేసినప్పుడే
నాకు అనుమానం వచ్చింది"
"లేదు భువనా.. ఒక్కసారి ఆలోచించు..
మోడలింగ్ అనగానే అర్ధనగ్నంగా కెమెరా ముందు నిలబడ్డమని ఎందుకనుకుంటున్నావ్? చక్కగా పట్టుచీర కట్టుకుని, నాట్యానికి
తగ్గట్టు అలంకరించుకుని , అతని పెయింటింగ్ కి సహకరింఛడమే
కదా.. కళ కోసమే కళ"
"అయినా అలా ఇంకొకళ్ళ ముందు అలా నిలబడ్డం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది
మోహన్"
"మనకి నెక్స్ట్ యియర్ ఉత్సవ్ లో పాల్గొనేందుకు సహాయం కూడా చేస్తా
అన్నారు"
"ఓ మళ్ళీ ఇదొకటా.. మన టాలెంటు మీద నాకు నమ్మకం ఉంది మోహన్.. మనకి ఎవరి సిఫార్సులు అక్కరలేదు. కొంచెం
మెత్తబడిందనుకున్న భువన మళ్ళీ కోపగించుకుంది.
"టాలెంటు నిరూపించుకునేందుకు కూడా ఒక చానల్ అవసరం కదా.. ఆ చానల్ ఇతను
ఎందుకు కాకూడదు?"
"ఏమో మోహన్ నాకు ఇష్టం లేదు..
గుడ్ నైట్" తలుపు దభీమని వేసేసింది. చేసేదేమీ లేక మోహన్ తన గదిలోకి
నడిచాడు.
***
హజార్రామాలయం లో కాళీడు మీద నర్తిస్తున్న కృష్ణుడి అద్భుత శిల్పం, ఏకశిలా రథంలో
ఒకప్పుడు తిప్పితే తిరిగే చక్రాలు, విఠలాలయంలో సరిగమపదనిసలు
వినిపించే స్తంభాలు, స్వయంగా హంపీలో ప్రతి అణువు
చూపిస్తున్నాడు శ్యాం. ఒక్కో విషయం
చెప్తున్నప్పుడు ఆ కళ్ళలో మెరుపు. నిన్న రాత్రి ఆ సంఘటన తర్వాత ఉదయం నుంచీ ఆ
ప్రస్తావనే తేలేదు శ్యాం, మోహన్. వాళ్ళిద్దరే
మాట్లాడేసుకుంటున్నారు. భువనకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ పక్కన నడుస్తోందే గానీ,
ఏవో ఆలోచనలు. మహానవమి దిబ్బ దగ్గరకొచ్చేసరికి సాయంత్రమైంది. దాదాపు
ఎనిమిది మీటర్ల ఎత్తున్న మహానవమి దిబ్బ మీద కూచుని దసరా వేడుకలు చూసేవారుట రాజు
గారు. అక్కడ నుంచి దిగి కొద్ది దూరం నడిచాక ఒక దగ్గర ఆగి శ్యాం భువనవైపు తిరిగి
"ఇది నువ్వు విజయం సాధించిన చోటు" అన్నాడు నవ్వుతూ.
అకస్మాత్తుగా అతను అలా అనేసరికి, చుట్టూ చూసింది. అక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏమీ కనిపించలేదు.
"ఇక్కడ నేను విజయం సాధించడమేమిటి?" ఆశ్చర్యంగా అడిగింది.
మోహన్ అర్ధమైనట్టుగా నవ్వుతున్నాడు. భువనకి ఇంకా ఉక్రోషంగా ఉంది.
నీ పేరు "విజయ్ " అయ్యుంటే ఇంకా బావుండేది కదా మోహన్ అన్నాడు. అప్పుడు శ్యాం కవి హృదయం అర్ధమై తనూ వాళ్ళ
నవ్వులతో శ్రుతి కలిపింది.
కాసేపటికే అంతా మర్చిపోయి తిరిగి శ్యాంతో మామూలుగా మాట్లాడగలుగుతోంది.
