దీపశిఖపై మృత్యువు నర్తిస్తోందా అన్నట్టు గదిలో దీపం వీస్తున్న గాలికి టప టపా కొట్టుకుంటోంది. మంచం మీద రంగాచారి చరమ దశలో ఉన్నాడు. భార్య సత్యవతి, కొడుకు రామాచారి కన్నీళ్ళతో చూస్తున్నారు. శాస్త్రులు గారు నాడి చూసి “ఇక లాభం లేదమ్మా సత్యవతీ” అని లేచారు. ఒక వైపు దేహాన్ని మృత్యువు కబళించివేస్తున్నా , రంగాచారి మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. వాళ్ళ రాజ్యంలోనే కాదు చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా రంగాచారి పేరు తెలియని వారు అరుదు. అంతటి గొప్ప శిల్పి ఆయన. రామాచారిని మాత్రం ఉండమని సత్యవతిని కూడా బయటకి వెళ్ళమని సైగ చేసారు. కన్నీళ్ళు పెట్టుకుంటున్న కొడుకువైపు చూసి “శిల్పికి మరణం లేదు. అసలు ఏ మనిషికీ మరణం ఉండదు. కళ్ళు తుడుచుకుని చెప్పేది విను” అన్నారు. ఆ దశలోనూ ఖంగున పలికింది ఆయన కంఠం.
“గుర్తుపెట్టుకో.. శిల్పమంటే మరేమీకాదు నువ్వే. కొత్త శిల్పం చెక్కడమంటే నిన్ను నువ్వు కొత్తగా తెలుసుకోవడమే! ఈ పరమార్థం గ్రహించడానికి నాకు కొన్ని దశాబ్దాలు పట్టింది. వెళ్ళి పూజగదిలో నా ఉలి ఉంటుంది తీసుకురా” అని, తీసుకురాగానే దాన్ని కొడుకు చేతిలో పెడుతూ ఇలా అన్నారు “శిల్పమంటే మరేమీ కాదు ను….వ్వే…” అవే ఆయన ఆఖరి మాటలు.
రామాచారి కుప్పకూలిపోయాడు. భర్త సహచర్యంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగల మనోధైర్యాన్ని సంపాదించినా ఆ క్షణంలో మాత్రం సత్యవతిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. అంత్యక్రియలు పూర్తయ్యాయి. బంధువులంతా ఎవరి ఊళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో ఒక మహా శూన్యం ఆవరించినట్టైంది. తన భర్త ఇక లేరనే నిజన్ని బలవంతంగానైనా ఒప్పుకోవడం కష్టంగా ఉంది సత్యవతికి. ఆమె ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటోంది.
రామాచారికి తండ్రి దగ్గర తప్ప మిగతా ఎవ్వరిదగ్గరా భయం లేదు. తండ్రి ఆఖరి క్షణాల్లో చెప్పిన మాటలు అతను పట్టించుకోలేదు. అదంతా చాదస్తం అనుకున్నాడు. రాత్రీ పగలూ శిల్పాలు చెక్కుతూ తననీ తల్లినే కాకుండా ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసినందువల్లే ఆయన చిన్న వయసులో కాలం చేసారని రామాచారికి అనిపించేది.
మూడేళ్ళు గడిచాయి. రామాచారి విద్యాభ్యాసం పూర్తయ్యింది. యవ్వనంలోని బలం, విద్య వల్ల వచ్చిన విజ్ఞానం అతనికి ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి. ఎవరైనా దేవుడు, భక్తి అంటే వాళ్ళవైపు ఎగతాళిగా చూసేవాడు. నలుగురు కుర్రాళ్ళని వెనకేసుకుని పందాలు కట్టడం, ఇల్లు పట్టకుండా తిరగడం ఇవీ అతని కార్యక్రమాలు.
వీడిలాగే కొనసాగితే ఏమైపోతాడో అని దిగులు పడేది సత్యవతి. అంతలోనే “”వీడి చేతిలోని కళ వీడి మనసులో లేదే. ఆ కళ వీడి మనసులో వెలిగిన రోజున వీడు నాకంటే గొప్ప శిల్పిఅవుతాడు” తన భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చేవి సత్యవతికి.
