Friday, January 3, 2020

ఆత్మనొక దివ్వెగా...

నా నవల "ఆత్మనొక దివ్వెగా"  పుస్తక రూపంలో వచ్చిన సందర్భంగా..

గత నాలుగైదేళ్ళుగా నాకూ సాహిత్యానికీ పెద్దగా సంబంధం లేదు. ఎవరైనా పాత మిత్రులు తారసపడి ఈ మధ్య ఏవైనా రాస్తున్నారా అంటే, పరిశోధనా పత్రాలు అని చెబుతుంటా నవ్వుతూ. B.Tech పిల్లలు, క్రెడిట్లు, గ్రేడ్లు, లేబులు, ప్రోజెక్టులు.. ఇప్పుడు నా ప్రపంచం వేరు. పాత రాతలు ఇప్పుడు చదువుకుంటే గమ్మత్తుగా ఎవరో రాసినట్టుగా అనిపిస్తుంది.

The wind gives me
Enough fallen leaves
To make a fire.

జపనీ జెన్ మాస్ఠర్ "ర్యోకన్" హైకూ ఇది. ఇప్పటి నా మనస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఇలాంటి దశలో అకస్మాత్తుగా ఒక రోజు పప్పు నాగరాజు గారి నుండి మెయిల్ వచ్చింది. నవతరంగం వెంకట్ సిద్దారెడ్డి తెలుసు కదా అతనితో మాట్లాడేను ఈ మధ్య. ఆన్వీక్షికి అని పబ్లిషింగ్ హౌస్ పెట్టారు. మంచి నవలలకోసం చూస్తున్నారు. మీ నవల బయటకి తీసుకురండి అని. అదొక ఆజ్ఞ. కథకీ, కవితకీ ఒక సొంత అస్తిత్వం ఉంటుంది. అవెప్పుడు బయటకి రావాలో అవే నిర్ణయించుకుంటాయి. మనం అడ్డు పెట్టకూడదంతే.

ఈ నవల 2009 లో చిన్న కథగా రాసాను. తర్వాత నేను తీసుకున్న వస్తువుకి కథ న్యాయం చెయ్యట్లేదనిపించింది. అందుకే పరిధిని పెంచి నవలగా మార్చాను. డిశెంబరు 2010 కి మొదటి వెర్షన్ పూర్తయ్యింది. ఒక ఆరు నెలలు ఎవరికీ చూపించకుండా ఉంచి, జూన్ 2011 లో పప్పు నాగరాజు గారికి పంపించాను. ఆయన చదివి చాలా మార్పులే చెప్పారు. అవన్నీ పూర్తి చేసేసరికి మరో పది నెలలు పట్టింది. అలా మూడేళ్ళు, అయిదు వెర్షన్ల తర్వాత, నవల ఒక రూపానికొచ్చిందని నిర్ణయించుకున్నాకా నవ్యలో సీరియల్ పోటీ పడితే దానికి పంపించాము. 2013 ఆగస్టులో ఫలితాలు వచ్చాయి. ఈ నవలకి 3rd prize వచ్చింది. చివరగా 2015 మే – జూలై ల మధ్య నవ్యలో సీరియల్ గా వచ్చింది. ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చింది. 

ఈ నవల్లోని కథ , పాత్రలు, సన్నివేశాలు మొత్తం కల్పనేగానీ, ముగింపులోని అనుభవం మాత్రం నిజం. అన్వేషణ ఆథ్యాత్మిక అనుభవంతో ముగియడం వల్ల నవల సార్వజనీనత దెబ్బతింటుదనిపించినా, (చాలా మంది ఇదే విషయాన్ని చెప్పారు) ఆ అనుభవమే నవలకి పునాది కాబట్టి దాన్ని మార్చడం నా వల్ల కాలేదు. అందుకే టైటిల్ కూడా "ఆత్మనొక దివ్వెగా" అని పెట్టాను. త్రిపుర గారిని చూసాక, ఆయన గురించి కనకప్రసాద్ గారు చెప్పిన కింది వాక్యాలు చదివాకా నా నమ్మకం మరింత బలపడింది.

"త్రిపుర సంత్‌ల కోవలో కవి. కబీర్, వేమన వీళ్ళిద్దరు ఎలాగో అలాంటి నిర్గుణి. ఆయన దర్శించిన మౌనం అంటే మాట్లాడ్డం మానీడం కాదు. అది అహం చచ్చిపోతే నిసర్గమయి ప్రకాశించే మౌనం. త్రిపుర కవిత్వం ఋభుగీత లాంటిది. మాటలకి, గడుసుతనానికీ విరుగుణ్ణి సూచించి సేద తీరుస్తుంది"

నవల్లో వాడుకున్న జానపద గీతాల సేకరణలో ఆంధ్రభారతి సాయి గారి సాయం మరవలేనిది. అలాగే నవల చదివి మార్పులు చేర్పులు సూచించిన నండూరి శ్రీనివాస్, భైరవభట్ల కామేశ్వర రావు గారు, స్వాతి, విన్నకోట రవి శంకర్ గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ నవల బయటకి రావడంలో ముఖ్యపాత్ర పోషించిన పప్పు నాగరాజు గారికీ, ప్రచురించిన ఆన్వీక్షికి పబ్లిషర్స్ టీం కీ మరొక సారి కృతజ్ఞతలతో...

నవల ఇప్పుడు amazon లో దొరుకుతోంది. విజయవాడ పుస్తక ప్రదర్శనలో అన్వీక్షికి స్టాల్లో కూడా దొరుకుతుంది. వీలైతే చదివి మీ అభిప్రాయం చెప్పండి.