"sorry sir.. నిన్న అలా ప్రవర్తించినందుకు.. i
should have been more polite" ఇంటికి తిరిగొచ్చేసాక అంది.
"ఇట్సోకె భువనా.. నువ్వు నా కూతురిలాంటిదానవని సెంటి డైలాగులు
చెప్పను.. As an artist i worship beauty.. మరోసారి ఆలోచించు... నీకేమాత్రం
ఇబ్బంది కలిగినా , You can leave the very next moment.."
"అవును భువనా... కళకోసమే కళ.. మరొక్క సారి ఆలోచించు.."
మరీ బెట్టు చేస్తే బావుండదని "సరే మీ ఇష్టం" అంది.
***
హోస్పేట్ స్టేషన్లో ట్రైను గురించి ఎదురుచూస్తూ టీలు తాగుతున్నారు
ముగ్గురూ.."థాంక్సెలాట్ భువనమోహనం.."
ఈ మధ్య వీళ్ళిద్దరినీ అలా పిలుస్తున్నాడు శ్యాం.
"మేం చెప్పాలి సార్
థాంక్స్.. నేను అంత అందంగా ఉంటానని నాకే
తెలీదు.. పెయింటింగ్స్లో అద్భుతంగా
కేప్చర్ చేసారు"
"అవును. ప్రకృతి చెయ్యలేని పనిని కళ చేస్తుంది. నిజంగా
వెదురుపొదని చూస్తే అంత బాగా కనిపించకపోవచ్చు.
కానీ అదే వెదురుపొదని ఒక పెయింటింగ్‍లో చూసినప్పుడు కలిగే అనుభూతి
వేరు" మెరిసే కళ్ళతో శ్యాం
చెప్తున్నాడు.
"వాస్కొడాగామా రింద హౌరా హోగుదువ ఎక్స్ప్రెస్... " అనౌన్స్ మెంట్
వినిపించడంతో , "ఒకె మరి.. జూన్లో బెంగుళూరులో
సెలక్షన్స్ ఉంటాయి.. సెలక్షన్ కమిటీ ముందు పెర్ఫార్మ్ చేసే అవకాశం కల్పించడం నా
బాధ్యత.. బట్ యు హేవ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్"
"ష్యూర్ సర్.. థాంక్స్..."
రైలు కదిలిపోయింది. ప్లాట్ ఫాం మీద చేతులూపుతూ శ్యాం మిగిలిపోయాడు.
కిటికీలోంచి మోహన్ , భువన అలా అతన్నే చూస్తున్నారు. గెడ్డం మీద
సాయంత్రపు వెలుతురు. ఫ్లాట్ ఫాం మీద గజిబిజి గందరగోళపు ప్రపంచం మధ్యలో లయ
వెతుక్కుంటున్న ఒక కళాకారుడు. విచిత్రంగా అనిపించింది ఆ దృశ్యం. రైలు వేగం
పుంజుకుంది. మనుషులు, నల్ల పలకల బెంచీలు, ఎర్ర అక్షరాల డిజిటల్ డిస్ప్లేలు అన్నీ దూరం ఐపోయాయి. బళ్ళారి దాటేసరికి
చీకటి పడిపోయింది. ఎదురెదురు బెర్తుల్లో కూచున్నారు ఇద్దరూ . ఇద్దరి మధ్యా ఎడతెగని ఆలోచనల ప్రవాహం. దూరంగా రాత్రి తన నల్లటి రంగుని ప్రపంచానికి
పూస్తోంది. మబ్బుల మధ్యనుంచి చంద్రుడు తొంగిచూస్తున్నాడు.