ఒక రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుతో “బాబూ, కౌలుకిచ్చిన మన పొలాన్ని రైతులు సరిగ్గా పండిస్తున్నారో లేదో, ఏదో సాకు చెప్పి ఇచ్చే ధాన్యాన్ని ఏడాదికేడాదీ తగ్గించేస్తున్నారు. ఖాళీగా తిరక్కపోతే నువ్వెళ్ళి అప్పుడప్పుడు చూసి రావచ్చు కద రా” అంది. అప్పుడే బయట ఎవరితోనో గొడవపడి వస్తున్న రామాచారికి ఈ మాటలు రుచించలేదు.
“నాన్నగారు శిల్పాలు చెక్కుతూ కాలాన్ని వృధా చేస్తుంటే ఎప్పుడైనా ఇలా చెప్పావా?” అన్నాడు.
ప్రపంచంలోని కోపమంతా ఆ క్షణాన ఆమె కళ్ళలో అగ్నిగా మారి.. అంతటి ఉద్రేకాన్ని మోయలేని మాటలు దేహాన్ని పట్టికుదిపేస్తుంటే..కళ్ళ నిండా నీళ్ళతో నిశ్శబ్దంగా మరోగదిలోకి వెళ్ళిపోయింది సత్యవతి..
తల్లిలో అంతటి ఆవేశాన్ని ఏనాడూ చూడని రామం నిశ్చేష్టుడైపోయాడు.రెండు రోజులు గడిచినా తల్లి తన మౌనాన్ని వీడకపోవడంతో అతనికి ఏం చెయ్యాలో బోధపడలేదు. మౌనం ఎంత భయంకరమైనదో అతనికి మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. మూడో రోజు బయటకి వెళ్ళొచ్చిన రామం ఇంట్లో తల్లి ఒక్కతే కూచుని మౌనంగా కన్నీళ్ళు పెట్టుకోవడం చూసి ఇక భరించలేక వెళ్ళి ఆమెని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసాడు.
“మానవ అస్తిత్వపు అంతిమ మర్మాల్ని శిల్పాల్లో దర్శించి, ఆ కళకి తన జీవితాన్నే అర్పించిన ఒక మహా కళాకారుడి గురించి అలా మాట్లాడ్డం తప్పు బాబూ.. శిల్పాలు చెక్కినా, వ్యవసాయం చేసినా, చివరికి నేను మంచం మీదున్నప్పుడు అహోరాత్రాలు సేవ చేసినా చేస్తున్న పనినుంచి ఆయన ఏనాడూ ఆయన్ని వేరుగా చూసుకోలేదు” తల నిమురుతూ తల్లి చెప్పుకు పోతోంది..
తల్లికి తండ్రిమీద ఎంత గొప్ప అభిప్రాయం? నమ్మలేకపోయాడు. తండ్రి రోజుల తరబడి శిల్పాల్లో మునిగి ఉంటే తల్లే తనకు అన్నీ చేసేది. అన్ని పనులూ ఆనందంగానే చేసిందన్నమాట. అతనిలో ఏవో పొరలు కరిగిపోతున్నాయి.
సాయంత్రం రామం భావనారాయణ స్వామి గుడికి వెళ్ళాడు. ఆ దేవాలయానికి తన తండ్రే ప్రధాన శిల్పి. ముఖద్వారంలోంచి మొదటి ప్రాకారంలోకి ప్రవేశించాడు. గోపురం గూళ్ళలో పావురాళ్ళు కువకువలాడుతున్నాయి. ఎండలో వేడెక్కిన రాళ్ళు సాయంత్రానికి చల్లబడి కాళ్ళకి వెచ్చగా తగులుతున్నాయి. ప్రాకారం చుట్టూ తిరిగాడు. ప్రతి శిల్పంలోనుంచీ తన తండ్రి తనని పలకరిస్తున్నట్టనిపించింది.
“శిల్పికి మరణం లేదు” అన్న తండ్రి మాటలు గుర్తొచ్చాయి.
“రామం.. ఏంటయ్యా ఇలా వచ్చావ్ ..”
అలా నాట్య భంగిమల శిల్పాలు చూస్తూ తను నిజంగా ఒక నాట్య మండపంలోనే ఉన్న అనుభూతికి లోనౌతున్న రామానికి పూజారి గారి పిలుపు వినబడలేదు.
“ఏంటయ్యా.. మైమరచిపోయావా” రెట్టించిన పూజారి గారి గొంతుతో ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి చూసాడు.
పూజారి గారు నూతిలోంచి నీళ్ళు తోడుతూ “చెప్పు ఏంటిలా వచ్చావ్ ” అన్నారు.
