Tuesday, December 30, 2008

చిరుజల్లులో పూలు

1.
ఎన్ని జీవులో
ఎన్ని భాషలో
ఈ చిన్ని తోటలో

2.
గెంతే దాకా
ఎక్కడుందో?
గడ్డిలో మిడత

3.
బండ రాళ్ళకి
నీడ నిస్తోంది
ముళ్ళ చెట్టు

4.
చెమట్లు పట్టించి
చిరుగాలితో స్వాగతం
పర్వత శిఖరం

5.
అటు, మళ్ళీ ఇటు
ఇటు, వెంటనే ఎటో
తూనీగ

6.
కొండలో
కొంత భాగాన్నే చూస్తున్నాడు
సూర్యుడు

7.
రంగు రంగుల పూలు
రంగులు వెలసిన ఆకులు
ఒకే చెట్టుకి!

8.
వచ్చేముందు
గాలిని కుడా చల్లబరిచింది
వర్షం

9.
కొండ మీద పడుకుని
ఆకాశాన్ని చూస్తుంటే
చీకటి పడిపోయింది

10.
కొండెక్కుతుంటే
మూతి ముడుచుకున్న పువ్వు
దిగుతుంటే నవ్వుతూ పలకరించింది

Friday, December 26, 2008

ఆహా

రైలులో ఒక రాత్రి హైదరాబాదు నుండి బెంగుళూరు వస్తున్నాను. ఎప్పటిలాగే ఆఖరి నిమిషం దాకా రిజర్వేషన్ చేయించుకోకపోవడం వల్ల RAC దాకా వచ్చి ఆగిపోయింది. నా సహ ప్రయాణీకుడు ఒక ప్రతిపాదన చేసాడు. ఇద్దరం రాత్రంతా నిద్ర లేకుండా కూచుని ప్రయాణించే బదులు సగం సేపు మీరు, మిగతా సగం సేపు నేను పడుకుందాం. ముందు మీరు పడుకోండి. నేను బోగీ తలుపు దగ్గర టిసి సీట్లోకూచుంటా. సరిగ్గా ఒంటిగంటన్నరకి వచ్చి లేపుతా అప్పుడు నేను పడుకుంటా, మీరు కూచోండి అన్నాడు.ఇదేదే బానే ఉంది అనుకుని సరే అన్నాను. అతను డోర్ దగ్గరకి వెళ్ళిపోయాడు.నేను నిద్రకి ఉపక్రమించాను. బాగా అలసటగా ఉండడంతో వెంటనే నిద్ర పట్టేసింది.

అనుకున్న ప్రకారం సరిగ్గా ఒంటిగంటన్నరకి చోట్లు మారాం. నేను వెళ్ళి డోర్ దగ్గర కూచున్నాను.నిద్ర సగంలో లేవడంతో చిరాగ్గా ఉంది. బహుశా ఇందుకే అతను నన్ను ముందు పడుకోమన్నాడా అని కూడా మనసులో ఏ మూలో నల్లగా మెదిలింది. అయినా ఇదీ మంచిదేలే అనుకున్నా. నిద్రపోయే వాళ్ళని లేపడం నాకు ఇష్టం ఉండదు.

బయటకి చూస్తూ కూచున్నాను. మంచులో తడుస్తున్న రైలు పట్టాలపై ఎవరితోనూ నిమిత్తం లేనట్టుగా సాగిపోతోంది రైలు. వెన్నెల్లో మెరుస్తున్న కంకర మీద రైలు నీడ ఏదో రాస్తోంది. డోర్ దగ్గర కూడా దుప్పట్లు పరుచుకుని నిద్రపోతున్నారు కొందరు. ఆ క్షణం ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ నేనొక్కడినే ఏదో లోకానికి ప్రయాణిస్తున్నట్టుగా అనిపించింది. (బహుశా అదే కవిత్వమేమో!)