భువన ఆలోచిస్తోంది. రేపటి నుండీ మళ్ళీ
మాధవి గారి నాట్య పాఠాలు, రామకృష్ణ మఠంలో సాయంత్రపు ధ్యానాలు,
ఆశీల్ మెట్ట జంక్షన్ సిగ్నెలు బస్టాపు దగ్గర పడిగాపులు, యూనివర్సిటీ లైబ్రరీలో దుమ్ముపట్టిన పుస్తకాల మధ్య వెతుకులాట..యూరప్ నుండి
వచ్చేసాకా ఆపేసిన రీసెర్చి ఇక్కడే కొనసాగిస్తోంది. వీటికి తోడు అమ్మానాన్నల
గొడవలు. ఈ జీవితాన్ని ఈదడం కంటే, పార్షియల్ డిఫరెన్షియల్
ఈక్వేషన్స్ సాల్వ్ చెయ్యడమే ఈజీనేమో! హంపీ
ఒక స్వాప్నిక జగత్తు అయితే, వైజాగు వాస్తవ ప్రపంచం
అనిపించింది. వారం రోజులుగా హంపీనే తమ జీవితం ఐపోయింది. శ్యాం చూపించకపోతే
హంపీలోని వింతలు , అందాలు తాము చూడగలిగే వాళ్ళమా?
ఏంటి ఆలోచిస్తున్నావ్ అన్న మోహన్
ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చి,
"ఈ రైలు స్వాప్నిక ప్రపంచం నుంచి వాస్తవిక ప్రపంచానికి చేస్తున ప్రయాణమా?" అనిపిస్తోంది అంది.
"అరె.. నా మనసులో మాట నీకెలా తెలిసింది?" అన్నాడు.
నవ్వింది భువన. మళ్ళీ కాసేపటికి
"ఈ కళ అంతా ఒక మాయలా ఉంటుంది మోహన్" అంది
"బుద్ధుడి తల్లి పేరేంటి?" కిటికీలోంచి
దూరంగా కనిపిస్తున్న కొండలవైపు చూస్తూ అడిగాడు
"నేనొకటంటే నువ్వొకటంటావ్...
తెలీదు.. అయినా ఇప్పుడు ఆవిడెందుకు?"
"ఆమె పేరు మాయ.... "
"అయితే.."
"బుద్ధుడి తల్లి మాయ.. బుద్ధుడు సత్యం.. మాయలోంచే సత్యం
పుడుతుంది.." నవ్వాడు మోహన్.
"వావ్... భలే చెప్పావే..
" మెచ్చుకోలుగా చూసింది.
***
ఆరునెలలు గడిచాయి. అనుకున్నట్టుగానే, బెంగుళూరు
సెలక్షన్సులో తమని తాము నిరూపించుకుని , అదే సమయానికి అక్కడ
చిత్రకళా పరిషత్తులో శ్యాం పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉండడంతో,
అది కూడా చూసుకుని ఆనందంగా నిన్నే వైజాగు తిరిగొచ్చారు.
"హంపీ ఉత్సవ్ లో మనం చెయ్యబోయే నాట్యం మాత్రం మనమే కంపోజ్ చెయ్యాలి
భువనా.. ఎవరో రూపకల్పన చేసిన దాన్ని అభినయించడంలో తృప్తి లేదు" అన్నాడు మోహన్
యూనివర్సిటీ లైబ్రరీ ఎదురుగా సిమెంటు బెంచీ మీద కూచుని టీ సిప్ చేస్తూ..
"ఏమో మోహన్ నాకైతే అంత టాలెంటు
లేదు.. నా ఇన్నోవేషన్ అంతా రీసెర్చి మీదే పెడుతున్నా"
" పోనీ థీం అయినా ఆలోచించు. స్టెప్స్ నేను కంపోజ్ చేస్తా" అన్నాడు
ఇద్దరూ ఎంత ఆలోచించినా ఏమీ తట్టడం లేదు. ఉత్సవ్ దగ్గర పడుతోంది. టెన్షన్
పెరిగిపోతోంది. దసరాకి తన ఊరు వెళ్ళిన భువన, అక్కడ
అర్ధనారీశ్వర వేషం చూసి తిరిగొచ్చి మోహన్ తో అద్వైతాన్ని అర్ధనారీశ్వరుడి ద్వారా
చెప్పిస్తేనో ? అంది. "బ్రిలియంట్ భువనా.." అని మెచ్చుకుని, అహోరాత్రులూ కృషి చేసాడు మోహన్.