“ఏం లేదండీ ఊరికే” అన్నాడు రామాచారి.
“సర్లే పద.. గర్భగుళ్ళోకి.. హారతి తీసుకుందువు గాని” బిందెలో ఆఖరి చేద ఒంపుతూ అన్నారు.
“నాకు నమ్మకం లేదండీ.. మీరు వెళ్ళండి”
“చూడు రామం.. నమ్మకం లేనివాడివి గుడికి మాత్రం ఎందుకొచ్చావ్ ?”
“నాన్న గారు చెక్కిన శిల్పాలు చూద్దామని”
“గర్భగుడిలో విగ్రహం కూడా ఆయన చెక్కినదేనయ్యా.. ఇంకేం మాట్లాడకుండా రా లోపలికి”
మరీ మొండితనం బావుండదని రామం లోపలికి నడిచాడు.
గర్భగుడిలోకి ప్రవేశించగానే కాళ్ళకి నల్లని రాళ్ళు చల్లగా తగిలాయి. చుట్టూ ఒక వింత పరిమళం అలముకొంది. విశ్వంతో పాటు గుడిలోకీ ప్రవేశించాలని చూస్తోంది చీకటి. స్వామి వారి విగ్రహం ముందు వెలుగుతున్న చిన్ని దీపం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటోంది. ఆ నూనె దీపపు కాంతి పడి స్వామి వారి విగ్రహం వింతగా మెరుస్తోంది.
“చూడు రామం.. జీవం ఉట్టిపడే ఆ విగ్రహం చూడు.. అందులో సౌందర్యం చూడు” అన్నారు పూజారి గారు.
నిజంగానే ఆ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. చూస్తున్న అతనిలో ఏదో అవ్యక్త చైతన్యం. నిర్జీవమైన రాయిలో ఇంతటి జీవమా? నమ్మలేకపోయాడు. ఆ వెలుగుతున్న చిన్ని దీపం మరేమీ కాదు తన తండ్రి ఆత్మే అనిపించింది రామానికి.
“వస్తాను పూజారి గారూ” అని వెనుదిరుగుతుంటే..
“రామం.. ఆ కళ మీ నాన్న గారితోటే అంతరించిపోకూడదు. ధరణికోటలో సిద్ధప్ప గారని మంచి శిల్పి ఉన్నారుట. ఆయన దగ్గరకి వెళ్ళి శిల్ప కళని అభ్యసించకూడదూ”
“ఆలోచిస్తాను పూజారి గారూ” అని వచ్చేసాడు.
ఇంటికెళ్ళి స్నానం చేసి పూజగదిలోకి వెళ్ళి తండ్రి ఉలిని చేతిలోకి తీసుకుని దానివైపే చూస్తూ కూచున్నాడు.
వెర్రి నాగన్న.. దారిలో పడ్డట్టున్నాడు. తరతరాలుగా వస్తున్న కళ ఎక్కడకిపోతుంది. ఏదో కుర్రతనం వల్ల మసకబడింది తప్పితే అనుకుంది సత్యవతి.
తల్లి దగ్గర ఆశీస్సులు తీసుకుని మర్నాడే ధరణి కోట ప్రయాణం కట్టాడు. “నువ్వు రంగాచారి గారి అబ్బాయివా? మీ నాన్నగారు మహాశిల్పి. ఆయన కడుపున పుట్టి నాలాంటి మామూలు శిల్పి దగ్గర నేర్చుకుంటున్నావా? నీకు ఆనందంగా నేర్పుతాను” అన్నారు సిద్ధప్ప గారు.
రోజులు గడుస్తున్నాయి. రామం శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు. సిద్ధప్ప తనకు తెలిసిన మెళకువలన్నీ ఒక్కొక్కటీ చెప్తున్నారు. ఏది చెప్పినా మరుక్షణంలో గ్రహించేసేవాడు. గురువు గారికి ముచ్చట వేసేది. మిగతా శిష్యులు కూడా రామాన్ని పొగుడుతుంటే ఉబ్బితబ్బిబ్బైపోయేవాడు.
