Wednesday, December 23, 2009

దివ్వెలు

1.
భూమ్మీద
ప్రతి చెరువులోనూ
మునుగుతాడు
చంద్రుడు

2.
గాలి కచేరీ
చెట్టు నుండి
చెట్టుకి
ఆకుల చప్పట్లు

3.
వెలుగు నీడ
శబ్దం నిశ్శబ్దం
జీవం మృత్యువు
అలవోకగా కలసిపోయి
అడవి

4.
మూసుకుని తెరుచుకోవడంలోనే
జీవమైనా రాగమైనా
చెప్తునే ఉంటాయి
గుండె.. పిల్లనగ్రోవి

5.
అడ్డొచ్చిన వాటిని
తొలగించక
వెలిగిస్తాడు
సూర్యుడు

Thursday, December 3, 2009

ఇస్మాయిల్‌కి మరోసారి


ఆకాశపు నీలిమలో మునకలేసి
కిలకిలల పాటల్లో తేటపడి
మౌనంగా గూట్లోకి ముడుచుకుంటూ

పక్షి రెక్కల్లో
మీ అక్షరాలు

ఒడ్డున సేదదీరిన మనసుల్ని చల్లగా స్పృశిస్తూ
పున్నమి రాత్రి పూర్ణ బింబం కోసం ఎగసిపడుతూ
ఏ లోతుల్లోంచి... ఏ తీరాలకో...

కడలి అలల్లో
మీ అక్షరాలు

తెరుచుకున్న ప్రతి కిటికీనీ వెచ్చగా పలకరిస్తూ
సంధ్య అందమైన వర్ణాల్ని లోకమంతా నింపుతూ
అలవోకగా అరణ్యాల్ని అణువణువూ అన్వేషిస్తూ

సూర్య కిరణాల్లో
మీ అక్షరాలు

నది మీద వాన చినుకుల్లా
మీ అక్షరాలు

సెలయేటి గలగలల్లో
మీ అక్షరాలు

బంతిపూల బంగారు వర్ణాల్లో
మీ అక్షరాలు

మౌనపు తలుపు తడుతుంటే
వచ్చే సవ్వడి మీ కవిత్వమే కదూ
విస్మయపరుస్తునే ఉండండి
ఇస్మాయిల్ గారూ!

(నవంబరు 25 ఇస్మాయిల్ వర్ధంతి)

Tuesday, November 17, 2009

కళాకారుడు

ఒంటరిగా తప్ప ప్రవేశించలేని
నిన్ను నువ్వు కాల్చుకుంటే తప్ప
ఏమీ కనబడని చీకటి గుహలో

ప్రతి రాత్రీ..
ఏదో వెతుక్కుంటూ...

* * *

లోతు బావిలో నీళ్ళని
జల్లెళ్ళతో తోడాలని
ప్రయత్నించి ప్రయత్నించి

ఆ బావి గట్టునే..
దాహం తీరకుండానే...

Thursday, November 12, 2009

రాత్రి వాన

కరెంటు పోయిన
నవంబరు రాత్రి
ఒంటరిగా నేను

కొవ్వొత్తి
రాత్రి
మౌనంగా
కరుగుతుంటాయి

ఏ పిలుపు
తన గుండెని మ్రోగిస్తుందోనని
మొబైలు ఫోను చూస్తుంటుంది

గడియారపు సెకెన్ల ముల్లు
గదిలో మౌనపు లోతుల్ని
కొలుస్తుంటుంది

హృదయాకాశంలో
దిగంతాల దాకా వ్యాపించిన
దిగులు మబ్బులు

ఇందాకే వాన కురిసి
కిటికీకవతలి ప్రపంచాన్ని
కడిగేసింది

ఏ వాన కురిసి
నా లోపలి ప్రపంచాన్ని
కడగనుందో!

Tuesday, November 3, 2009

చిరుజల్లులో పూలు

1.
పూవులా వికసించింది
పూలని చూసిన
ఆమె ముఖం

2.
వర్ణించలేను
ఈ పూవులోని
వర్ణాల్ని!

3.
ఎన్ని వక్ర రేఖలో!
రెండు చుక్కల్ని
కలిపేందుకు

4.
దిగేకొద్దీ
లోతు
పెరుగుతోంది

5.
గాడిలో పడేలోపు
ఎన్ని గెంతులో
బొంగరం

6.
బెంచీ పైన అమ్మాయిలూ
బెంచీ పక్కన పూలూ
ఒకటే నవ్వులు

7.
కలిసిపోయాయి
మీద కొమ్మలూ కింద నీడలూ
ఏ నీడ ఏ చెట్టుదో!

