Tuesday, February 12, 2008

లోపలికి

లోపలికి

చెట్టుకి గమనం లేదని
జాలి పడకు
దాని ప్రయాణమెప్పుడూ
లోపలికే..


***

పచ్చజెండా

ఎన్నో రైళ్ళొచ్చాయి
ఎన్నో రైళ్ళు వెళ్ళాయి
కేబిన్లోంచి పచ్చ జెండా
ఎప్పటిలాగే రెపరెపలాడుతోంది

***

పగుళ్ళ లిపి

చెరువులో నీళ్ళన్నీ తాగేసి
వేసవి సూర్యుడు
అడుగున చిత్తడి నేలపై
పగుళ్ళ లిపిలో ఏదో రాసాడు.


* * *

ఏరు-చెట్టు

ఎక్కడకీ కదలని చెట్టు మెల్లగా
ఒక్కొక్క ఆకునే రాలుస్తుంటే
ఒక్క క్షణం ఆగని ఏరు వాటిని
ఎక్కడి తీరాలకో చేరుస్తోంది!

* * *

పాత టైరు

ఏ వాహనాన్ని
ఎన్నాళ్ళు మోసిందో
రోడ్డు పక్కన గడ్డిలో
నిశ్చలంగా నిద్రపోతోంది!


* * *

రెండు అనంతాల మధ్య..

మీద అనంతంగా విస్తరించిన ఆకాశం
కింద అనంతంగా పరుచుకున్న సముద్రం
మధ్యలో కదులుతోందో లేదో తెలీని విమానంలో నేను
చీకటి వెలుగులు మాటి మాటికీ దోబూచులాడుతున్నాయి

Thursday, January 17, 2008

చిరుజల్లులో పూలు

1.
తడుస్తున్నాం
చిరుజల్లులో పూలూ
నీ పాటలో నేనూ

2.
ఒక్క క్షణం కనిపించి
మళ్ళీ మాయమైంది
ఆకుల మధ్య జాంపండు

3.
ఎప్పటికైనా
కుదురుగా ఉంటుందా?
కోడిపుంజు మెడ

4.
బంతి మొక్క
ఎండిన పువ్వు పక్కనే
వికసిస్తున్న మరో పువ్వు

5.
పడవ నన్నూ
పాట నా మనసునూ
ఏవో తీరాలకి...

6.
అలికిడి మొదలైంది
మంచులో తడిసిన పూల మీద
దుమ్ము చేరుతోంది

7.
కిరణాలతో
కిటికీ బొమ్మ గీసాడు
సూర్యుడు

8.
గంట కొట్టి
కళ్ళుమూసుకుంది
ఏం కోరుకుందో!

9.
తవ్వుతున్నకొద్దీ
రంగులు మారుతోంది
మట్టి

10.
పసిపాప గుప్పెట్లో
నా చూపుడు వేలు
బంధాలు ఎంత గట్టివి?

11.
పాత కోవెల
రాతి స్తంభాలు
చల్లగా తగిలాయి

12.
రాళ్ళపై నడిచాకా
అరిపాదాలకి గడ్డి
మరింత మెత్తగా..

13.
ఎవరు పులిమారో
రాతి రంగే
ఈ తొండకి

14.
సాయంత్రం తోటలో
రక రకాల పక్షులు
బృందగానం

15.
దారి పొడుగునా
రాలిన పూలు
నడక ఎంత ఇబ్బంది?

Monday, December 24, 2007

ప్రేమ

నీ స్పర్శే నాలోని పాటని మేల్కొలిపింది
నేను పూర్తిగా నీలో మునిగి ఉంటాను
కేవలం మనిద్దరి కలయికనీ చూడ్డానికే
ఒకర్నొకరు తోసుకుంటారు సూర్యచంద్రులు

పూవులు రాలిపోతుంటాయి
యుగాలు గడిచిపోతుంటాయి
నువ్వు మాత్రం నా మీంచి ప్రవహించి
ఎల్లప్పటికీ నన్ను తేటగానే ఉంచుతావు

మన విషయంలో మరుపు,జ్ఞాపకం
మొదలైన మాటలకి అర్ధమే లేదు
గులకరాయి తన సెలయేటిని
గుర్తుంచుకోడమూ, మర్చిపోడమూనా!

Saturday, December 22, 2007

నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే...

గుప్పెడు క్షణాల్ని దోసిట్లో పోసి ఇక నీ ఇష్టం అని ఆమె చినుకుల్లో చినుకుగా మాయమైంది.. ఈ క్షణాలు కరిగిపోయేలోగా అతడిని కలుసుకోవాలి. చుట్టూ కురుస్తున్న వర్షం....కొండ కోనల్లో వర్షం.. గుండె లోయల్లో వర్షం.. లోకంలోని కల్మషాన్నంతటినీ కడిగేస్తూ వర్షం.. హర్ష వర్షం... వర్ష హర్షం.. నేలని చినుకు పెదవులతో కోటి సార్లు ముద్దాడుతూ ఆకాశం..మబ్బులన్నీ కరిగిపోగా విశాలంగా నవ్వుతూ ఆకాశం... చిన్ని చిన్ని నీటి మడుగుల్లో తనని తాను చూసుకుని మురిసిపోతూ ఆకాశం...