ఒక రోజు సాయంత్రం రామం, సిద్ధప్ప కృష్ణా నదిలో స్నానం చేసి వస్తుంటే మిగతా శిష్యులు పరుగు పరుగున వచ్చి రాజుగారు కబురు పెట్టారని చెప్పారు. సిద్ధప్ప వెళ్తూ తోడుగా రామాన్ని కూడా తీసుకెళ్ళారు. రాజుగారు రామచంద్రాపురంలో రామాలయం కట్టించాలని నిర్ణయించినట్టూ, ప్రధాన శిల్పిగా సిద్ధప్పని నియమించినట్టూ తెలిపారు. రాజప్రాసాదం నుండి బయటకి వస్తూ సిద్ధప్ప.. “చూసావా రామం, మన రాజు గారు కళారాధకులు. ఎన్ని ఆలయాలు కట్టించారు? ఎంత కళ వికసించింది వాళ్ళ హయాంలో! ఇప్పుడు మన మీద ఇంత బాధ్యత పెట్టారు. మనం శ్రద్ధగా చెయ్యాలి సుమా” అన్నారు.
ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఆలయం బయట ఏ ఏ ఘట్టాలు చెక్కాలి, లోపల ఏం చెక్కాలి ఇలా ప్రణాళికలు వెయ్యడంలో కూడా గురువుగారు రామాన్ని సలహాలు అడుగుతున్నారు. అంతమంది శిష్యులుండగా గురువుగారు తననే సలహాలు అడుగుతుండడంతో రామానికి ఆనందంతోపాటు గర్వంగా కూడా ఉంది. ఎవరే చిన్న తప్పు చేసినా తిట్టడం, అప్పుడప్పుడు అకారణంగానే చిరాకు పడడం చేసేవాడు.
ఒకరోజు గుడి బయట ఆంజనేయుడు సంజీవి పర్వతం చెక్కే ఘట్టం చెక్కుతున్నాడు రామం.
వీళ్ళు శిల్పాలు చెక్కడం చూడ్డానికి వచ్చిన ఊరి ప్రజల గుంపులోంచి ఎవరో అడిగారు.
“రామం, గర్భగుడిలో విగ్రహం నువ్వు చెక్కడం లేదేమీ అని?”
“నాకు దేవుడి మీద నమ్మకం లేదు” నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు రామం.
“నమ్మకం లేకనా.. చేతకాకనా?” జనంలోంచి పదునైన కంఠం..
నుదిటిమీది చెమటని తుడుచుకుంటూ తలెత్తి ఆవేశంగా చూసాడు రామం.. చూసి ఒక్క క్షణం చూపు తిప్పలేకపోయాడు. ఎవరో అమ్మాయి పచ్చని పరికిణీలో మెరుపు తీగలా తళుక్కుమంది. పక్కనే ఆమె స్నేహితురాళ్ళు ఉన్నారు. అంతా కొంటెగా రామం వైపే చూస్తున్నారు. నోటమాట రాక అలా చూస్తూ ఉండిపోయాడు. “పదండే వెళ్దాం…” కిల కిలా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటే అందెల రవళి కూడా దూరమయ్యింది.
జనంలో ఎవరో అడుగుతున్నారు. “ఎవర్రా ఆ అమ్మాయి?” అని. “పేరు కస్తూరి అంట… సిద్ధప్ప గారి దూరపు బంధువుల అమ్మాయిట” అని ఇంకెవరో చెప్పారు. రామానికి ఇవేవీ వినబడ్డం లేదు. ఆ అమ్మాయి మాటల గురించే ఆలోచిస్తున్నాడు. ఎంత అవమానం? భరించలేకపోయాడు. తను దేవుడి విగ్రహం చెక్కలేడా?
తిన్నగా సిద్ధప్ప దగ్గరకి వెళ్ళాడు.
“గురువు గారూ, శిల్పిగా నా స్థాయి ఏమిటి?”
“నీకేం రామం… నువ్వు చాలా మంచి శిల్పివి.”
“ఐతే గర్భగుడిలో రాములవారి విగ్రహం నేను చెక్కొచ్చా?”
“లేదు . దానికింకా సమయం ఉంది. నువ్వు మరికొన్నాళ్ళు సాధన చెయ్యాలి”
గురువుగారి మాటలు రుచించలేదు. ఎప్పుడూ తననే సలహా అడిగి తీసుకునే గురువు గారు ఇలా కాదంటారని అతనూహించలేదు.
“ఇప్పుడు మీ కపటత్వం బయటపడింది. నాకు కీర్తి రావడం మీకు ఇష్టం లేదు. నా ప్రతిభ చూసి మీకు అసూయ”
“రామం.. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?” మరొక శిష్యుడు విశ్వనాథం వారించబోయాడు.