అలా ఆలోచిస్తూ కూచుని రైలు శబ్దాన్ని వింటున్న నాకు, అకస్మాత్తుగా కింది వాక్యాలు స్ఫురించాయి.

"రైలు ప్రయాణించినంత సేపూ శబ్దమే
నీలోనే వెతుక్కోవాలి నిశ్శబ్దాన్ని"

బయట అనంతంగా విస్తరించిన చీకటిని చూస్తూ "రైలు కిటికీలోంచి అనంతంలోకి విసిరేసుకుంటూ.. ప్రయాణంలో మరొక ప్రయాణం.. ఈ చిన్ని ప్రయాణంలో ఎన్ని ప్రయాణాలో!" అన్న వాక్యాలతో ఆ ఖండిక
ముగిసింది.

ఇక ఆ రాత్రంతా భావాలన్నీ వడగళ్ల వానలా కురిసి ఉక్కిరి బిక్కిరి చేసాయి. "తొలి సంధ్యలో పూసే
పూలకి.." "కొండలకి జ్ఞాదోయాన్ని కలిగిస్తూ.." ఇలా ఎన్నెన్నో పదచిత్రాలు కళ్ళల్లో పురివిప్పి
నర్తించాయి. కవిత్వం మరొక సారి నన్ను కరుణించింది. సమయానికి పెన్ను,పుస్తకం లేక, మనసులోనే ఆ కవితా
శకలాల్ని ముద్రించుకున్నాను. ఆ మరుసటిరోజు ఉదయం నా సహప్రయాణీకుడికి వీడ్కోలుతో పాటు
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తుంటే , అంతలా ఎందుకు thanks చెప్తున్నానో అతనికి అర్ధం కాక చూస్తుంటే, స్టేషన్ బయటకి చక చకా నడిచాను నులివెచ్చని కవన కిరణాలు మనసంతా నింపుకుని...


(రాకేశ్వర రావు గారు నా కవిత ఒక దానికి కామెంటు రాస్తూ, కవితకి ఏ సంఘటన
స్ఫూర్తినిచ్చిందో ఆ ఫొటో కూడా వీలైతే పోస్ట్ చెయ్యమని అడిగారు. అందుకే ఈ "ఆహా" కవిత నేపథ్యాన్ని వివరించాలనిపించింది.)


ఇక కవితలోకి...

ఆహా..!!
------

తొలిసంధ్యలో పూసే పూలకి
పురిటిస్నానం చేయించే మంచు
మలిసంధ్యలో రాలే పూలకి
ఆఖరి స్నానం చేయించేదీ మంచే

రెండు సంధ్యల మధ్య
అనాదిగా అదే కావ్యం
ఎన్నిసార్లు చదివినా
తనివి మాత్రం తీరదు

* * *

గుడ్డుని పగలగొట్టుకుని
లోకాన్ని తొలిసారి చూసే
పాముపిల్ల కళ్ళల్లో ఆశ్చర్యం

ఎన్ని యుగాల స్మృతుల్ని నింపుకున్నా
నా కళ్ళలోనూ అదే ఆశ్చర్యం!

* * *
నాతో పాటు కళ్ళు తెరిచి
నాతో పాటు కళ్ళు మూసే లోకం
నా కనురెప్పల వెనకే
అనంత విశ్వం!

నిద్రపోయే పసిపాప
కనురెప్పల వెనక
ఎన్ని అద్భుత లోకాలున్నాయో!

ఎప్పుడూ విస్మయంతో
పాపని నేనూ..
నన్ను పాపా..

* * *

సాయంత్రపు చలిమంట
ఎండుపుల్లలు చిటపటమంటుంటే
ఎర్రగా అటు ఇటు ఊగే
అగ్ని కీలలు

దట్టమైన అడవి
రాలిన ఆకుల మధ్యనుండి
జర జరా పాకేనాగుపాము

భయానకంలో సౌందర్యం
కళాకారుడి కళ్ళకో నమస్కారం!

