ఆ కొండలు గుట్టల్లో ఆడుకుంటూ పాడుకుంటూ, మంచుతో కొట్టుకుంటూ, పాత జ్ఞాపకాలని నెమరేసుకుంటూ మధ్యాహ్నమంతా తిరిగాం. సాయంకాలమైంది. తిరిగి వెనక్కి వచ్చేస్తూ పైన్ చెట్లు ఎత్తుగా పెరిగిన ఆ లోయలో నడుస్తున్నాం. మా అడుగుల చప్పుడు మాకే వినిపించేంత నిశ్శబ్దం. అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నాం. అంతా మౌనంగా అయిపోయారు. దూరం నుంచి లీలగా సెలయేటి సవ్వడి వినబడుతోంది. ఆ సాయంత్రం ఆ నిశ్శబ్దంలో వినబడిన ఆ సవ్వడి నాకు జెన్ తత్వాన్నీ, హైకూ సారాన్నీ అనుభవంలోకి తేవడమే కాక కింది కవిత కూడా రాయించింది
పైన్ చెట్ల మధ్యనుంచి
ప్రవేశించింది సంధ్య
సాయంకాలపు నిశ్శబ్దం
లోయంతా ఆవరించింది
లీలగా వినపడుతున్న
సెలయేటి సవ్వడి
చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని
రెట్టింపు చేస్తోంది!
పదమూడేళ్ళ తర్వాత మొన్న జూలైలో కవితల పుస్తకం వేద్దాం అనుకున్నప్పుడు ఏం పేరు పెడదాం అని మళ్ళీ అన్ని కవితలు చదువుకుంటుంటే, ఈ కవిత నా కవితా తత్వాన్ని పట్టిస్తుందనిపించింది. అందుకని "సెలయేటి సవ్వడి" అని పెట్టాను. అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రచురించిన ఈ పుస్తకం ఇప్పుడు amazon లో ఉంది.
https://www.amazon.in/dp/8194427398
No comments:
Post a Comment