Saturday, October 27, 2012

గుప్పెడు మిణుగురులు

ఆ తీరంలో
ఎంతటి మహాత్ముడి
అడుగుజాడలైనా
చెరిగిపోక తప్పదు

నీకు నువ్వే
ఓ దారి వెతుక్కోవాలి

జీవితమూ
సముద్రమే!


    * * *

కలలెక్కడో అంతమవ్వాలి
మళ్ళీ పుష్కరాల వేళకి
ఈ నది ఉంటుందో లేదో

ఒక్క క్షణమైనా
నిన్ను విడిచిపెట్టి
నదిలోకి..
నదిని నీలోకి..

కాలం
ఎంత అర్ధరహితం!

     * * *

మట్టి రోడ్డు పక్కన
దుమ్ములో తడుస్తూ నవ్వుతున్న
గాజుపూలు, గన్నేరు పూలు
ఏవెక్కువ అందమైనవి?

తూనికలు, కొలతలులేని
ఒకే ఒక్క చూపు

సానుభూతి అంచుల్లో సంతోషం
అభినందనల అడుగున అసూయ

ఏ రంగూ లేని
ఒక్క కన్నీటిబొట్టు

నీకూ ప్రపంచానికీ మధ్య
గీతల్ని చెరిపేస్తూ...


     * * *

సముద్రమో, నదో అక్కరలేదు
చిన్ని నీటి చెలమ
కన్నుల్లో...

సూర్యుడో, చంద్రుడో అక్కరలేదు
గుప్పెడు మిణుగురులు
గుండెల్లో..

చాలు!

3 comments:

భాస్కర్ కె said...

మీ మిణుగురులు మెరుస్తున్నాయ్...

vignan's fountainhead for IAS said...
This comment has been removed by the author.
Anonymous said...

mee tarahaa vaakyaalu kaave ivi