ఇంత చిన్ని నీటి మడుగు అంత పెద్ద ఆకాశానికి అద్దం ఎలా అయిందని విస్మయపడుతూ నేను. సృష్టి తనని తాను అనేకానేక రూపాల్లో వ్యక్తపరుచుకోవడం దర్శించినప్పుడల్లా నాలో ఇదే ఆశ్చర్యం. ఇలాంటప్పుడే పచ్చికబయళ్ళెమ్మట పరుగులు పెట్టిన వాన వెలిసిపోగానే తేటపడ్డ లేతగడ్డి పువ్వులా మనసు గెంతులు వేస్తుంది. తలెత్తి చూసాను. కనుచూపు మేరంతా విశాలంగా పరుచుకున్న మైదానం. మైదానంలో విశృంఖలంగా నర్తిస్తూ సంధ్య ప్రవేశిస్తోంది.శబ్దాలన్నీ మౌనపు లోతుల్లోకి మునిగిపోతున్నాయి. లోకమంతా చీకటి కౌగిలిలో ఒదిగిపోతోంది. మట్టివాసన గుండెనిండా పీల్చుకుని, జ్ఞాపకాలని మూట కట్టుకుని బయలుదేరాను. ఆకుల చెంపలపైనుండి కన్నీరు బొట్లు బొట్లుగా జారుతుంటే బారులు తీరిన చెట్లన్నీ నాకు వీడ్కోలు పలుకుతున్నాయి.

మార్గం సుదీర్ఘం. చుట్టూ నిబిడాంధకారం. అయితేనేం నాకు దారి చూపేందుకు అనంత కోటి నక్షత్రాలు. అతడిని కలుస్తున్నానన్న ఆనందం మరొక నక్షత్రమై ఆకాశాన్ని చేరి మెరుస్తోంది.పక్షులన్నీ మా ఇద్దరి కలయికనీ గానం చేస్తాయన్న తలంపు నాకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తోంది.సరిగ్గా ఇదే సమయానికి అతను చీకటి సముద్రపు లోతుల్లో బయలుదేరి ఉంటాడు. అతడు సంద్రాన్ని చీల్చుకుని పైకి వచ్చేసరికి నేను కూడా సముద్రాన్ని చేరుకోవాలి. అతడి బంగారు కిరణాల దారాలతో నా ఆత్మ చిరుగుల్ని కుట్టుకోవాలి. తొందరపడాలి.

రాత్రి కళ్ళు మిటకరిస్తోందా అన్నట్టు అక్కడక్కడా మిణుగురులు. రాత్రి గుండెచప్పుడా అన్నట్టు కీచురాళ్ళు . ఇక నేను ఒంటరినెలా అవుతాను? ఆ ఉత్సాహంలో అనంతంగా పరుచుకున్న నల్లని రాత్రిని దాటి అతనికంటే ఒక అడుగు ముందే సముద్రాన్ని చేరుకున్నాను. సముద్రాన్ని చీల్చుకుని అతను బయటకి వచ్చే దృశ్యం. అదొక అద్భుతం! అసలు ఆ దృశ్యాన్ని చూడ్డానికే ఈ జన్మ ఎత్తితేనేమనిపించింది. ఆ ఉద్వేగంలో గుండెలు బ్రద్దలైపోతేనేమనిపించింది. నా కళ్ళు చెప్పలేని ఆనందంతో తడిసాయి. కలా నిజమా అని చూస్తుంటే మొహానికెదురుగా చేతులాడించినట్టు అతని కిరణాలు. అనుకున్నట్టుగానే పక్షులన్నీ అతని ఆగమనాన్ని గానం చేస్తుంటే నన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ అతనన్నాడు కదా.. "నువ్వు నా పై పై వెలుగునే చూస్తున్నావు. నాలో నిరంతరం రగిలే అగ్ని గుండాన్ని చూడట్లేదు" అని

అప్పుడు నాకర్ధమైంది వెలుగునివ్వాలంటే రగిలిపోవాలని!

(“You must have chaos within you to give birth to a dancing star.”అన్న నీషే ప్రవచనం ఆధారంగా..)

ఏటి ఒడ్డున

కోటి ఆలోచనలతో
ఏటి ఒడ్డున

ఎక్కడనుంచి వస్తోంది?
ఎక్కడకి వెళుతోంది?
వెనక్కెందుకు ప్రవహించదు?

దట్టమౌతున్న చీకట్లలో
అన్వేషణ పూర్తవకుండానే
నిష్క్రమణ

సెలయేరు ఇంకా
ప్రవహిస్తునే ఉంది!