* * *
కొండలకి జ్ఞానోదయాన్ని కలిగిస్తూ
ఏడు గుర్రాల వాడు
మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా
వాడు మాత్రం ఆగడు

చీకటిని కప్పుకుని నిద్రపోయే చెట్లమీద
మంచు చిలకరించి మరీ లేపుతాడు
బరువుగా మూసిన కనురెప్పల్ని
కిరణాలతో గుచ్చి మరీ తెరుస్తాడు

గుండెని..
నిండుగా తెరిచే
ఒకే ఒక్క కిరణం కోసం
జన్మ జన్మల నిరీక్షణ

* * *
భూమిని చీల్చుకు వచ్చి
లోకాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తూ
పచ్చగడ్డి

నన్ను నేను చీల్చుకుని
అంతర్లోకాన్ని విస్మయంతో తిలకిస్తూ
నేను

నేను.. పచ్చగడ్డి..
పచ్చగడ్డి.. నేను..
ఈ మహాప్రకృతిముందు
నేనొక గడ్డిపోచను

* * *
ఉప్పు కరిగాకే
కూరంతా వ్యాపిస్తుంది

“నేను” కరిగిపోతే
విశ్వమంతా వ్యాపించనూ?
* * *

ఒకటి… రెండు… మూడు…
గడియారం క్షణాల్ని..

ఒకటి… రెండు… మూడు…
నేల చినుకుల్ని..

ఒకటి… రెండు… మూడు…
తీరం కెరటాల్ని..

ఒకటి… రెండు… మూడు…
నేను నాలోని “నేను”ల్ని

* * *

“నేను” పెరిగేకొద్దీ
కన్నీరు కూడా..

ఆ నదిని దాటాలని
నిర్మించని వంతెన లేదు
మధ్యలోకి వెళ్ళగానే
కూలిపోని వంతెనా లేదు

దేన్ని దాటాలనుకుంటామో
దాంట్లోనే మునిగిపోతాం!
* * *
రైలు ప్రయాణించినంతసేపూ శబ్దమే
నీలోనే వెతుక్కోవాలి నిశ్శబ్దాన్ని..

రైలుకిటికీలోంచి
అనంతంలోకి విసిరేసుకుంటూ..
ప్రయాణంలో..
మరొక ప్రయాణం

ఈ చిన్ని ప్రయాణంలో
ఎన్ని ప్రయాణాలో?
* * *
“అయ్యో నిన్న చెయ్యలేదే..
పోనీ రేపు చేద్దాం”
“నిన్న” “రేపు”ల మధ్య
మోసపోతూ “నేడు”

కాలం జాలంలో పడి
గిలగిలలాడని వాడెవడు?

ఆలోచించి ఆలోచించి కాలం
అంతరంగానికి అద్దమేనని గ్రహించి
ఆ కాళ్ళకి నమస్కరిద్దా మనుకునేసరికి
నాకు అందనంత దూరంలో..

* * *

కోటి ఆలోచనలతో
ఏటి ఒడ్డున

ఎక్కడనుంచో వచ్చి
ఎక్కడికో వెళ్తోందా?
రావడం వెళ్ళడం
అంతా అబద్ధమేనా?

దేహంతోనే సందేహం
రెండూ సహజాతాలేనా?

అన్ని ప్రశ్నలు
ఒకటే జవాబు
మృత్యువు

ఆమె తలుపులు మూయదనీ
భళ్ళున తెరుస్తుందనీ
ఎంతమందికి తెలుసు?

అన్నీ వదులుకుంటే
ప్రతీదీ నీదవుతుంది
మృత్యువును ప్రేమించు
జీవించడం నేర్పుతుంది

* * *

విరహంతో పిలిచే చెట్లకీ
విహాయసాన విహరించే మేఘాలకీ
ఏనాటిదో చినుకుల బంధం

వర్షం కురిసిన ప్రతిసారీ
ఆమె గుర్తుకు రావడంలో
ఆశ్చర్యం ఏముంది?

