Friday, April 27, 2012
కొండవాగులో బంతి -- కథ వెనక కథ
కవిగా నా జీవితంలో 2004 నుండి 2007 వరకు మరుపురాని కాలం. సేదదీర్చిన ప్రతి చెట్టు నీడనీ కాసేపు ప్రతిఫలిస్తూ ఒక ప్రవాహంలా సాగిపోతున్న రోజులు. ఆ రోజుల్లోనే ఇస్మాయిల్ "రాత్రి వచ్చిన రహస్యపు వాన" లో పూర్తిగా తడిసిపోయాను. జీవితం ఇంత ఆనందమయమా? కవిత్వం ఇంత సరళమా? అని అబ్బురపడుతున్నాను. అప్పుడు చదివిన కరుణ ముఖ్యం వ్యాసాలు వాటి ద్వారా పరిచయమైన జెన్ కవిత్వం , హైకూలు నా జీవితం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చూపాయి. సరిగ్గా ఆ రోజుల్లో ఒక ఆదివారం మిత్రులు నండూరి గారు ఫోన్ చేసి బాపు గారి బొమ్మలు, కొన్ని పుస్తకాలు ప్రదర్శన ఉంది వెళ్దామా అన్నారు. అక్కడ పుస్తకాల్లో "త్రిపుర కథలు" పుస్తకం చూసాను. రచయిత పేరు వినలేదు. వాంగో స్కేరీ నైట్స్ పెయింటింగ్ ఆ పుస్తకానికి కవర్ పేజీ. లోపలి పేజీలు తిరగేసాను..
Who calls my poems poems?
My poems are not poems.
Knowing my poems are not poems
Together we can begin to speak of poetry.
-- ryokan
నాకు బాగా ఇష్టమైన ర్యోకన్ కవిత. ఈయనకి కూడా నచ్చిందే అని ఒక అబ్బురం. ఇంకేమీ ఆలోచించకుండా పుస్తకం కొనుక్కున్నాను. ఇంటికి వచ్చి "పాము" కథ చదివాను. కొత్తగా ఉందే అనిపించింది. కథలు నన్ను చదివించాయి. మళ్ళీ మళ్ళీ చదివించాయి. ఆ కథల్లో కల్పించిన వాతావరణం అంతా నాకు కొత్త. బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిసరాలు, మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్, బర్మా ఇవన్నీ. వ్యక్తుల మనస్తత్వం కూడా నాకు కొత్త. ఉన్నత తరగతిలోంచి వచ్చిన మనుషులు. అయినా చిత్రంగా కథలన్నీ నాకు విపరీతంగా నచ్చాయి. ఆయన పదాలతో బొమ్మ కట్టే తీరు, సముద్రపు హోరులో కెరటానికీ, కెరటానికీ మధ్య ఉన్న అమోఘమైన నిశ్శబ్దాన్ని తన కథల్లోకి ప్రవేశపెట్టగల ఆయన ప్రజ్న నన్ను అబ్బుర పరిచింది. రెండు మూడు బ్రష్ స్ట్రోక్స్ తోనే ఒక బొమ్మ గీయగల నేర్పు కూడా ఆయన కథల్లో చూడొచ్చు. సాఫీగా తాపీగా సాగే "అనగనగా..." కథలకి అలవాటు పడిన నన్ను ఒక్కసారిగా ఒక మహాప్రవాహంలోకి తోసేసినట్లైంది. మనిషి సాటి మనిషి కోసం చెయ్యగలిగిన త్యాగం ఒక వైపు, ద్రోహం మరోవైపు ఈ రెండిటి మధ్యా ఈయన కథలు ఊగిసలాడతాయి. ఆయన కథల్లో అంతర్లీనంగా ఉండే జెన్ బౌద్ధం కూడా నన్ను ఆకర్షించింది. నేను ఎన్నో పుస్తకాలు కొని చదివేసాకా ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను. ఇంట్లో లైబ్రరీలు మెయింటైన్ చెయ్యాలనీ, చదివిన పుస్తకం మళ్ళీ మళ్ళీ చదవాలనీ ఉండదు. కానీ నా దగ్గర ఉంచుకుని మళ్ళీ మళ్ళీ చదువుకునే పుస్తకాల్లో త్రిపుర కథలు కూడా ఒకటి.