ఆలోచనంటూ రావాలేగానీ అది రూపాన్ని సంతరించుకోవడం ఎంతసేపు? కంపోజిషన్
పూర్తయ్యింది. అద్భుతం అన్నారు మాధవి గారు. ప్రాక్టీసు తీవ్రత్రరం చేసారు. శ్యాం
అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాడు. రోజులు వేగంగా గడిచిపోయాయి. ప్రోగ్రాం ఇంకా
పదిరోజులే అని కౌంట్ డౌన్ మొదలైపోయింది. కోటి ఆశలతో ఇద్దరూ హంపీ బయలుదేరారు.
లోటస్ మహల్ , విరూపాక్షాలయం, విఠలాలయం
రాత్రి దీపాల్లో కొత్త శోభని సంతరించుకున్నాయి. శ్రీకృష్ణదేవరాయ
వేదిక, కనక వేదిక . బళ్ళారి రాఘవ వేదిక,
హరిహర వేదిక కన్నుల పండుగగా నాలుగు వేదికలు సిద్ధమయ్యాయి.
విరూపాక్షాలయం పరిసరాల్లో ఏర్పాటు హరిహర వేదిక మీద రెండో రోజు రాత్రి , నిర్మల నృత్య నికేతన్, బెంగుళూరు వాళ్ళు కృష్ణ లీల
ప్రదర్శన తర్వాత , వీళ్ళ ప్రోగ్రాం పెట్టారు. దేశవిదేశాల నుంచి వచ్చిన మూడు వందల మంది కళాకారులు. షెడ్యూల్ చేతిలో పటుకుని తమ అభిరుచిని బట్టీ ఏ ప్రోగ్రాం
చూడాలో ప్లాన్ చేసుకుంటూ కళాభిమానులు. విఐపిలు. హంపీ కిటకిటలాడిపోతోంది.
ఎన్నాళ్ళో ఎదురుచూసిన ఆ రోజు రానే వచ్చింది. రేపే వాళ్ళ ప్రోగ్రాం. ఎంత ప్రయత్నించినా టెన్షన్
పడకుండా ఉండలేకపోతున్నారు ఇద్దరూ! ఆ రోజు సాయంత్రం శ్యాం
వాళ్ళింట్లో రిహార్సల్ చేస్తున్నారు.
అంతలో భువన మొబైల్ మ్రోగుతోంది. ముందుసారి పట్టించుకోలేదు. మళ్ళీ మళ్ళీ
చేస్తుండడంతో, మోహన్ అసహనంగా "వెళ్ళి చూసిరా "
అన్నాడు. వెళ్ళొచ్చిన భువన మొహంలో తేడాని గమనించకపోలేదు. అయినా నాట్యంలో పడితే
అన్నీ మర్చిపోతుందిలే అని మొదలు పెట్టాడు.
"స్టాపిట్.. " చిన్న అపశ్రుతి దొర్లినా భరించలేని మోహన్ లోని కళాకారుడు.
"సారీ మోహన్.. నాన్న, అమ్మ మధ్య మళ్ళీ
గొడవ"
"ఎప్పుడూ ఉండేదేగా" కాస్త వెటకారంగా అన్నాడు.
వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ "లేదు మోహన్.. ఎప్పుడూ లేనిది నాన్న ఈసారి
చెయ్యి చేసుకున్నాట్ట.. ఫోనులో అమ్మ ఏడుస్తోంది"
"సర్సరే.. అయినా అలాంటి చిన్న చిన్న విషయాలు నీ ఏకాగ్రతకి భంగం
కలిగిస్తున్నాయంటే నీ సాధనలో ఏదో లోపం ఉందని అర్ధం"
"నువ్వు నా స్థానంలో ఉంటే తెలిసుండేది మోహన్.. అయినా
నీ సాధన అంటున్నావు. నేనెప్పుడూ నా సాధన అనుకోలేదు. మన సాధనే అనుకున్నాను"
"ప్లీజ్ ట్రై టు కాన్సన్ ట్రేట్ భువనా.. ఇన్నాళ్ళు మనం కన్న కలలు ఒక్క
క్షణంలో బూడిదైపోయేలా ఉన్నాయి"
"నన్ను కాసేపు ఒంటరిగా వదిలెయ్ మోహన్.. నేనిప్పుడు చెయ్యలేను" వెళ్ళిపోయింది.
