Friday, November 25, 2011

ఆకుపచ్చని కవి

అది 2003 వ సంవత్సరం సెప్టెంబరు నెలలో ఒక రాత్రి. ఉద్యోగంలో చేరిన కొత్త. ఒక ప్రాబ్లం ఎంతకీ తెగట్లేదు. విసుగొచ్చింది. మర్నాడు ఫ్రెష్ గా చూడొచ్చులే అనుకుని , ఆ రోజుకి దాన్ని వదిలేసి ఇంటర్నెట్లో మంచి తెలుగు సాహిత్యం గురించి వెతుకుతుంటే ఈమాట దొరికింది. అదే మొదటిసారి ఈమాట పత్రికని చూడ్డం. ఎన్నెన్ని వ్యాసాలు, ఎన్నెన్ని కథలో అని అబ్బురపడుతూ అలా ఈమాట గ్రంధాలయానికి వెళ్ళాను. నవీన ఛందోరీతుల్లో ఇస్మాయిల్ "రాత్రి వచ్చిన రహస్యపు వాన" కనిపించింది. టైటిలు ఎంత బావుందో అని తెరిచి చూసాను. నిజంగానే ఆ రాత్రి రహస్యంగా వాన కురిసింది నాలో! ఆ రాత్రి మరి నిద్రపట్టలేదు. నన్నెవరో లోపలి నుంచి బయటకి తిరగేసినట్టయిపోయింది. కవిత్వం మొత్తం ప్రింట్ అవుట్ తీసుకుని ఇంటికెళ్ళికూడా అదే చదువుకున్నాను మళ్ళీ మళ్ళీ! ఎంత గొప్ప కవిత్వం! కవిత్వం ఇంత సరళమా , మనం రోజూ చూసే ప్రపంచంలోని చిన్న చిన్న విషయాల్లో ఇంత కవిత్వం దాగుందా అని విస్మయపడ్డాను. ఈయనెవరు? ఇంత గొప్ప కవిత్వాన్ని రాసినాయన పేరు కూడా నేను వినకపోవడమేంటి అని సిగ్గుపడ్డాను. తర్వాత ఆయన రాసిన పుస్తకాలన్నీ సంపాదించి ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చదువుకుంటునే ఉంటాను. సృజన తత్వం మీద నాకున్న అనేక ప్రశ్నలకి, సందేహాలకీ ఈయన వ్యాసాల్లోనూ, కవిత్వంలోనూ జవాబులు దొరికాయి. దొరుకుతున్నాయి.


భాషని శుభ్రపరిచి , తెలుగు కవిత్వానికి ఒక నిసర్గ సౌందర్యాన్ని తెచ్చిన ఆయన పదహారేళ్ళకి తన మొదటి కవిత రాసారు. తర్వాత కవిత్వంలో తనదైన మార్గాన్ని అన్వేషించుకుంటూ పదహారేళ్ళపాటు తపస్సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ తపస్సులో తెరుచుకున్న అంతర్నేత్రాలతో ఆయన లోకాన్ని దర్శించారు. ఆ చూపులోని కరుణకి లోబడి సమస్త ప్రకృతీ మౌనంగా తలవంచుకుని ఆయన కవిత్వంలోకి ప్రవేశించింది. "దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది" అని కృష్ణ శాస్త్రి స్వేచ్ఛా గీతానికి సరిహద్దు గీయగల తాత్వికుడు, "ఇరుచెంపల్నీ ఒరుసుకుంటూ పారే ప్రియురాలి కురుల సెలయేరులా" అనగల భావుకుడూ, "అక్షరారణ్యాల్ని విస్తరింపజేసాడీ కవి, ఒక మొక్క నాటితే సంతోషిద్దును" అని ఛలోక్తులు విసరగల చతురుడు , "నేనొక గబ్బిలాయిని/పాత స్నేహపు చూర్లు పట్టుకు వేలాడతాను" అని ప్రకటించిన స్నేహశీలి, వెయ్యేళ్ళ తెలుగు కవిత్వంలో ఒకే ఒక్కడు ఇస్మాయిల్ . జీవితం మీద అంతులేని ప్రేమని కలిగిస్తాయి ఈయన కవితలు...