“నాకు నువ్వేం చెప్పక్కరలేదు. నా ప్రతిభలో పదోవంతైనా లేని వాళ్ళంతా సలహా ఇస్తుంటే తీసుకోడానికి నేను సిద్ధంగా లేను”
గొడవపడబోతున్న విశ్వనాథాన్ని చూపులతోనే వారించి “సరే నాయనా. గర్భ గుడిలో రాముల వారి విగ్రహం నువ్వే చెక్కుదూగాని” అని ఒక నవ్వు నవ్వి వెళ్ళి పోయారు. ఆ నవ్వు తనని రెచ్చగొడుతున్నట్టుగా అనిపించింది. నేను చెక్కలేకపోవడమా అనుకున్నాడు.
మర్నాడే శిల్పం ప్రారంభించాడు. రోజులు గడుస్తున్నకొద్దీ, శిల్పం పూర్తవుతున్న కొద్దీ అతనిలో ఉత్సాహంతో పాటు అహంకారం కూడా పెరుగుతోంది. పొందబోతున్న గెలుపూ, దక్కబోతున్న గౌరవాలూ, సన్మానాలూ అతని కళ్ళకి మాయపొరలు కమ్మేసాయి. ఇక ముఖం ఒక్కటే మిగిలి ఉంది. మిగతా భాగమంతా తాను అనుకున్నట్టుగా రావడంతో అతని అహంకారం ఇంకా పెరిగిపోయింది. త్వరలోనే శిల్పాన్ని పూర్తి చేసి గురువు గారికి చూపించి గర్వంగా నవ్వుదామనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా జీవకళ మాత్రం రాలేదు. రామం ఒక్క సారి చతికిలపడిపోయాడు.
చీకటి పడింది… అంతా ఇంటికి వెళ్ళిపోయారు… దట్టంగా మేఘాలు కమ్ముకుని కుండపోతగా వర్షం కురుస్తున్నా అలాగే కూచుండిపోయాడు. లోపం ఎక్కడుంది? అతని ఆలోచనకి అందట్లేదు. ఈలోగా అకస్మాత్తుగా వర్షం తనమీద కురవడం ఆగిపోయింది. తలెత్తి చూస్తే గొడుగు పడుతూ కస్తూరి.
ఏదో శక్తి కమ్మినట్టు లేచి నిల్చున్నాడు.
కాసేపు మౌనంగా నడిచాక… “మీ ప్రయత్నంలో లోపం చెప్పనా?” అంది.
“నువ్వు చెప్పేది నాకు తెలుసు. నాకు దేవుడి మీద నమ్మకం లేదంటావు. అంతే కదా?”
“అది చాలా చిన్న విషయం”
“మరి??”
“ప్రతి శిల్పాన్నీ “నేను” సృష్టిస్తున్నాను అనే అహంకారం మీలో ఉంది. అది పోయేవరకూ మీరు నిజమైన శిల్పాన్ని సృష్టించలేరు.”
చాచి లెంపకాయ కొట్టినట్టనిపించింది. కాళ్ళకింద భూమి కంపించిపోతున్నట్టయ్యింది. ఆమె కళ్ళలోకి చూడలేకపోయాడు. అక్కడక్కడా మెరుపు వెలుగులో వాన చినుకులు మెరుస్తుంటే నిశ్శబ్దంగా నడుస్తున్నారిద్దరూ. అతని అంతరంగమంతటా వానచినుకుల్లా ఆలోచనలు. మౌనంగా గొడుగులోంచి బయటకి నడిచాడు. ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు. తిన్నగా వెళ్ళి గురువుగారి ఇంటి తలుపు తట్టాడు. ఈ వర్షంలో ఎవరా అని తలుపు తీసారు.
ఎదురుగా… ఎరుపెక్కిన కళ్ళతో, వర్షంలో తడిసి ముద్దై… రామం
రామాన్ని చూడగానే విషయం గ్రహించి మౌనంగా లోపలికి తీసుకెళ్ళి , “ఓటమిలేకుండా గెలుపు లేదు” అని భుజం తట్టి ఇంటికి పంపించేసారు.