తలపట్టుకు కూచున్నాడు మోహన్.
తలపేలిపోతుంటే పక్క మీద దొర్లుతున్నాడు మోహన్. ఒక గంటైనా
నిద్ర పడితే బావుణ్ణు అనుకున్నా, ఆ
టెన్షన్ లో మరి నిద్ర పట్టలేదు అతనికి. ఈలోపు గది తలుపులు తడుతున్న చప్పుడు. టైం
చూస్తే తెల్లవారు ఝాము ఐదయ్యింది. లేచి వెళ్ళి చూసాడు.
"మోహన్ మోహన్.." భువన గొంతు వినిపిస్తోంది.
"ఏంటి భువనా ఈ టైంలో? "
"పద వెళ్దాం "
"ఇప్పుడా? ఎక్కడకి?"
"తుంగభద్ర ఒడ్డుకి"
"ఎందుకు?"
నదిని చూస్తే నాకు
స్ఫూర్తి కలుగుతుంది. రాళ్ళతో నిండిన జీవితాన్ని
చీల్చుకుంటూ ప్రవహించడమెలాగో నదే నాకు నేర్పుతుంది. "
"ఇవాళ నేను నిజంగా సాగర సంగమాన్ని చూసాను భువనా"
బంగారు కిరణాలని నింపుకున్న తుంగభద్రమ్మ ఒడ్డున తనివితీరా నాట్యం చేసాకా
తిరిగి వచ్చేస్తూ మోహన్ అన్నాడు.
"ఎలా?"
"తుంగభద్ర నీలోని కళాసాగరంతో కలిసింది కదా"
భువన నవ్వింది. అప్పటికి హమ్మయ్య అనుకున్నాడు గానీ అతనికి
భయంగానే ఉంది. సాయంత్రంలోపు ఏం కొంప ముంచుతుందో అని.
***
నౌ "అద్వైతం" బై భువన అండ్ మోహన్ ఫ్రం వైజాగ్..
అనౌన్సర్ మృదువైన గొంతుతో ప్రకటించింది.
ఆల్ ద బెస్ట్ చెప్పేసి డ్రెస్సింగ్ రూం నుంచి మొదటి వరసలో తనకి రిజర్వ్
చేసిన కుర్చీవైపు నడిచాడు శ్యాం.
వేదిక మొత్తం చీకటి..
అంతా నిశ్శబ్దం.. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఓం కారం.. చీకటిని చీలుస్తూ వేదిక మధ్యలో ఇద్దరి మీదా
ఫోకస్ చేస్తూ సన్నని కాంతి పుంజం.. మోహన్ వెనక భువన. ఓం నమశ్శివాయ అని
వినిపిస్తుంటే ఆ లయకి అనుగుణంగా వంచిన మోకాళ్ళను నిటారుగా చేస్తూ ఇద్దరూ అభయ
ముద్రలో నిలబడ్డారు. అర్ధనారీశ్వరం.. అని
వినబడుతుంటే.. మొదటిసారి భువన కనపడేటట్టుగా సగం పక్కకి తప్పుకున్నాడు మోహన్...
మళ్ళీ అర్ధనారీశ్వరం.. అర్ధనారీశ్వరం.. అని రెండు సార్లు రాగానే లయ బద్దంగా
అటోసారి, ఇటోసారి ఊగుతంటే.. "థాం
" అని బేగ్రౌండులో వినిపించడమూ, ఒక్కసారిగా వేదిక మీద
మొత్తం లైట్లు వెలగడం జరిగాయి ... నీలం రంగు పట్టుపంచలో మోహన్. ఆకుపచ్చ రంగు పట్టు చీరలో భువన చూడ ముచ్చటగా ఉన్నారు.
"చాంపేయగౌరార్ధశరీరకాయై - కర్పూరగౌరార్ధశరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ - నమః శివాయై చ నమః శివాయ"
కస్తూరికాకుంకుమచర్చితాయై - చితారజఃపుఞ్జ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ - నమః శివాయై చ నమః శివాయ
అర్ధనారీశ్వర స్తోత్రం సాగిపోతోంది.