కవిత్వానికి ఋణపడ్డాను
ప్రేమించడం నేర్పినందుకు.

* * *

కొలనులోనే ఉంది
కానీ కొలనులో లేదు
తామరాకు

ఆశించడంలోనే
నాశనం ఉందా?

కవితాత్మకంగానే అయినా
భగవద్గీతని
మళ్ళీ రాయడానికి
మనసొప్పడం లేదు

కృష్ణ పరమాత్మా ఈ
తృష్ణ తీర్చగ రావా?
మీరా రాయని కీర్తన.

“గోడో” ఎప్పటికీ రాడు నీ
గోడు ఎప్పటకీ వినడు

నచికేతా
కఠోపనిషత్
కఠినంగా ఉందా!

తరచి తరచి చూశాకా..
దేనికీ అర్ధంలేదని తెలిశాకా..
నిఘంటువును చూస్తే

నవ్వొస్తోంది

* * *

ఆ సాయంత్రం
అదే ఏటి ఒడ్డున..

సెలయేరు మీద
చీకటి వెలుగులు రాస్తున్న
చిత్ర లిపిని చదువుతూ

దేనికీ అర్ధం లేదంటే..

చిరు నవ్వు నవ్వుతూ
ఆమె అన్నది కదా…
“నీకు అర్ధం కానంత మాత్రాన

అర్ధం లేనట్టేనా?”

* * *
గలగలమంటూ సెలయేరు
ఏవో రహస్యాలని
గానం చేస్తుంటుంది

పసిపాప తప్పటడుగుల్లో
ప్రపంచాన్ని బంధించే
లయ వినిపిస్తుంది

పూలు రాలిపోతూ
ఇంతే.. ఇంతే..
అని నవ్వుతుంటాయి

విశాలమైన మైదానాల్లో
విశృంఖలంగా సంధ్య
నర్తిస్తునే ఉంటుంది

కడలితో సంగమించే
నదిలో ఆనందం
సుళ్ళు తిరుగుతుంది

పిల్లనగ్రోవి రంధ్రాలు
ఏవో పురాతన సొరంగాల్లోకి
తీసుకుపోతునే ఉంటాయి

అనంతంగా ఆకాశం
అధివాస్తవిక చిత్రాల్ని
గీస్తునే ఉంటుంది

ప్రకృతి తమలో నింపిన సంగీతాన్ని
తిరిగి ప్రకృతిలోనే ఐక్యం చేస్తూ
పక్షులు పాడుతుంటాయి

పువ్వులు..పక్షులు..సెలయేళ్ళు.. ఆకాశం..
ఆమె దగ్గర్లోనే ఉందని నాకు చెప్తునే ఉంటాయి.

* * *
మలిసంధ్యలో రాలే పూలే
తొలిసంధ్యలో పూసే పూలు
సూర్యుడు ఇక్కడ అస్తమించేది
ఇంకెక్కడో ఉదయించడానికే

రెండు సంధ్యల నడుమ
అనంతంగా ఇదే కావ్యం
ఎక్కడెక్కడో వెతక్కు
సమాధానం ఇక్కడే ఉంది!

* * *

మొగ్గలో
అనంత విశ్వం ముడుచుకుంటుంది
పువ్వులో
విశ్వ నేత్రం తెరుచుకుంటుంది

యుగాలుగా దిగబడ్డ
ప్రశ్నార్థకాలన్నీపెకిలించాకా

చీకటి సముద్రపు లోతుల్లో
పాతిపెట్టబడిన సూర్యుడు
మెల్ల మెల్లగా..
పైకొస్తుంటే..

నా నోటి నుండి వెలువడే
చరమ వాక్యం….

ఆహా!!!

Sunday, December 21, 2008

నూతి మీద మూడు కవితలు

1.
మధ్యాహ్నపు మండుటెండలో
పల్లెటూరి నేల నూతిలో
నిశ్చలంగా నీరు
నిలకడగా ఆకాశం

నీటి తపస్సుని
చేద భగ్నం చేయగానే
ఎంత అలజడి!

