Saturday, July 14, 2012

గోడలు



                                      రెండు శరీరాల మధ్యేకాదు
                                      ఒకే ఆత్మకూ
                                      రెండు దారుల మధ్య
                                      వంతెన అతి సున్నితమైనది

                                                                             --- ఇక్బాల్ చంద్



 'May I have your attention please..This is the final call for passengers travelling from .....' announcer గొంతు మృదువు గా పలుకుతోంది. అప్పటివరకు హైదరాబాద్ ఫ్లైట్ గురించి వెయిట్ చేస్తూ హక్స్ లీ, అన్ని తత్వాల సారంతోనూ రాసిన perinnial philosophy లో మునిగి ఉన్న నేను ఒక్క సారి తలెత్తి చూసాను. ఎవరో అమ్మాయి గాభరా గా సెక్యూరిటీ చెక్ వైపు పరుగెడుతోంది. నన్ను ఆకర్షించినవి ఆమె కళ్ళు. ఎక్కడో చూసాను అలాంటి కళ్ళను. ఏ విషయాన్నీ అంత తొందరగా మర్చిపోయే మనిషిని కాను నేను. Yes గుర్తొస్తోంది. పదేళ్ళ క్రితం university of Singapore లో జెన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ మీద ప్రసంగిస్తూ సుప్రసిద్ధ కవయిత్రి సొనోమీ రాసిన అద్భుత కవిత ఏకాంత దీపం' గురించి వివరిస్తుంటే ముందు వరసలో కూర్చొని ఆసక్తిగా విని, లెక్చర్ అయిపోయాక కలిసి నాకు అర్ధం కాలేదు అని మళ్ళీ చెప్పించుకుని చెప్పింది అర్ధమవగానే ఆమె కళ్ళల్లో కనిపించిన కాంతిని నేనెప్పటికీ మరువలేను.


65 యేళ్ళ నా జీవిత ప్రస్థానంలో ఇలాంటివి ఎన్నో అనుభవాలు. ఎయిర్పోర్ట్ లు, రైల్వే స్టేషన్లు నా జీవితంలో అంతర్భాగమైపోయాయి. పేరు తెలియని స్టేషన్లలో డిసెంబర్ అర్ధ రాత్రి చలిలో ఒంటరిగా వెచ్చని టీ తాగడం, టాప్ లేని రిక్షాలో ఊరంతా తిరుగుతూ ఫిలాసఫీ పుస్తకాలు చదవడం నాకు ఇష్టమైన పనులు. May I have your attention please...announcer చేస్తున్న announcement తో ఈ లోకంలోకి వచ్చాను. ఈ సారి ఫ్లైట్ నాది కావడం తో చదువుతున్న పుస్తకాన్ని బేగ్ లో పెట్టి సెక్యూరిటీ చెక్ వైపు నడిచాను.ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ కావడం తో ఎయిర్ హోస్టెస్ సాంప్రదాయసిద్దం గా నమస్కారం పెడుతోంది. మెల్లగా సీట్ చూసుకుని కూర్చుని, ఆపేసిన పుస్తకాన్ని మళ్ళీ ప్రారంభించాను. ఎయిర్ హోస్టెస్ చేస్తున్న మూకాభినయం చూస్తే నాకు మొదటి సారి ఫ్లైట్ ఎక్కిన అనుభవం గుర్తొస్తోంది. 28 యేళ్ళకి మొదటి సారి ఏదో conference కి అని విమానం ఎక్కాను . తర్వాత సెమినార్లకీ కాన్ఫరెన్సులకీ ఎన్నో దేశాలు తిరిగాను. ఎందరో So called intellectuals ని కలిసాను. చర్చించాను, తర్కించాను. జమీందారీ కుటుంబంలో ఆరుగురు సంతానం లో ఐదవ వాడిగా పుట్టాను. నిర్లక్ష్యంగా పెరిగాను. చిన్నప్పటి నుంచీ ముక్కుసూటిగా వ్యవహరించడం నిష్కర్షగా తోచింది చెప్పడం వల్ల మిత్రులకన్నా శత్రువులే ఎక్కువ. అందరికీ నచ్చే విధంగా ఉండటం నాకు చేతకాదు. అద్దంలో చూసుకుంటే నా కళ్ళల్లో నాకు ఒక విధమైన ఆత్మ విశ్వాసం కనిపిస్తుంది. అందరూ దాన్ని పొగరన్నారు. ఎవరేమనుకున్నా పట్టించుకునే మనస్తత్వం కాదు నాది. పదేళ్ళగా రాకపోకలు లేవని అమ్మ బాధపడుతుంటే చిన్నప్పుడు ఒకసారి మావయ్య వాళ్ళింటికి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళగానే దారితప్పి వచ్చావేంట్రా అని అడిగారు.అంతే ఇక ఆ తర్వాత ఏ బంధువుల ఇంటికీ వెళ్ళ లేదు.


మేఘాల్ని చీల్చుకుంటూ ఫ్లైట్ ముందుకు పోతుంటే నా జ్ఞాపకాల్ని తవ్వుకుంటూ నేను వెనక్కి వెళుతున్నాను. ఎన్నో జ్ఞాపకాలు. 24 యేళ్ళకే indian railways లో Electrical engineer గా జాయినవడం, మరో రెండేళ్ళకే ఆ ఉద్యోగానికీ నాకూ పొసగక రాజీనామా చేసెయ్యడం రాజీపడని నా మనస్తత్వానికి ఉదాహరణ. తర్కించే అలవాటు ఎక్కువ కావడం వల్ల ప్రతీదాన్నీ ఖండించాను.ప్రతి విషయంపైనా ప్రశ్నార్ధకాల ధనస్సు ఎక్కుపెట్టాను. హేతుమూలమైన పాశ్చాత్య తత్వశాస్త్రం ఆ దశలో నన్ను ఎక్కువగా ఆకర్షించింది. 'నేనాలోచిస్తున్నాను కాబట్టే నేనున్నానూ అన్న రిని డెకార్టే ని అమితంగా అభిమానించాను. ఆ ప్రభావంలో హిందూ తత్వశాస్త్రాన్ని ఉట్టి ట్రాష్ గా కొట్టి పారేసాను. ఐతే క్రమంగా ఆలోచనా, హేతువూ మనల్నిఎంతో దూరం తీసుకెళ్ళలేవని గ్రహించాను. ఆ దశలో చదివిన హక్స్ లీ గేయం నాకు కడ దాకా గుర్తుండిపోతుంది.


"దైవ సమానమైన హేతురాహిత్యం నువ్వు ఆకుల నడుమ అక్కసులేక పాడుకుంటావు .... నీవు నేర్పిన జ్ఞానానికి ఉప్పొంగిపోతాను నేను! " అంటూ ఒక తుమ్మెద మీద ఆయన రాసిన ఈ గేయం, జ్ఞానం అనేది బుద్ధి, తర్కం, హేతువువీటన్నిటికీ అతీతమైనదని ఎంతో కవితాత్మకం గా చెప్పడం అప్పటిలో నన్ను ఎంతో అబ్బురపరిచింది. ఆ దశలోనే జెన్ బుద్ధిజం, అన్నిటికన్నా ఉత్కృష్టమైన హిందూ తత్వ శాస్త్రాల్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసాను. జెన్ బుద్ధిజం లోని, హిందూ తత్వశాస్త్రంలోని similarities మీద research చేసి కాశీ హిందూ విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పొందాను. Zen buddhism -- An Indian's view అని నేను రాసిన పుస్తకానికిఎన్నో అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో philosophy professor గా 30 యేళ్ళు పనిచేసి రిటైరయ్యాను. ఎదుటి వాళ్ళకి ఏమీ తెలియదన్న assumption తో చేసిన Teaching profession నాకు సంతృప్తినిచ్చింది. అది నా అహం సంతృప్తి చెందడం వల్ల కావచ్చు.అందరూ గౌరవిస్తే నాకు వింత సంతృప్తి కలిగేది. ఆ గౌరవం కోసం చిన్న చిన్న ఆనందాలకి నేను దూరమయ్యానేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.


Excuse me sir... పక్కన కూర్చున్న అమ్మాయి పిలుపుతో నా గతానుభవాల నెమరువేత కి తెరపడింది. తలతిప్పి ఆ అమ్మాయి వైపు చూసాను. 18 యేళ్ళు ఉంటాయి. ఇంకా కౌమారపు అమాయకత్వం ముఖంలోంచి పోలేదు. ఆసక్తితో కూడిన కళ్ళు ఏదో తెలుసుకోవాలనుకునే ఆ అమ్మాయి ఉబలాటాన్ని బహిర్గతం చేస్తున్నాయి.ఇన్నిసార్లు ప్రయాణించినా పక్క వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ.వాళ్ళే స్వయంగా మాట్లాడితే గాని నేను ఎప్పుడూ చొరవ తీసుకుని మాట్లాడింది లేదు. అదీ ఫ్లైట్`లో ఐతే ఎవరి లోకంలో వాళ్ళు మునిగి ఉంటారు. కానీ ఈ అమ్మాయి...


'మీరు చదువుతున్న పుస్తకం...' అంటూ నీళ్ళు నములుతోంది. నేను నవ్వి 'నీకు అర్ధం కాదమ్మా...ఇది చాలా కష్టమైన పుస్తకం' అన్నాను.


'మా డాడీ కూడా ఎప్పుడూ ఇంతే సార్`. ఏ పుస్తకం గురించి అడిగినా ఇలాగే చెప్తారు, నిజం గా ఆ ఫిలాసఫీ అంత కష్టమా సార్`?' అని అడుగుతోంది.


'కష్టం కాదమ్మా... ఫిలాసఫీ ఏ మాత్రం కష్టం కాదు... ఫిలాసఫీ అంటే మనిషి మనిషి గా బ్రతకడం. అది మెల్లగా తెలుసుకుంటున్నాను కాబట్టే మూడు వారాల ట్రిప్ ని కేన్సిల్ చేసుకొని,శారద దగ్గరకి వెళ్ళిపోతున్నాను...'నా అంతరాత్మ నాకు చెబుతున్న మాటలు ఆ అమ్మాయి కి వినిపిస్తే బావుణ్ణు.


శారద... PhD చేస్తున్న కాలంలో ఇంట్లో అమ్మ పోరు భరించలేక ఆమెను పెళ్ళి చేసుకున్నాను. సెకండ్ ఫారం వరకు చదివిన పల్లెటూరి అమ్మాయి శారద.అమాయకత్వం తో కూడిన అందం ఆమెది. అమాయకత్వం,ఓర్పు,అనంతమైన సహనం కలిస్తే శారద రూపుదిద్దుకుందేమో అనిపించేది. ఏదీ తర్కించడం ఆమెకు చేత కాదు. ఎవరేం చెప్పినా నమ్మేసేది. వాదించడం వల్ల ఒరిగేదేదీ లేదని ఆమె నమ్మకం. పెళ్ళైన కొత్తల్లో నా పాండిత్యాన్ని ప్రదర్శించేందుకు ఆమెతో వాదించడానికి ప్రయత్నిస్తే తనకి ఏమీ తెలియదని హూందా గా ఒప్పుకోవడం నన్ను నివ్వెర పరిచింది. ఎక్కడో Accident లో పది మంది పిల్లలు చనిపోయారని తెలిసి ఇక్కడ ఈమె విలవిలలాడిపోయేది. ఆమె అమాయకత్వానికి నాకు నవ్వొచ్చేది. ఐతే అప్పుడప్పుడు మాత్రం నేను పగలు రాత్రి అధ్యయనం చేసి తెలుసుకున్న విషయాలు ఆమె చిన్న చిన్న పదాల్లో చెప్పేస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగేది. పాండిత్యంకన్నా జ్ఞానం ముఖ్యమన్న మాటకి సరైన అర్ధం లా ఆమె నాకు కనిపించినా, ఆమె గొప్పతనాన్ని ఏ మాత్రం అంగీకరించని ఆత్మవిశ్వాసం నాది. ఐతే అది ఆత్మవిశ్వాసం కాదు అహంకారం అని తెలుసుకోడానికి నాకు అట్టే సమయం పట్టలేదు. అయినా ఆ విషయాన్ని కూడా ఆమె దగ్గర ఏనాడూ ఒప్పుకోలేదు.


ఒకసారి కోపంతో ఎవరినో తిడుతుంటే 'ఎందుకండీ అందరినీ తిట్టడం? వాళ్ళని ఇలా తిట్టడం వల్ల మీకు ఒరిగేదేమిటి? వాళ్ళ బలహీనతలతో పాటు వాళ్ళని ప్రేమించలేరా?' అని అడిగింది. సూఫీ కవుల తత్వాన్ని ఒక్క మాటలో చెప్పేసిన ఆమె నా దృష్టిలో సంస్కార శిఖరాలపైకి ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్ళిపోతుంటే, నేను సంకుచిత మనస్తత్వాల అగాధాల్లోకి కూరుకుపోతున్నట్లు అనిపించేది. ఈ మానసిక సంఘర్షణలో అకారణం గా ఆమె ను కోప్పడినా ఓర్పుతో భరించిన ఆమె చిరునవ్వు నన్ను నిలువునా కోసేసేది.అయినా పగలని పాషాణాభ్యంతరాలు నావి.38 యేళ్ళ దాంపత్యంలో ఏనాడూ ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఒక్కసారి కూడా మనస్ఫూర్తిగా ఆమెను మెచ్చుకోని గర్వం నాది.


ఐతే కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు..చాలా యేళ్ళు గా నన్ను మెల్ల మెల్లగా దహించేస్తున్న ఈ అపరాధ భావం ఈ మధ్య మరింత తీవ్రమైంది. రోజు రోజుకీ దిగజారుతున్న శారద ఆరోగ్యం అగ్ని కి ఆజ్యం పోస్తోంది..ఏ లెక్చర్ ఇద్దామన్నా ఏదో మహా సర్పం వెంటాడుతున్న భ్రాంతి. ఒక మహానేత్రం మందలిస్తున్న భ్రాంతి. ఒక ప్రసంగం ఇవ్వడానికి చచ్చి బ్రతకాల్సి వస్తోంది.శ్రీలంక లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో హైకూ కవి బషో కవితా తత్వంపై ఇవ్వాల్సిన లెక్చర్ సిరీస్ ని అర్ధాంతరం గా ముగించుకుని, రిటైరయ్యాక సెటిల్ అయిన విజయవాడ వెళ్ళిపోతున్నాను.ఇంటినుండి బయలుదేరిన దగ్గరనుండీ ఎందుకో శారద ని చూడాలనీ, ఆమెతో నేను నేనుగా మాట్లాడాలనీఅనిపిస్తోంది. కొన్ని విషయాలు తర్కానికి ఎప్పటికీ అందవేమో!


'సార్ ... ఏంటి సార్ చిన్న ప్రశ్న కి ఇంతలా ఆలోచిస్తున్నారు. అంత కష్టమైతే చెప్పొద్దులెండి. అయినా కాసేపట్లో ఫ్లైట్ హైదరాబాద్లో లేండ్ అవబోతోంది ' అని ఆ అమ్మాయి అనే దాకా నేను ఫ్లైట్ లో ఉన్నట్లే మర్చిపోయాను.ఆ అమ్మాయికి బాయ్ చెప్పేసి ఎయిర్`పోర్ట్ నుంచి బయటపడ్డాను.



                                              ****


Hyderabad లో Airport నుంచి రైల్వే స్టేషన్ కి టాక్సీ శరవేగంతో దూసుకుపోతోంది. ఒక్క సిగ్నల్ పడినా అసహనం పెరిగిపోతోంది. టాక్సీలో కూర్చొని ఆమెతో ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. నా జీవితంలో ఎన్నో పరిశోధనా వ్యాసాలు,పుస్తకాలు రాసి ఎన్నో లెక్చర్లిచ్చిన నేను ఇలా శారద తో సంభాషణ ఎలా ప్రారంభించాలని ఇంతలా ఆలోచించడం నాకు నవ్వు తెప్పిస్తోంది.


 రైల్వే స్టేషన్ నుండి ఇంటికి ఫోన్ చేసాను. మంగమ్మ ఫోన్ ఎత్తి అయ్య గారూ అమ్మ గారికి ఆరోగ్యం ఏమీ బాగోలేదు అని చెబుతోంది. మరి ఈ విషయం నాకు వెంటనే ఎందుకు తెలియజెయ్యలేదంటే మిమ్మల్ని disturb చెయ్యడం ఎందుకని అమ్మగారే చెప్పొద్దన్నారు అంది. సరే నేను వెంటనే వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసాను. నా శారదకు ఏమీ కాకూడదు ..ట్రైన్ లో అంతా ఇదే ఆలోచన.నేను హాస్పిటల్ కి వెళ్ళేసరికి స్నేహితులు అంతా మూగి ఉన్నారు.మంచంపైన శారద ఏవో తెలియని శక్తుల పెనుగులాటలో మూసుకు పోతున్న కళ్ళని బలవంతం గా తెరుచుకుని ఉంది. నా గురించే మృత్యువుని సైతం ఆపిందేమో అన్నట్టు నా వైపు చూసి జీవం లేని చిరునవ్వొకటి నవ్వింది. అదే ఆమె ఆఖరి చిరు నవ్వు.