8.
పక్క పక్క కొండలు
ఒకటి ఎండలో
మరొకటి నీడలో

9.
వరిచేను గట్టుపై
ఒంటరి సైనికుడు
కొబ్బరి చెట్టు

10.
ఏటి ఇసుక
నీరు పారినంత వరకే
దీని అందం

Saturday, August 15, 2009

నా కథలు

నా కథలు అని టైటిల్ పెడుతుంటే చిన్న సంఘటన గుర్తుకొస్తోంది. ఒక సారి కవి మిత్రులు ఇక్బాల్ చంద్, కాశీభట్ల వేణుగోపాల్ గారిని కలిసి అక్కడ నుండి నాకు ఫోన్ చేసారు. యాదృచ్ఛికంగా నేను అప్పుడు కాశీభట్ల గారి కథ ఒకటి చదువుతున్నా. ఇక్బాల్ గారు కాసేపు మాట్లాడి కాశీభట్ల గారితో మాట్లాడండి అని ఫోన్ ఇచ్చారు. అదే మొదటి సారి కాశీభట్ల గారితో మాట్లాడ్డం. నేను "నమస్తే అండీ.. ఇప్పుడు మీ కథే చదువుతున్నా" అన్నా. దానికి ఆయన "అది నా కథ కాదండీ.. నేను రాసిన కథ" అన్నారు నవ్వుతూ.

ఇక కథల్లోకి..

ఇవి 2003 నుండి ఇప్పటిదాకా నేను రాసిన కథలు (కథల్లాంటివి?!). తెలుగులో కవితాత్మకంగా కథలు రాసిన బుచ్చిబాబు, త్రిపుర నాకిష్టమైన కథకులు. వాళ్ళ రచనల ప్రభావం వీటిలో చాలా ఉంటుంది.

నిశ్చల యాత్ర
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=10008&page=1

సౌందర్యం ఆత్మ కథ
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=10452&page=1

నిరీక్షణ
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=12426&page=1

తెరతొలగిన వేళ
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=14130&page=1

గోడలు
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=16232&page=1

రిమోట్ కంట్రోల్
http://www.eemaata.com/em/issues/200407/979.html

కొండవాగులో బంతి
http://www.koumudi.net/Monthly/2007/may/may_2007_kathakoumudi_1.pdf

అమరావ్రతం
http://poddu.net/?p=1828

Tuesday, August 11, 2009

రెండు పువ్వులు

అప్పుడప్పుడు ఆమె
మౌనాన్ని వీడి
కళ్ళతోనే..
రెండు మాటలు

నా దోసిట్లో..
రెండు పువ్వులు

* * *

నవ్వుతూ తుళ్ళుతూ
ఆ నదిలో పువ్వులు
ఏ తీరాలకో...

ఒడ్డున
తృప్తిగా నేను.

* * *

మళ్ళీ..ఆ నదీ తీరాన
నిరంతర ధ్యానంలో ఆమె
ఆమె ముందు మోకరిల్లి
నిరీక్షణలో నేను

కల్పాలు గడిచిపోతుంటాయి.

Friday, August 7, 2009

కొన్ని సెన్ర్యూలు

౧.
వంట చేస్తుంటే
ఘంటశాల పాట
ఎన్ని విజిల్సొచ్చాయో?

౨.
గేదెలా దోమల్ని
చెవులతో తోలుకోగలిగితే
ఎంత బావుణ్ణు?

౩.
వేరుశనగ పలుకులు
ఒలుచుకు తినాలని
ఈ కోతికెలా తెలిసిందో!

౪.
గేదె
తెల్లబడింది
కాకి వాలగానే

౫.
లిఫ్టులో కొత్తమ్మాయి
వంద అంతస్తులుంటే
ఎంత బావుణ్ణు!

(సెన్ర్యూ : హాస్య రస ప్రధానమైన హైకూ )

Saturday, August 1, 2009

చిరుజల్లులో పూలు

౧.
తెరచిన కిటికీనుండి
తెరచిన పుస్తకం మీదకి
ఏటవాలుగా ఎండ

౨.
కొండవాగు
అరి కాళ్ళు కూడా
మునగడం లేదు

౩.
ఉరుము ఉరిమితే
తలెత్తి చూసాను
తొలి చినుకు నా కంట్లోనే

౪.
వీధి దీపం
పచ్చని కాంతి
చొక్కా రంగు మారింది

౫.
పైకొస్తుంటే
పదింతలైంది బరువు
నూతిలో ఈత

౬.
వెండి మబ్బులు
వెలిగి పోతున్నాయి
వెనక సూర్యుడు


నా ముఖం
కనిపించడం లేదు
సరస్సునిండా అలలు

౮.
సాయంత్రపు నడక
పసిచేతుల్లో ముసలి చేతులు
వేటికి ఏవి ఆసరా?

౯.
గట్టు మీద రావి చెట్టు
కోనేట్లో ప్రతిబింబం
ఒకటే గలగలలు

౧౦.
ఏటి నీరు
తేట ఇసుక
సూర్యకాంతి తొణుకుతోంది

Monday, June 29, 2009

నీలో నేను

ప్రపంచపు రంగులన్నీ చీకట్లో కరిగిపోతుంటే
మన దేహాలు కొత్త రంగులు సంతరించుకుంటాయి

అర్ధరాత్రి ఆకాశం
అందమైన సెలయేటిలో
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ
తనని తాను వెతుక్కున్నట్టు

నీలో..
నన్ను నేను వెతుక్కునే
ప్రయత్నంలో..