కోపంతో నుయ్యి
ఏ ప్రతిబింబాన్నీ
చూపించడం మానేసింది

2.
నూతిని వీడలేని
నీటి చుక్కలు కొన్ని
చేదలోంచి చల్లగా
జారుకుంటున్నాయి!

3.
పల్లెటూరి నేల నూతిలో
పాకుడుపట్టిన రాళ్ళ మధ్య
మొలకెత్తిన పిచ్చి మొక్కని

ఆమె చేదలోంచి జారిన
నీటి చుక్కలు కొన్ని
నా మీద పడగానే..

ఆనందంతో
అటు ఇటు ఊగుతాను!

Thursday, December 11, 2008

ఆమెకు

నిన్న రాత్రి వసంతం
చిన్నగా కబురంపింది
తనకి రావడం కుదరదని
తన స్నేహితురాల్ని
పంపుతున్నానని

ఎవరో అనుకున్నా
తలుపు తెరిచి చూస్తే
ఎదురుగా నువ్వు!

***

నువ్వు నదివైతే
ఇప్పుడే నా పడవకి
చిల్లు పెట్టేసుకోనూ!

***

కొళాయి పకపకమని
గంట సేపు నవ్వితేనే
బిందె నిండుతుంది

నీ చిన్ని చిరునవ్వుతోనే
నా గుండె నిండిపోతుంది

Tuesday, November 11, 2008

సృష్టి

ఒకే మబ్బులో పుట్టి
ఒకే మట్టిలో కలిసిపోయే చినుకులు
మధ్యలో కోటానుకోట్ల అస్తిత్వాలుగా
విడిపోవడమెందుకో!

Monday, October 27, 2008

చిచ్చుబుడ్డీ

నింగివైపే చూస్తూ

నిటారుగా నిలబడతాను


చిన్న స్ఫూర్తి చాలు

చీకట్లని చీల్చుకుంటూ

అవిశ్రాంతంగా

ఆనందపు రవ్వలు

ఆకాశాన్ని చుంబించాలని

ఆరాటపడతాయి

నా జీవితం

ముగిసిపోయిందనుకుంటున్నారేమో..


చప్పట్లు కొడుతూ

గెంతులు వేస్తున్న

చిన్నారి కళ్ళలోకి

ఒక్కసారి చూడండి!

Wednesday, October 15, 2008

రెండు కవితలు

1. యోగులు

ప్రవాహంతో తమకి నిమిత్తం లేదని
భూమిలోకి ఇంకిపోయే నీటి బొట్లు సైతం
మూలాల్ని వెతుక్కునే పనిలో
వృక్షాలకి సాయపడుతున్నాయి!

2. కళాకారులు

ఆకాశంలో ఎగిరే
అందమైన కొంగలు
బురదలో వాలాయి
ఆహారం కోసం !

Tuesday, September 30, 2008

నది

గులకరాయి చెక్కిలిపై
కన్నీరై జారుతూ...

జలపాతపు గీతంలో
రాగంగా మారుతూ..

ఆకాశపు నీడలతో
అనునిత్యం ఆడుతూ..

పసిడి ఇసక తిన్నెలపై
ముసిముసిగా పారుతూ..

పల్లెపడుచు కడవల్లో
సంజె కాంతి నింపుతూ...

పయనించే దారంతా
పచ్చదనం జల్లుతూ..

ఆనందపు నురగలతో
కడలి ఒడిని చేరుతూ..

Friday, August 29, 2008

కవిత్వం మీద రెండు కవితలు

1.
మేఘాల భారాన్ని
చినుకుల్లోకి అనువదించేసే
ఆకాశానికి తెలుసు
అసలు రహస్యం

2.
లోపలి సంగీతానికి
అనుగుణంగా నర్తించే
అక్షర నక్షత్రాల
మ్యూజికల్ ఫౌంటైన్ !

Tuesday, August 19, 2008

పంకా

నిన్ను తిప్పుతున్న శక్తి నీది కాదు
ఆ గాలిని కూడా నువ్వు సృష్టించట్లేదు
ఆ మాత్రం దానికి
అంతలా బడబడలాడాలా?

Friday, August 8, 2008

ఆమె కళ్ళల్లో..

ఎందరి దుఃఖాన్ని
మేఘంగా ధరించిందో
ఆమె కళ్ళల్లో..
శతాబ్దాల వాన

ఆకాశంలో
మెరుపు మెరిసాక
వాన కురిస్తే

ఆ కళ్ళల్లో
వాన వెలిసాక
మెరుపు మెరుస్తుంది

ఏ గుండెలోని చీకటిని
నిలువుగా చీల్చడానికో!

Wednesday, July 30, 2008

మహాప్రస్థానం

రైలు పట్టాల పక్కన
కంకర రాళ్ళ మధ్యలో
ఏ లోతుల్లోంచి
ఎంత ప్రయాసపడి
మొలుచుకొచ్చిందో పచ్చగడ్డి
చిరుగాలికి సేదదీరుతోంది

Friday, July 11, 2008

వెంటాడే పిలుపు

ప్రతి రాత్రీ
సముద్రం నన్ను
"రా.. రా.. "
అని పిలుస్తుంది.

పారే నది నాకు
దారి చూపుతుంది.

చంద్రుడు దారంతా
వెలుతురు పరుస్తాడు

చిన్ని పడవలో
ఒంటరిగా నేను.

Monday, June 30, 2008

మౌనమె నీ భాష..

మలిసంధ్య వేళ మనిద్దరం
ఎదురుగా సముద్రం
నీ చేయి నా చేతిలో..

గచ్చు మీద పడిన గోళీల్లా
మాటలన్నీ చెల్లా చెదురయ్యేదిప్పుడే!

* * *

నీ చేతిని నా చేతిలోకి తీసుకోగానే
నీలోంచి బయలుదేరి ఒక నది
నాలోకి ప్రవహించడం నాకు తెలుస్తోంది.

మాటలు మోయలేని ఎన్నో భావాల్ని
తనతో మోసుకొస్తోంది.

Monday, June 16, 2008

తూనీగ ముద్దు

ఎగురుతూ ఎగురుతూ
చటుక్కున కొలను బుగ్గని
ముద్దు పెట్టుకుంది తూనీగ

తెరలు తెరలుగా....
సిగ్గు.

Friday, June 13, 2008

నదీ తీరాన..

ఆమెతో..
నదీ తీరాన

అటు నది
ఇటు ఆమె

రెండు ప్రవాహాల మధ్య
మెరిసే ఇసకలా నేను!

Wednesday, April 16, 2008

గుడిగంటల మౌనం

గుడిగంటలు
మౌనంలోకి జారుకుంటాయి
చంద్ర కిరణాలు
కోనేటిని చేరుకుంటాయి

చిరుగాలి సైతం అలసిపోతుంది
ఆకుల శబ్దం ఆగిపోతుంది
వెన్నెలని నిండా కప్పుకుని
గన్నేరు చెట్టు నిద్రపోతుంది

గాయాలన్నీ మానిపోతాయి
సమస్యలన్నీ సమసిపోతాయి
నక్షత్రాల్లా మెరిసిపోతూ
అక్షరాలొక్కటే మిగిలిపోతాయి

Thursday, March 27, 2008

మంచులోయలో..

పైన్ చెట్ల మధ్యనుంచి
ప్రవేశించింది సంధ్య

సాయంకాలపు నిశ్శబ్దం
లోయంతా ఆవరించింది

లీలగా వినపడుతున్న
సెలయేటి సవ్వడి
చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని
రెట్టింపు చేస్తోంది!