యుగయుగాలు గా మృత్యువు జీవాన్ని చూసి నవ్వుతున్న చిరునవ్వు. నా హృదయపు రాతి గోడల్ని బ్రద్ధలు చెయ్యాలని జీవితాంతం ప్రయత్నించిన చిరునవ్వు,నా లైబ్రరీలోని తత్వశాస్త్ర గ్రంధాలన్నింటినీ త్రాసులో ఒక పక్కపెడితే అలవోకగా తేల్చెయ్యగలనిర్మలమైన చిరునవ్వు.


ఒక్కసారి ఆమె బ్రతికితే ఆమె ఒడిలో తలపెట్టుకుని నా అల్పత్వాన్ని అంగీకరించి గుండెలు పగిలేలా ఏడుద్దామని ఉంది. చివరికి నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు..చావులో సైతం ఆమె నన్ను జయించింది. ఏడుస్తున్నాను. కన్నీరు మున్నీరు గా ఏడుస్తున్నాను. ఆ కన్నీటి ప్రవాహంలో ఇన్నేళ్ళ అహంకారం,పాండిత్యం అన్నీ కొట్టుకుపోతున్నాయి. అనంతమైన శూన్యం లో నిరాకారంగా కనిపిస్తున్న అంతరంగం ఎదుట నిస్సహాయం గా నేను మిగిలిపోయాను.

                                               ------------ X -------------

( రచనా కాలం 2004 )

10 comments:

Padmarpita said...

మొత్తం చదివాక మనసు మూగబోయింది.:-(

Anonymous said...

పాటకుణ్ణి మీతొపాటు దుఖసాగరంలొకి తీసుకెళ్ళరు.

Alapati Ramesh Babu said...

అదే జీవితం ఎన్నిసార్లు అర్ధం చేసుకున్నాం, చదువుకున్నాం అనే వారిని కూడా ........

suresh said...

అహం అనే మత్తుపదార్ధంకి ప్రతి మనసు బానిసే... నిజమైన తర్కం "నేను" వైపు సాగితే ప్రతి ఒక్కళ్ళు రమణులే. నిజమైన పాండిత్యం నిండుకుండలా తొణకదు గంభీరం గా వుంటుంది...

Anonymous said...

"నిజమైన పాండిత్యం నిండుకుండలా తొణకదు గంభీరంగా వుంటుంది..."

దైవాదిష్టమైన అవతారకార్యం గల పండితులకి తొణక్కుండా గంభీరంగా ఉండడానికి భగవంతుణ్ణుంచి అనుమతి ఉండదు. వాళ్ళు జీవితాంతమూ వాదాల్లో పాల్గోక తప్పదు. కనుక ఈ ఒక్క కొలమానంతోనే పాండిత్యాన్ని కొలవకూడదు.

suresh said...

ఇక్కడ నా ఉద్దేశ్యం పాండిత్యం మాత్రమే పండితులని కాదు, ఎన్ని వాదాల్లో పాల్గొన్నా వారి "వారి పాండిత్యం నిండుకుండలా తొణకదు" అహంకారం అనే భావం వారి దరిచేరదు.

అనంతం కృష్ణ చైతన్య said...

ఇది చదివిన తర్వాత.............. మా అమ్మ గుర్తుకొచ్చింది, మీ కధలో శారద మనస్తత్వంలో మా అమ్మని చూసుకున్నాను.........

భాస్కర్ కె said...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

వాసుదేవ్ said...

మానవసంబంధాలపై ఓ థీసీస్ ఈ కథ. పాత్రలఔచిత్యం వారి మోనోలాగ్స్ లోనూ, చిత్రణలోనూ సుస్పష్టం..కథలో ప్లాట్ కంటే మనిషి ఎదిగెకొద్దీ దేనికి విలువివ్వాలొ చెప్పటమే ప్రధానంగా కథనం సాగడం నచ్చింది.

David said...

excellent sir