త్రిపుర కథల్లో నాకు బాగా నచ్చిన "జర్కన్" అనే కథను ఒక ప్రేమ కథగా రాద్దామని ఉండేది. అదే ఆలోచన దాదాపు రెండేళ్ళ తర్వాత "కొండవాగులో బంతి"గా బయటకి వచ్చింది. "కొండవాగులో బంతి" రాసే సమయానికి నేను జెన్ తాత్వికతలో మునిగితేలుతున్నాను. అసలు జెన్ ఒక తాత్వికత కూడా కాదు. అదో జీవన విధానం. తరచి తరచి చూసాకా ఆ జెన్ మూలాలు నాలో ఉన్నాయని నాకర్ధమైంది. ఉదాహరణకి సెలయేరు ఒక జెన్ ప్రతీక. జెన్ బౌద్ధం గురించి తెలీక మునుపే నేను సెలయేరు మీద చాలా కవితలు రాసి ఉన్నాను. ఆ దశలో ప్రకాష్ అని మా ఫ్రెండుతో 2006 లో ఒక అర్ధరాత్రి వైజాగు బీచ్లో కెరటాలు జూలు గుర్రాల్లా తీరం వైపు దూసుకొస్తుంటే చూస్తూ ఒక చర్చ నడిచింది. నేను కవిత్వ సాధన , జెన్ అధ్యయనం ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు వాడు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది. దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్న సూక్తి అనుభవంలోకి వచ్చింది.
వాడన్నాడు "ఈ కాలంలో బుద్దుడు బోధి చెట్టుకింద కూచోనక్కరలేదు రా" అని, దాదాపు నేనూ అదే అభిప్రాయంతో ఉండడంతో అమితాశ్చర్యంతో "నేషనల్ జియోగ్రఫీ చానల్ చూస్తే చాలు" అని పూరించాను. ఈసారి ఆశ్చర్యపోవడం వాడి వంతయ్యింది. ఎందుకంటే వాడు సరిగ్గా అదే విషయం చెప్దామనుకున్నాట్ట. ఇద్దరికీ ఆ రోజు చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. ఆ చర్చలూ ఆలోచనలూ అన్నీ ఆ కథలో ప్రతిబింబిస్తాయి.
నాకెంతో ఇష్టమైన త్రిపుర గారు గత పాతికేళ్ళ నుంచీ వైజాగులోనే ఉంటున్నా , చాలా సార్లు బీచ్ కి వెళ్ళినప్పుడు పాండురంగాపురం డౌన్లోంచే వెళ్ళినా, ఆ సముద్రపొడ్డున చిన్న అపార్టుమెంటులో మరో సముద్రం ఉందని నాకు తెలీలేదు. గత సంవత్సరం కనక ప్రసాద్ గారు, మరొక త్రిపుర గారి వీరాభిమాని రామయ్య గారు వీళ్ళిద్దరి ద్వారా త్రిపుర గారితో పరిచయం కలిగింది. ఆయన వాత్సల్యాన్నీ, కరుణనీ పొందగలిగాకా "త్రిపుర గారే ఉండగా ఆయన కథలెందుకులే" అని కనకప్రసాద్ గారి మాటలు ఎంత నిజమో అనిపిస్తాయి.
కొండవాగులో బంతి కథని ఎవరైనా పొగిడినప్పుడల్లా అది ఒరిజినల్ కథ కాదనీ, త్రిపుర గారి జర్కన్ కథకి అనుసరణ మాత్రమే అనీ ఆ పొగడ్తలన్నీ ఆయనకే చెందాలనీ చెప్పాలని ఉంటుంది .అందుకే ఈ పోస్టు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment