Saturday, August 1, 2009

చిరుజల్లులో పూలు

౧.
తెరచిన కిటికీనుండి
తెరచిన పుస్తకం మీదకి
ఏటవాలుగా ఎండ

౨.
కొండవాగు
అరి కాళ్ళు కూడా
మునగడం లేదు

౩.
ఉరుము ఉరిమితే
తలెత్తి చూసాను
తొలి చినుకు నా కంట్లోనే

౪.
వీధి దీపం
పచ్చని కాంతి
చొక్కా రంగు మారింది

౫.
పైకొస్తుంటే
పదింతలైంది బరువు
నూతిలో ఈత

౬.
వెండి మబ్బులు
వెలిగి పోతున్నాయి
వెనక సూర్యుడు


నా ముఖం
కనిపించడం లేదు
సరస్సునిండా అలలు

౮.
సాయంత్రపు నడక
పసిచేతుల్లో ముసలి చేతులు
వేటికి ఏవి ఆసరా?

౯.
గట్టు మీద రావి చెట్టు
కోనేట్లో ప్రతిబింబం
ఒకటే గలగలలు

౧౦.
ఏటి నీరు
తేట ఇసుక
సూర్యకాంతి తొణుకుతోంది

3 comments:

విజయవర్ధన్ (Vijayavardhan) said...

మణి గారు, బాగున్నాయి. నాకు 6,7,8&9 చాలా చాలా నచ్చాయి.

rākeśvara said...

ఎప్పటిలానే చాలా బాగున్నాయి.

రావి చెట్టు చూడఁబోతే చాలా narcissistలాగుందే ;-)

Anonymous said...

ఏటి ఒడ్డున సుబ్రహ్మణ్యం
గల గలల జోలపాట వింటూ
తల్లి ఒడిలో పాపలా