మర్నాడు ఉదయాన్నే లేచాడు. రాత్రి వాన వెలిసాక, వేకువ మనోహరంగా ఉంది. సూర్యుడి బంగారు కిరణాలు పడుతుంటే కృష్ణా నదిలో స్నానం చేసాడు. ఉలిని చేతిలోకి తీసుకున్నాడు. మొదటి సారి తాకిన అనుభవం కలిగింది. తనని పలికించే శక్తిని ప్రార్థించాడు శిల్పాన్ని పూర్తి చెయ్యగల సామర్థ్యాన్ని ప్రసాదించమని. మలచబోయే నల్లని రాయిని చూసాడు.అందులోంచి రాముడు తనని చూసి చిరునవ్వు నవ్వుతున్నట్టుగా అనిపించింది. రామాయణం నిజంగా జరిగిందా? రాముడు నిజంగా ఉన్నాడా? ఏమో! అవేవీ ఆలోచించే స్థితిలో తాను లేనని అతనికి అనిపించింది.
ఉలితో శిల్పంలోంచి శిలను తొలగిస్తుంటే అతనిలోని సకల భేషజాలూ తొలగిపోతున్నట్టనిపిస్తోంది. శిలలాంటి అతని మనసు శిల్పంగా మారుతోంది. కొత్త ఉత్సాహం. ఏదో శక్తి అతడిని సమ్మోహన పరుస్తోంది. ఆ శక్తికి తనని తాను పూర్తిగా అర్పించేసుకున్నాడు. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. తిండి కూడా సహించడం లేదు. సూర్యచంద్రులు ఆ కళ్ళలోనే ఉదయించేవారు.
“మీరు ఇంకా ఎన్నో శిల్పాలు చెక్కాలి. ఆరోగ్యం కాపాడుకోండి” అనేది కస్తూరి.
“లేదు కస్తూరీ… నీకు తెలీదు. చెక్కే ప్రతి శిల్పం శిల్పి దృష్టిలో ఆఖరిదే కావాలి” అనేవాడు.
కొడుకుని చూడ్డానికి వచ్చిన సత్యవతి భర్తలో చూసిన ఉన్మత్తతని తొలిసారి కొడుకులో చూస్తోంది. మరొక శిల్పి ఉద్భవించాడు అని తృప్తిగా నిట్టూర్చింది.
శిల్పం పూర్తయ్యింది. సాక్షాత్తూ రాముడే వచ్చి కొలువైనట్టుగా ఉంది శిల్పం అన్నారంతా. సిద్ధప్ప రామాన్ని కౌగిలించుకున్నారు. అదే గుడిలో శ్రీరామనవమికి రామానికీ, కస్తూరికీ వైభవంగా పెళ్ళి జరిపించి కొన్నాళ్ళకి సత్యవతి నిశ్చింతగా కన్నుమూసింది.
***
ఒక రోజు సాయంత్రం గుడికెళ్ళి వస్తుంటే కస్తూరి అడిగింది
“ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముతారా?”
“దేవుణ్ణి నమ్మడం సంగతి తెలీదుగానీ ఈ దేవతని మాత్రం నమ్ముతాను ” అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.
“ఐతే ఈ దేవత శిల్పాన్ని చెక్కొచ్చుకదా… అనుగ్రహిస్తుంది.”
“అమ్మో… ఇంత అందమైన శిల్పాన్నే… నా వల్ల కాదు… ఈ శిల్పాన్ని మలచిన బ్రహ్మతో పోటీ పడలేను.”
“ఏమో… సమయమొస్తేనో! ఎవరు చూడొచ్చారు?” అని నవ్వింది.
కొన్నాళ్ళకి కస్తూరికి నెలలు నిండాయి. ఐతే కాన్పు కష్టమై తల్లీ, బిడ్డా పురిటిలోనే చనిపోయారు. భార్యావియోగంతో రామాచారి పిచ్చివాడైపోయాడు. శిల్పాలన్నీ వదిలేసి బికారిగా తిరుగుతున్నాడు. గొప్ప శిల్పాలు సృష్టించాల్సిన రామాచారి ఇలా ఐపోవడం ఊరి ప్రజల్ని కలచివేసింది. ఎందరో రామాన్ని తిరిగి మామూలు మనిషిని చెయ్యాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
ఒకరోజు మధ్యాహ్నం మండుటెండలో దారి తప్పి దాహంతో తిరుగుతున్న రామాన్ని చూసి పక్క ఊరి ఆకతాయి పిల్లలు రాళ్ళు విసురుతుంటే తప్పించుకునే ప్రయత్నంలో వెనక్కి తూలిపడబోయాడు. ఏవో రెండు బలమైన చేతులు పట్టి ఆపాయి. వెనక్కి తిరిగి చూసాడు. ఆరోజు కృష్ణానదిలో స్నానం చేస్తూ ఉదయిస్తున్న సూర్యుడిని చూసిన అనుభూతి కలిగింది. ఆయన బౌద్ధ గురువు ధర్మపాలుడు. ఆ చూపుల్లో ప్రేమ, అనంతమైన కరుణ.
“ఎందుకు పడిపోతున్నావ్ ?” ధర్మపాలుడి కంఠం గుడిగంటలా మ్రోగింది.
“దెబ్బలు తప్పించుకోవడానికి”
“దెబ్బలు తట్టుకుంటేనే కదా శిల శిల్పమయ్యేది”
“నాకు ఏ శిల్పమూ కావాలని లేదు”
“ఎందుకు లేదు?”
“నా కస్తూరి నా నుండి వెళ్ళిపోయింది ”
“ఎక్కడికి వెళ్ళిపోయింది?”
అవును ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధానం దొరకలేదు రామానికి.
“రామం… ఏ జీవీ మరణించడు. ఇన్ని రూపాల్లో నిండి ఉన్నది ఒకే శక్తి. నీలో శిల్పకళ నింపిందీ అదే… ఆ శక్తికి నాశనం లేదు. నీ సాధన పూర్ణత్వాన్ని సాధించలేదు. అందుకే నువ్వింకా దుఃఖితుడవై ఉన్నావు”
“ఏ మనిషీ మరణించడు” తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి. మరణశయ్యపై సైతం చిరునవ్వు నవ్విన తన తండ్రి రూపం ఒక్క క్షణం మదిలో మెదిలింది. మౌనంగా ధర్మపాలుని పాదాల్ని స్పృశించాడు. రెండు కన్నీటిబొట్లు ఆ పాదాల్ని తాకాయి. ఆ దివ్య స్పర్శతో రామం గుండెలోని చీకటి మొత్తం తొలగిపోయింది.తర్వాత ఆయన కోరిక మేరకు చుట్టుపక్కల ఊళ్ళలో బుద్ధ భగవానుడి శిల్పాలు చెక్కాడు. రాముడి శిల్పం చెక్కినా, బుద్ధుడి శిల్పం చెక్కినా ప్రతి శిల్పంతోనూ మాట్లాడేవాడు. శిల్పాలన్నీ ఏవో జన్మ అస్తిత్వ మరణ రహస్యాల్ని చెప్తున్నట్టనిపించేది. నృత్య భంగిమలు చెక్కినప్పుడు శిల్పాలన్నీ తన చుట్టూ భువన మోహనంగా నర్తించినట్టనిపించేది. అతిలోక సౌందర్యాన్ని ఆకళింపు చేసుకుని అది శిల్పాల్లో దర్శించేసరికి గుండె బద్దలైనంత పనయ్యేది. చెక్కే ఒక్కో శిల్పం అతడెంత అల్పుడో అతనికి తెలియజేస్తోంది, ఆద్యంత రహితమైన కళాసాగరంలో తనొక ఇసుక రేణువులా తోచేది.
చుట్టు పక్కల రాజ్యాల్లో కూడా రామం పేరు మార్మోగిపోయేది. ఎవరైనా ఇన్ని గొప్ప శిల్పాలు ఎలా సృష్టించారని అడిగితే, “నేను శిల్పాల్ని సృష్టించడమేమిటి? శిల్పాలే నన్ను సృష్టించాయి” అనేవాడు. యేళ్ళు గడిచాయి. క్రమంగా అతనిలోని శక్తి క్షీణిస్తోంది. ఎన్ని శిల్పాలు చెక్కినా, తను చెక్కాల్సిన ఏదో శిల్పం మిగిలిపోయినట్టుగా అనిపించేది. “ఏమో సమయమొస్తేనో…” కస్తూరి మాటలు జ్ఞాపకం వచ్చాయి.