నేనే
మరో పసిపాపనై
నీ గర్భాన నిద్రించడం
ఎంత బావుంది!

సృష్టి
మనిద్దరి ఆసరాతో
మరొకడుగు ముందుకేస్తోంది!

Tuesday, June 9, 2009

ఆలాపన

చీపుర్ల సామాజిక స్పృహ
అంటగిన్నెల అస్తిత్వ వేదన
పొద్దుటి రణగొణ ధ్వనుల్ని
చీల్చుకుంటూ...

ఏ రేడియోలోంచో
ఓ ఆలాపన
లీలగా వినిపించి
ఆగిపోతుంది

ఇక నీ మనసు మనసులా ఉండదు
ఏ పని మీదా దృష్టి నిలవదు
ఏదో గుర్తొచ్చినట్టే ఉంటుంది
చిరపరిచిత రాగంలాగే ఉంటుంది
పల్లవి మాత్రం అందీ అందక
రోజంతా వెంటాడుతునే ఉంటుంది

ఆదమరిచి నిద్రించే ఏ అర్ధరాత్రో
అకస్మాత్తుగా ఆ పల్లవి గుర్తొచ్చి
అమితానందంతో పొంగిపోతావు!

Tuesday, June 2, 2009

కవిత్వం -- కొన్ని వ్యాసాలు

2004-06 మధ్య కాలంలో నేను తెలుగుపీపుల్.కాం లో రచనలు చేస్తుండేవాడిని. రఘోత్తమ రావు గారు, సాయి కిరణ్ గారు, తులసి గారు, నిషిగంధ గారు, ప్రసూన మొదలైన కవి మిత్రులతో పరిచయం కూడా అక్కడే . మంచి కవిత్వ వాతావరణం ఉండేది . అప్పట్లో రాసిన వ్యాసాలు కొన్నిటికి ఇక్కడ లంకెలు ఇస్తున్నాను.

౧. గుడిగంట మీద సీతాకోక చిలుక
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=47645&page=1

౨. మనసులో కురిసే వేసవి వాన
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=11346&page1

౩. ప్రేమలేని లోకంలో నిర్గమ్య సంచారి ఇక్బాల్ చంద్
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=24463&page=1

౪. వానకు తడిసిన పువ్వొకటి
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=29605&page=1

౫. మరో మజిలీకి ముందు
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=14905&page=1

౬. వాన కురిసిన పగలు
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=44692&page=1

౭. కవితా! ఓ కవితా!
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=44966&page=1

౮. కవిత్వం - వచనం
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=45736&page=1

౯. కవిత్వంలో వాచాలత
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=45847&page=1

౧౦. మౌననికి ముందుమాట
http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=45534&page=1

Saturday, May 23, 2009

చిరుజల్లులో పూలు


1.

కొలనులో చంద్రుడు

తుళ్ళి పడ్డాడు

తూనీగ రెక్క తగిలి

2.

తట్టలో చూసే కాయలు

చెట్టుకే చూడ్డం

ఎంత బావుంది!

౩.

జలపాతానికి

రంగుల ముఖద్వారం

ఇంద్రధనస్సు!

4.

ఒకే తోటలో చెట్లు

కొన్ని పొట్టి

కొన్ని పొడుగు

5.

పావురాళ్ళకి మేత

వాటి కడుపు నిండుతుంటే

నా గుండె నిండుతోంది

6.
దట్టమైన అడవి

ఒకటో రెండో

సూర్య కిరణాలు

7.

ఖాళీ బాల్చీ

నిండుతున్న సవ్వడి

ఏదో చెప్తోంది

8.

పిల్ల కాలువని

మీటుతున్నాయి

మర్రి ఊడలు

9

ఈ సెలయేరు

క్షణం క్రితం

జలపాతం

10.

తామరాకుల కింద

దాక్కుంది

కొలను.

Saturday, May 2, 2009

ఎక్కడికో...

ఇవాళైనా ఏమైనా చెప్తావని

ప్రతి సాయంత్రం నీ తీరానికి వచ్చి

నిల్చుంటాను


మలుపులు తిరుగుతూ

ఏ మార్మికతల్లోకో

మౌనంగా వెళ్ళిపోతావు


కదిలే ప్రవాహంలో

కదలని నీడని చూసుకుంటున్న చెట్టులా

"నేను" మిగిలిపోతాను!

Monday, April 13, 2009

ప్రేమ

చినుకు చినుక్కీ
పులకించిపోయే
సెలయేటివి నువ్వు

నిలువునా కురిసి
తేలికపడే
నీలిమబ్బుని నేను

గమనించావా..
ఇద్దరిలోనూ
ఒకే తడి!

Sunday, February 8, 2009

వెదురుపొద

వేణువుగా మలచొద్దు
కచేరీలసలే వద్దు
చప్పట్లు నా మౌనాన్ని
భగ్నం చేస్తాయి

అడుగుజాడల్లేని
అడవిలో..
ఇలా..
ఈ నది ఒడ్డున
వెదురుగానే ఉండిపోనీ

ఎప్పుడో వీచే
ఏ కొండగాలి స్పర్శకో
పరవశించి పాడుతూ..