Wednesday, March 12, 2008

ఆనంద యోగులు

వచ్చే ప్రతి రైలుకీ
నవ్వుతూనే స్వాగతం

వెళ్ళే ప్రతి రైలుకీ
నవ్వుతూనే వీడ్కోలు

ఎండలోనూ..వానలోనూ..
బరువే ఎరగని అదే నవ్వు

పరిమళం లేదని
ఏడుస్తూ కూచోవు

ప్లాట్ ఫాం మొదట్లో..
కాగితం పూలు !

Tuesday, February 12, 2008

లోపలికి

లోపలికి

చెట్టుకి గమనం లేదని
జాలి పడకు
దాని ప్రయాణమెప్పుడూ
లోపలికే..


***

పచ్చజెండా

ఎన్నో రైళ్ళొచ్చాయి
ఎన్నో రైళ్ళు వెళ్ళాయి
కేబిన్లోంచి పచ్చ జెండా
ఎప్పటిలాగే రెపరెపలాడుతోంది

***

పగుళ్ళ లిపి

చెరువులో నీళ్ళన్నీ తాగేసి
వేసవి సూర్యుడు
అడుగున చిత్తడి నేలపై
పగుళ్ళ లిపిలో ఏదో రాసాడు.


* * *

ఏరు-చెట్టు

ఎక్కడకీ కదలని చెట్టు మెల్లగా
ఒక్కొక్క ఆకునే రాలుస్తుంటే
ఒక్క క్షణం ఆగని ఏరు వాటిని
ఎక్కడి తీరాలకో చేరుస్తోంది!

* * *

పాత టైరు

ఏ వాహనాన్ని
ఎన్నాళ్ళు మోసిందో
రోడ్డు పక్కన గడ్డిలో
నిశ్చలంగా నిద్రపోతోంది!


* * *

రెండు అనంతాల మధ్య..

మీద అనంతంగా విస్తరించిన ఆకాశం
కింద అనంతంగా పరుచుకున్న సముద్రం
మధ్యలో కదులుతోందో లేదో తెలీని విమానంలో నేను
చీకటి వెలుగులు మాటి మాటికీ దోబూచులాడుతున్నాయి

Thursday, January 17, 2008

చిరుజల్లులో పూలు

1.
తడుస్తున్నాం
చిరుజల్లులో పూలూ
నీ పాటలో నేనూ

2.
ఒక్క క్షణం కనిపించి
మళ్ళీ మాయమైంది
ఆకుల మధ్య జాంపండు

3.
ఎప్పటికైనా
కుదురుగా ఉంటుందా?
కోడిపుంజు మెడ

4.
బంతి మొక్క
ఎండిన పువ్వు పక్కనే
వికసిస్తున్న మరో పువ్వు

5.
పడవ నన్నూ
పాట నా మనసునూ
ఏవో తీరాలకి...

6.
అలికిడి మొదలైంది
మంచులో తడిసిన పూల మీద
దుమ్ము చేరుతోంది

7.
కిరణాలతో
కిటికీ బొమ్మ గీసాడు
సూర్యుడు

8.
గంట కొట్టి
కళ్ళుమూసుకుంది
ఏం కోరుకుందో!

9.
తవ్వుతున్నకొద్దీ
రంగులు మారుతోంది
మట్టి

10.
పసిపాప గుప్పెట్లో
నా చూపుడు వేలు
బంధాలు ఎంత గట్టివి?

11.
పాత కోవెల
రాతి స్తంభాలు
చల్లగా తగిలాయి

12.
రాళ్ళపై నడిచాకా
అరిపాదాలకి గడ్డి
మరింత మెత్తగా..

13.
ఎవరు పులిమారో
రాతి రంగే
ఈ తొండకి

14.
సాయంత్రం తోటలో
రక రకాల పక్షులు
బృందగానం

15.
దారి పొడుగునా
రాలిన పూలు
నడక ఎంత ఇబ్బంది?