నీడని పరుచుకుని
ఎండని కప్పుకుని
పడుకుంది రాలిన ఆకు


ఒక రాలిన ఆకులో ఇంత తాత్విక నిబ్బరాన్ని ఎలా దర్శించగలిగారో ఈయన! జీవితంలో కష్టాలుంటాయి. ఆ కష్టాల్ని జయించడానికే పాట...

సెలయేరా సెలయేరా
గలగలమంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు

చూడు నా బ్రతుకునిండా రాళ్ళు
పాడకుంటే ఎలా?

ఈయన కవిత్వంలో ఎన్నెన్ని దివ్య దృశ్యాలో..


దుమ్ములో ఆడుకునొచ్చి
నవ్వుతోందీ పాప
ఒళ్ళంతా దుమ్మంటుకుంది
నవ్వుకు మాత్రం అంటలేదు.


ఏ దుమ్మూ అంటని స్వచ్ఛమైన కవి ఈయన. ఇలాంటి దర్శనానికి కేవలం కవి ఐతే సరిపోదేమో అనిపిస్తుంది. ఒక సమగ్ర జీవితానుభవం పొందిన తాత్విక నేత్రాలకి బాల్యపు చూపు కూడా జతకావాలి.

ఎర్ర చీర కట్టుకుని
ఇంటి మూలల్నే కాదు
మనసు మూలల్ని కూడా వెలిగించింది

నిజంగా మనసు మూల మూలల్నీ వెలిగించగల శక్తి ఈయన కవిత్వానికుంది. జీవితాన్ని ఇంతలా ప్రేమించిన కవి చాలా అరుదు. జీవితాన్ని నిండుగా అనుభవించి, చెట్లనీ, పువ్వుల్నీ, పిల్లల్నీ, మనుషుల్నీ ఉన్నవున్నట్టుగా ప్రేమించి, ఆ ప్రేమనీ, అనుభవాల్నే అక్షరాల్లోకి అనువదించడం వల్ల ఈయన కవిత్వానికి ఒక స్పష్టత, స్వచ్ఛత వచ్చాయి.

వేయి సువర్ణ ప్రభాతాల మేరకు
ధనవంతుణ్ణి
డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది

సంక్లిష్టమైన ఆధునిక జీవిత భీభత్సం నుంచి సేదదీర్చగల సారళ్యం ఈయన కవిత్వం నిండా..

పగలంతా ప్రయాణం చేసి
ప్రదోష వేళ ఒక చోట చేరాం


చెట్ల నీడల్తో చెరువు
చెట్ల నీడన గుడిశ


పక్కనే ఒక మడి చెక్కా
పైన ఆకాశమూ

ఇంత సరళత సాధించాలంటే
ఎన్ని జన్మలెత్తాలో!



నిజమే ఇంత సరళత సాధించాలంటే ఎన్ని జన్మలెత్తాలో! కవిత్వంలో ఆయన సాధించిన సరళత సామాన్యమైనది కాదు. తు ఫు , లి పో వంటి చైనీ కవుల్లోనూ, ర్యోకన్ , బషో లాంటి జపనీయ కవుల్లో మాత్రమే ఇంత సారళ్యాన్ని మనం గమనించగలం.