అగాధాల్ని అన్వేషిస్తూ జలపాతాలు.. ఏటవాలు ఎండలో కాంతి
రేణువులు.. ఇసుక రేణువు దాహం తీరుస్తూ కడలు అలలు.. సాయంకాలపు చలిమంటలో
అగ్నికీలలు... హరివిల్లులో అలౌకిక వర్ణాలు.. సెలయేటి మీద వాన చినుకులు.. పరమాణువు నుంచీ అండపిండబ్రహ్మాండం వరకూ నిరంతరం
నాట్యమే.. తమలోని నాట్యాన్ని , విశ్వనాట్యంతో మమేకం చేస్తూ ఇద్దరూ పోటీ పడి నర్తిస్తున్నారు.
సాక్షాత్తూ ఆ విశ్వనర్తకుడే , పార్వతీ సమేతంగా అక్కడ నాట్యం
చేస్తున్నాడేమో అన్న అనుభూతి కలిగింది. చూస్తున్న ప్రేక్షకుల్లో మాటలకందని ఆనందం.
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై - స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ - నమః శివాయై చ నమః శివాయ
స్తోత్రం ముగిసింది. క్రమంగా లైట్లు ఆరిపోయాయి. ఇద్దరూ
మళ్ళీ ముందెక్కడైతే మొదలుపెట్టారో అక్కడకే చేరుకున్నారు. ఆ చీకటి, నిశ్శబ్దంలో మళ్ళీ ఓంకారం. ప్రదర్శన ముగిసింది.
చప్పట్లతో వేదిక మార్మోగిపోయింది. దె బ్రిలియంట్లీ
కేప్చర్డ్ ది "లీల" .. శ్యాం పక్కన కూచున్న ముసిలాయన అన్నాడు. గర్వంగా
నవ్వాడు శ్యాం.
"లెట్ మీ ఇంట్ర డ్యూస్ ద ఆర్టిస్ట్స్.. " అనౌన్సర్ చేతిలో కాగితంతో
మిస్ భువన, మిస్టర్ మోహన్ అని , ఇద్దరూ
రాకపోవడంతో డ్రెస్సింగ్ రూం వైపు చూస్తోంది. ఏమైందో అని కంగారుగా డ్రెస్సింగ్ రూం
వైపు పరుగెత్తాడు. లోపల దృశ్యాన్ని చూసి
స్థాణువైపోయాడు. చేతుల్లో మొహాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది భువన.. పక్కనే ఆమె భుజం మీద చెయ్యేసి మోహన్. వాళ్ళు
చూడకుండా మెల్లగా వెనక్కి వచ్చేసి అనౌన్సర్ దగ్గరకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళిద్దరూ
ప్రజల వద్దకు రాలేరని చెప్పాడు. కాసేపటికి
మోహన్ బయటకి వచ్చాడు. రాగానే శ్యాం వెళ్ళి కౌగిలించుకుని "ఐ కెన్ డై నౌ
మోహన్.. ఐ కెన్ డై" అన్నాడు ఉద్వేగంగా..
"ఏంటి సార్
ఇది" అంటే
అవును మోహన్... ఏ ఇద్దరు ప్రొఫెషనల్ డాన్సర్స్ మధ్య అయినా మంచి synchronization ఉంటుంది. కానీ ఇవాళ మీ మధ్య చూసినది synchronization
కాదు మోహన్.. అనునాదం..
దట్ కైండ్ ఆఫ్ రెజొనెన్స్ ఈజ్
పోజిబుల్ ఓన్లీ ఇన్ సెక్స్.."
అన్నాడు.
***
ఐదేళ్ళు గడిచిపోయాయి. కాలం ఎంతో విచిత్రమైనది. ఈ
ఐదేళ్ళలో ఎన్నో జరిగిపోయాయి. భువన తండ్రి రంగారావు గారి మరణం. ఆయన ఆఖరి కోరిక
తీర్చాల్సిన బాధ్యతతో భువన , శ్రీమతి భువనా శ్రీరాంగా
అమెరికా వెళ్ళిపోవడం.