కృష్ణా నదిలో స్నానం చేసి ఆఖరి శిల్పం చెక్కడం ప్రారంభించాడు. బాహువుల్ని చాపి చిరునవ్వుతో ప్రియుణ్ణి ఆహ్వానిస్తున్న ప్రియురాలి శిల్పం. తన కస్తూరినే ఊహించుకున్నాడు.ఒక పక్క అతనికి తెలుస్తోంది. కళని భరించదగ్గ శక్తిని తన దేహం మెల్లగా కోల్పోతోందని. అయినా పట్టుదలతో చెక్కుతున్నాడు. ఉన్నదున్నట్టు చెక్కేసాడు. ఇక పెదాల మీద చిరునవ్వు తెప్పించాలి. అతనికి తెలుసు… చిరునవ్వు లేకుండా శిల్పానికి పూర్ణత్వం చేకూరదని. ఎక్కడ లేని నిస్సత్తువ అతడిని ఆవహించింది. ఏదో శక్తి అతనితో తలపడుతోంది. ఆ శక్తి మృత్యువని అతనికి తెలిసిపోయింది. ఒక్క దెబ్బతో చిరునవ్వు పెదవుల మీద తెప్పించే మెళకువ అతని ఇన్నేళ్ళ సాధనలో పట్టుబడింది. ఉలిని పెదవుల మీద ఆన్చి శక్తినంతా కూడదీసుకుని సుత్తితో ఉలిమీద దెబ్బవేయబోతూ శిల్ప బాహువుల్లో కుప్పకూలిపోయాడు. ఆ పడిపోవడంలో సుత్తి ఉలిమీద పడి పెదవులు విచ్చుకుని శాశ్వతమైన చిరునవ్వు ఆ శిల్పపు పెదవులమీద విరిసింది.
---------X---------
(రచనా కాలం 2007)
10 comments:
EXCELLENT. "OTAMI LENIDEY GELUPU LEDU". EE KADHA MEEDA OKA THESIS AE RAYOCHU............ KEEP IT UP..... :)
ఎంతో అద్భుతంగా చెప్పారు. అభినందనలండి!
goppa kathanam, subrahmanyam gaaroo!
చాలా బావుందండి.
ఏటి ఒడ్దున,
శిల్పాలుగ మారని శిలలు
నీటి తుంపర్లు
అలల సవ్వడులు
గులకరాళ్ళ గలగలలు,
ని ఈ ఏటి ఒడ్ద్దున
పధాల ఉలితొ మలిచిన శిల్పాలు
కవితల ప్రవాహాలు
ఎన్ని రోజులు చెక్కావో అమరావ్రతన్ని,
ఇది కథ కాదు....
శిల్పం
ని ఏటి వొడ్డున
నీతో పాటు ....
మీ అమరావ్ర్రతం కథకంటే ఎక్కువే..ఇది చదవకపోయుంటే చాలా మిస్సయ్యేవాణ్ననే ఫీలింగ్ కల్పించిన కథ.మెచ్చుకోలుకి మాటలు దొరకట్లేదని బాధగాఉంది సుబ్రహ్మణ్యం గారూ..అభినందనలు
చదువుతుంటే దృశ్యాలు అలా కళ్ళకి కనిపిస్తున్నాయండీ.. చాలా అద్భుతంగా వ్రాసారు.
అమరావ్రతం..
ఎంత అందమయిన ఉలి చెక్కిన శిల్పం..
ఇన్ని రోజులూ ఎందుకు మిస్ అయానో?
ఎవరి కోసం రాస్తాం? ఎవరి కోసం ఆ మోనాలిసా చెదరని చిరునవ్వు..నీకోసం అనుకుంటే నీదే, ఈ అందమయిన సూర్యోదయం నీది అనుకుంటే నీదే, నీలో ప్రవహించే కళ ,ఏ రూపం లో ఎప్పుడు వస్తుందో?
సుబ్రహ్మణ్యం ...జస్ట్ మూవ్డ్ ,,ఐ ఆమ్ ..
వసంతం.
ఎంత అందమయిన ఉలి చెక్కిన శిల్పం..
ఇన్ని రోజులూ ఎందుకు మిస్ అయానో?
ఎవరి కోసం రాస్తాం? ఎవరి కోసం ఆ మోనాలిసా చెదరని చిరునవ్వు..నీకోసం అనుకుంటే నీదే, ఈ అందమయిన సూర్యోదయం నీది అనుకుంటే నీదే, నీలో ప్రవహించే కళ ,ఏ రూపం లో ఎప్పుడు వస్తుందో?
సుబ్రహ్మణ్యం ...జస్ట్ మూవ్డ్ ,,ఐ ఆమ్ ..
Chaalaa baagundi
Post a Comment