నా కవిత్వాన్నీ, జీవితాన్నీ ఇంతలా ప్రభావితం చేసిన ఆయన్ని ఒక్కసారైనా కలవలేకపోయానే అన్న బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతుంటుంది. ఈమాటలో ఈయన కవిత్వాన్ని మొదటిసారి చదివిన రెండు నెలలలోపే నవంబరు 24 , 2003 న ఈనాడులో "ఇస్మాయిల్ మృతి" వార్త చూడాల్సి రావడం పెద్ద విషాదం. ఐతే ఆయనే చెప్పినట్టు కవి కీర్తిశేషుడైనా కవిత్వం మాత్రం మృత్యువు మీద పచ్చలబాకు దూస్తునే ఉంటుంది..


కీర్తి శేషుడైన కవి
కాలసాగర తీరాన
కాస్సేపు పచార్లు చేసి
గులకరాయొకటి
గిరవాటేసి
తిరిగి వెళ్ళిపోయాడు

లోకమనే కుక్కపిల్ల
తోకూపుకుంటూ వచ్చి
గులకరాయిని చూసి
కొరికేందుకు ప్రయత్నించింది
ఇటువంటి రాయి అది
ఇదివరకు చూళ్ళేదు


కవి వదిలిపోయిన రాయి
కుక్క పిల్లని బాధిస్తోంది
ఊడపెరిగిన కనుగుడ్డులా
అన్ని దిక్కులూ పరికిస్తోంది
తనులేకపోయినా
తనకేసే చూస్తోంది రాయి

ఆకాశానికీ భూమికీ మధ్య
ఆకారం తాల్చిన రాయి
గుండ్రంగా దొర్లుతూ సముద్రపు
గోళ్ళనించి తప్పించుకుంటుంది
గుండ్రంగా విత్తనంలా పాతుకుని
మృత్యువుపై పచ్చటి బాకు దూస్తుంది.


(నిన్న ఇస్మాయిల్ ఎనిమిదవ వర్దంతి సందర్భంగా...)

5 comments:

రసజ్ఞ said...

ఒక గొప్ప కవిని పరిచయం చేసిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు! అన్నీ డౌన్లోడ్ చేసుకుని చదవటం మొదలుపెట్టాను. ఎంత చక్కని భావ వ్యక్తీకరణ! అంత్యంత సరళమయిన భాషతో ఎంతో అర్ధాన్ని స్పురింప చేసేవిగా ఉన్నాయి అన్నీ! ఇలకు కలిగింది మబ్బు కడుపు వేవిళ్ళ గాలులు అంటూనే ... నేనొక వర్షా గర్భంలో వర్ధిల్లే శిశు పిండాన్ని అంటూ పోల్చడం ఆయనకే చెందింది!

అక్షర మోహనం said...

గౌరవ ఇస్మాయిల్ గారు కావలిసిన0త కవిత్వాన్ని మనకు వొదలి వెళ్ళిపొయినప్పుడు,"చెట్టు వొరిగింది /చిలకలన్నీ జ్ఞాపకాల్లోఎగిరి/నా అక్ష రాలపై వాలుతున్నాయి అని రాసుకున్నాను. మా "మో' గారి సమక్షం లో ఇస్మాయిల్ గారితొ కరచాలనం గుర్తుకొచ్చింది మీ రచన చదివాక. మీకు నెనరులు .

గీతిక బి said...

//సంక్లిష్టమైన ఆధునిక జీవిత భీభత్సం నుంచి సేదదీర్చగల సారళ్యం ఈయన కవిత్వం నిండా..//

ఆయన కవిత్వంలో ఉండే స్పష్టత, సున్నితత్వం, సునిశితత్వం.. చాలా నచ్చుతాయి నాకు. అంత చిన్నిచిన్ని మాటల్లో ఆయన పలికించిన భావాలు ఎంత గాఢంగా ఉంటాయో...!

bangaRAM said...

సెలయేతివొద్దున్న ఆకుపచనిగ్నపకమెప్పుదు తాను సజీవమై మనలను పదునెక్కిస్తుంది.పదిలపర్స్తుంది.పరసివజేస్తుంది.ఒక అరుదైనా అభిమాన గ్నాపకం.

Bolloju Baba said...

good essay