Tuesday, November 16, 2010

రెండు నువ్వు నేనులు

అఖండ ప్రవాహానివి నువ్వు

మంచు ముక్కనై
నీలోకి
నేను


* * *

అనంతమైన అగాధానివి నువ్వు

జలపాతాన్నై
నిన్ను అన్వేషిస్తూ
నేను !

Tuesday, November 2, 2010

చంద్రుడు

ఎన్ని మహానదుల్లో
మునుగుతున్నా
చంద్రుడిలోని
మచ్చలు పోవు

ఎన్ని మబ్బులు
కమ్ముకుంటున్నా
ఆ నవ్వులోని
స్వచ్ఛతా పోదు!

Sunday, September 12, 2010

అలలు

చల్లని అల వచ్చి
చిట్టిపాదాల్ని స్పృశించగానే
పసిమనసులో
అలలెత్తిన ఆనందం

ఈ క్షణం నేను
తీరాన ఇసకను!

Wednesday, June 23, 2010

మరో పువ్వు


ఈ సెలయేటిలో దాహం తీర్చుకుంటాను
ఈ చెట్టు నీడలో విశ్రమిస్తాను
వచ్చిపోయే మేఘాల్ని లెక్కించడంలో
మధ్యాహ్నమంతా గడిచిపోతుంది

సాయంకాలం
గూళ్ళని చేరే పక్షులతోపాటు
నా మనసుకూడా
పాటనుండి క్రమంగా
మౌనంలోకి ప్రయాణిస్తుంది

అర్ధరాత్రి నిశ్శబ్దంలో
ఆత్మనొక పుష్పంగా
వికసింపజేసే రహస్యం
ప్రతిమొక్కా నాకు
చెప్తునే ఉంటుంది

వేకువ కాంతిలో
వెలిగిపోతూ
నీ పాదాల చెంత..
మరో పువ్వు!

Thursday, April 22, 2010

చిట్టి కవితలు

1.

ఇప్పటిదాకా నేర్చుకున్న
భాషలన్నీ మర్చిపోయి
నీతో మాట్లాడేందుకు
ఒక కొత్త భాషని
సృష్టించుకుంటాను

నీ కేరింతల్లో
నా కేరింతలు కూడా
కలిసిపోతాయి

2.

పాకడమైనా రాని నువ్వు
ఎక్కడెక్కడి లోకాలకో
తీసుకుపోతుంటే

ఆనందంగా
నీ వెనక నేను!

3.

నీ సమక్షంలో
చైతన్యమొచ్చిన బొమ్మల మధ్య
కదలక మెదలక నిల్చున్న బొమ్మ

అది నేనే!

4.

నీ చుట్టూ
నిరంతరం ఎగిరే
జంట సీతాకోకలు

అమ్మా, నేను!


5.

మనసులో ఏ మూలో
మంచులా ఉన్న నా పసితనం
నీ వెచ్చని బోసినవ్వులతో
మళ్ళీ కరిగి ప్రవహిస్తుంది

ఆ ప్రవాహంలో
ఒక కాగితప్పడవనై
అలా..అలా
తేలిపోతుంటాను

మళ్ళీ
నీ చిట్టి చేతులే
ఒడ్డుకి చేర్చాలి!

6.

ఆడి ఆడి అలసిపోయిన నిన్ను
నిద్రకు ముందు ఆవరించే నిశ్శబ్దంలో
నా గుండె చప్పుడు నాకు
తృప్తిగా వినిపిస్తుంది!

Tuesday, February 23, 2010

అద్దం

మా చంటాడి
కంటి పాపలో
నా ప్రతిబింబం

నన్ను నేను
తొలిసారి చూసుకుంటున్న
అనుభూతి!