బెంగుళూరు చిత్రకళాపరిషత్. వచ్చిన ఒక టీనేజ్ గుంపుకి నైఫ్
వర్క్ గురించి ఎక్స్ప్లైన్ చేస్తున్నాడు శ్యాం.
"సార్..
" వెనక నుంచి పిలుపు. చూస్తే భువన. మొహంలో ఎంతో అలసట.
"భువనా..
నువ్వు ఇక్కడ.. ఎప్పుడొచ్చావ్.. ఎలా ఉన్నావ్"
"అదంతా తర్వాత చెప్తా సార్.. ఇప్పుడు మోహన్
ఎక్కడున్నాడో తెలుసా సార్?
"పెద్దగా టచ్ లో లేడు భువనా.. ఒక్కసారే కలిసాడు. ఆ తర్వాత ఏడాది క్రితం
మాత్రం వాళ్ళ ఫ్రెండు ఒకతను ఆర్టిస్టు అని అతను హంపీ వస్తున్నాడనీ , నా నంబరు ఇచ్చాననీ ఫోన్ చేసాడు. అతను
చెప్పడాన్ని బట్టీ భీమిలిలోనే ఉంటున్నాడని తెలిసింది. కానీ తర్వాత రెండు సార్లు
ఫోన్ చేస్తే లైన్ కలవలేదు. మొబైల్ నంబరు మార్చేసాడేమో. అయినా అతను ఎక్కడున్నాడో
తెలుసుకోడం అంత కష్టం కాదులే.. అడ్రసు కూడా ఉండాలి నా దగ్గర "
"థాంక్యూ సార్..
హౌ ఈజ్ యువర్ లైఫ్.. మీ కొత్త వర్క్స్ ఏంటి?
"
"లెట్ మీ షో యు సం థింగ్" అని లోపలికి
తీసుకెళ్ళాడు. కింద ఫ్లోర్లో ఎగ్జిబిషన్లు అవుతుంటాయి. మీద ఫ్లోర్ పెర్మనెంట్
గ్యాలరీ., రోరిచ్ , దేవికారాణి పెయింటిగ్స్ ఉన్న హాలుకి పక్క హాల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక
పెయింటింగ్ చూపించి.. ఇదే నా మాస్టర్ పీస్.. రిజొనెన్స్.. థాంక్స్ టు యు... " అన్నాడు.
గాల్లో నాట్య భంగిమలో ఉన్న ఇద్దరు కళాకారులు.. ఆమె దేహం
అంతా ప్రకృతిలో కలిసి ఉన్నట్టుగా.. అంతా స్పష్టాస్పష్టంగా..
"బ్యూటిఫుల్ సార్" అంది తదేకంగా ఆ చిత్రాన్నే చూస్తూ..
"మోహన్ నన్ను కలిసినప్పుడు ఇది తనకి ఇచ్చెయ్యమని, లేదా ఇలాటిదే మరొకటి గీసియ్యమనీ బలవంత
పెట్టాడు. రెండూ నా వల్ల కాదని చెప్పేసాను. ఒక సారి గీసిన పెయింటింగ్ మళ్ళీ
గియ్యలేను.. అందుకని నా స్టూడేంటు ఒకతను రీ-ప్రొడ్యూస్ చేసాడు ఇదే
పెయింటింగ్.. అది మోహన్ కి ఇచ్చేసాను.. ఈ పెయింటింగ్ ఇక్కడ పెర్మనెంట్ గేలరీలో
ఉంచేందుకు అర్హత సాధించింది" అన్నాడు.
"ఓ కంగ్రాట్స్ సార్.. ఇక నేను వెళ్తా సార్.. మోహన్
ఎక్కడున్నా కలవాలి.. ఆ భీమిలి అడ్రసు ఇస్తారా?"
"మొబైల్లో స్టోర్ చేసాను.. " అని చూసి అడ్రస్
ఇచ్చాడు
"థాంక్యూ సార్.." అని వెనక్కి తిరిగి
వచ్చేస్తుంటే, భువనా.. if you don't
mind నీ married
life గురించి తెలుసుకోవచ్చా?
నవ్వేసి అంత సీన్ లేదు సార్. అతను మంచివాడే. కానీ కళ
మీద అవగాహన, అభిమానం కాదు కదా కనీసం గౌరవం
కూడా లేదు.అందుకే కలిసి బ్రతకలేమని తెలుసుకున్నాం.హుందాగానే విడిపోయాం. వస్తాను
సార్"
శ్యాం కంట్లో పల్చటి నీటి పొర.
***
భీమిలిలో సముద్రపొడ్డున అల్లంత దూరంలో మోహన్. మధ్యలో
ఎన్నెన్నో మలుపులు తిరిగిన కాలం. ఇద్దరి మధ్యా మౌనం. రాళ్ళని కొట్టుకుని
ఉవ్వెత్తున ఎగసి, విరిగి పడుతున్న కెరటాలు.
కాసేపటికి తేరుకుని ఆమె అంది.
"నా మీద నీకు
బాగా కోపం వచ్చుండాలి కదూ.."
"కోపం తీరని కోరికల వల్లే పుడుతుంది. నన్ను
సాగరసంగమంలో కమల్ హాసన్‍లా ఊహించుకున్నావేంటి కొంపతీసి..." అని నవ్వాడు.
"ఇంత తేలిగ్గా ఎలా నవ్వగలుగుతున్నావ్ మోహన్? "
"నాట్యాన్ని ఎలాంటి పొరపాట్లు లేకుండా పరిపూర్ణంగా
అభినయించడం కళలో ఒక దశ మాత్రమే భువనా! మనలోని నాట్యాన్ని, సర్వవ్యాపకమైన
నటరాజ నాట్యంతో ఏకాత్మకం చెయ్యడమే కళ యొక్క పరమావధి అని సాధనలో తెలుసుకున్నాను.. You
think that you are dancing.. but you are just part of the cosmic dance...
"
"ఐతే నన్నిక్కడ మళ్ళీ చూసాక నీకు ఎలాంటి ఆనందం కలగడం లేదా? " ఉక్రోషంగా అంది.
"విషాదం లేదన్నానుగానీ ఆనందం లేదనన్నానా?" ఎప్పటిలాగే నవ్వి, "నువ్వెళ్ళిపోయాక
కొన్నాళ్ళు మనిషిని కాలేకపోయాను. "
"మరి"
"నిన్ను కనీసం తాకకుండా నీతో అద్వైతాన్ని అనుభూతి
చెందాను గుర్తుందా! అది నాట్యం గొప్పదనం. అంత గొప్ప నాట్యం నాతో ఉంది. నువ్వు కూడా
నాలో ఉన్నావు. భౌతికంగా నువ్వెక్కడుంటే నాకెందుకు?"
"నీకోటి చూపించాలి రా.. రా.. " అని లోపలికి
తీసుకెళ్ళాడు.
"ఏంటి అనునాదం పెయింటింగేనా" అంది..
ఓ నువ్వు ఆల్రెడీ
చూసావా అని అయినా నువ్వు చూడాల్సింది ఇంకోటి ఉంది అని తీసుకెళ్ళి చూపించాడు.
"విశ్వనర్తకుడైన నటరాజ రూపంలో పరమశివుడు విశ్వసృష్టి
స్థితిలయాల ప్రక్రియల్లో అనంత ప్రకారాల తాళ లయల్ని సృష్టిస్తాడు. ఆ ఆనంద
తాండవాన్ని దర్శించిన మనసుకి విషాదం ఎక్కడిది?"
అనునాదం చిత్రాన్ని, ఆ చిత్రం కింద ఈ వాక్యాల్నీ చూస్తూ "మనమోసారి హంపీ వెళ్ళొద్దాం
మోహన్" అంది. ఆమె అంతరంగం అర్ధమై అతను నవ్వాడు. లయబద్దమైన వాళ్ళిద్దరి పాద
స్పర్శతో పులకించేందుకు తుంగభద్ర ఒడ్డున ఇసుక రేణువులు సిద్దమౌతున్నాయి.
-------------- X
---------------
(రచనా కాలం : 2011)