పొగ త్రాగరాదులో "దు" చెరిపి వేసే చిలిపి బాల్యాలు, నావల్ల కాదు మొర్రో అని స్కెచ్చు పెన్ను మొత్తుకుంటే వెనక కుచ్చు తీసి దాన్లో నీళ్ళు పోసి ఇంకా రంగులు రాబట్టే ప్రయత్నాలు, కరెంటు పోయిన వేసవి రాత్రి కొవ్వొత్తి వెలుగుతుంటే కొవ్వు కరిగి రకరకాల కళాకృతులు, నాలాగేసినాడు దొంగ అని పంటలేసుకోడాలు, వినాయక చవితి నాడు పనసాకుల బుట్టల్లో రుచిగా ఉడికే కుడుములు, "రెండు సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్రేఖ ఖండిస్తే ఏర్పడే ఏకాంతర కోణాలు సమానాలు" అని వల్లెవేస్తున్న సూర్యారావు మేష్టారి మేడ మీద ట్యూషన్ పిల్లలు, చెల్లా చెదురైన ఏడు పెంకులూ దొంతు పెట్టేసామని పొంగిపోతుండగానే మళ్ళీ కూలిపోడాలు, వైజాగు పాత పోస్టాఫీసుకీ, కైలాసపురానికీ మధ్య అలుపెరుగక ట్రిప్పులు కొట్టే 48A బస్సులు, మిలే సుర్ మేరా తుమారా అని డిడిలో వస్తుంటే అర్ధం తెలీపోయినా కళ్ళప్పగించి చూడ్డాలు, వానజల్లు కొడుతుంటే కిటికీ పాసుపోత్తోంది అనే చంటాళ్ళు, టీచరు రాని క్లాసురూంలో బ్లాక్ బోర్డుమీదకెక్కే మాట్లాడిన వాళ్ళ పేర్లూ, మొదటిసారి గెడ్డం చేసుకున్నాకా చెంపల మీద జిల్లుమన్న ఆఫ్టర్ షేవ్ లోషన్లు, పరిక్ష రోజు ఉదయం హాల్ టిక్కెట్లకి అంటిన పసుపు కుంకుమలు, 045 రేనాల్డ్స్ ఫైన్ కేర్బ్యూర్ పెన్నులతో రాసి రాసి నింపిన అడిషినల్ షీట్లూ, పీచు మిఠాయి జాడీలోంచి పొట్లాంలోకి ఎన్ని పుల్లలొస్తున్నాయో అని ఆశగా చూడ్డాలు, బాత్రూంలో బాల్టీకి అతికించబడిన బొట్టుబిళ్ళలు, వానలో తడిసి పరిమళించే నీలగిరి చెట్టు బొంగరాలు, సాయంకాలపు రైలు కిటికీలో బింబప్రతిబింబాల నాట్యాలు, హైద్రాబాద్ కోఠీలోనూ, విజయవాడ లెనిన్ సెంటర్లోనూ, వైజాగు పోలీస్ బేరెక్సు దగ్గరా పాత వాసన వేసే పుస్తకాల కొట్లూ, తిరుపతి పాసింజర్లో కరకరలాడే సమోసాల మధ్య తొక్క తియ్యని బంగాళాదుంపలు, బయట వాన పడుతుంటే బాత్రూంలో వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి అద్దం మీద ఆవిరిని అరచేత్తో తుడిచి మొహం చూసుకోడాలూ, వెయ్యి సంవత్సరాలు వేలాడే పోలిథీన్ కవర్లో ఒక్కరోజులోనే వాడిపోయే మల్లెపూలు, "ఓయబ్బో మీ బొట్టెడు నోట్లో ఏలెడితే కొరకనేడు మరి" అనుకుంటూ పల్లెటూరి తగూలు, హాస్టల్ బయట టెలిఫోను బూతులో మాటకి విలువ పెరగడాలూ, తిరునాళ్ళలో కళ్ళముందు ఎగిరే రంగు రంగుల సబ్బు బుడగలు, నూతి చప్టాలో నానుతున్న బాదం చెట్టు ఆకులు, గూట్లో ఇసక అంటుకున్న లైఫ్ బాయ్ సబ్బులు, రైలొస్తుంటే గుండె దడ హెచ్చే ప్లాట్ ఫారాలు, క్లాసు పుస్తకాల మధ్య ఒద్దికగా ఒదిగిపోయే చందమామ బాలమిత్రలు, తిరుపతి గుండు మీద చల్లటి నీళ్ళు పోసుకున్నాకా వెచ్చగా తగిలే అరచేతుల వింత స్పర్శ, గరుకు గచ్చు మీద అష్టాచెమ్మా కోసం చింత పిక్కలు అరగదీస్తుంటే పుట్టే వేడి, రాజమండ్రిలో సంధ్య వేళ జాలరి వల మీద చీకటి వెలుగులు చిత్రించే వింత చిత్రాలు, కోరమండల్ ఎక్స్ ప్రెస్లోంచి గోదావరిలోకి భక్తిగా జారే చిల్లరనాణేలు, స్టేషన్ చేరువవుతుంటే అనంతంగా చీలిపోయే రైలు పట్టాలు, దిద్దీ దిద్దీ లావెక్కిపోయే పలక మీద అ, ఆలు, దారిపక్కన ఏమీ ఆశించకుండా పూసే చంద్రకాంతం పూలూ, కావేరీ తీరాన రంగనాథుని కోవెళ్ళూ...
5 comments:
Very Nice...
Very Nice
BRILLIANT ..
వీటిల్లో నాకు అనేకం స్వానుభవం కాదు, మిగతా కొన్ని అంతబాగా గుర్తు లేవు గానీ .. స్కెచ్చి పెన్ను దూదిలో నీళ్ళు పోసి రాయించే ప్రయత్నం .. పరీక్షల్లో ఎవడెన్ని ఎడిషనల్స్ తీసుకుంటే అంత గొప్ప (మా కాలంలో హీరో పెన్ను) .. భలే భలే. చప్పట్లు.
గుండు మీద వేణ్ణీళ్ళు, చెయ్యిపెట్టుకుంటే కలిగే వింత స్పర్శ భలే భలే. గుర్తొస్తేనే పులకరించే అనుభవాలు. భలేగా చెప్పారు.
ఎంతగా ఇన్వాల్వ్ అయ్యానంటే... నన్ను నేను చూసుకున్నంత..
చాలా చాలా బావున్నాయి...
చిన్ననాటి పనుల్ని ఇప్పుడు తలుచుకుంటే కమ్మదనం.. కానీ చెయ్యాలంటేనే చిన్నదనం...
భయాలు, భారాలు తెలీని బాల్యం నిజంగా ఒక తీపి అనుభవం.
Post a Comment