Tuesday, December 30, 2008

చిరుజల్లులో పూలు

1.
ఎన్ని జీవులో
ఎన్ని భాషలో
ఈ చిన్ని తోటలో

2.
గెంతే దాకా
ఎక్కడుందో?
గడ్డిలో మిడత

3.
బండ రాళ్ళకి
నీడ నిస్తోంది
ముళ్ళ చెట్టు

4.
చెమట్లు పట్టించి
చిరుగాలితో స్వాగతం
పర్వత శిఖరం

5.
అటు, మళ్ళీ ఇటు
ఇటు, వెంటనే ఎటో
తూనీగ

6.
కొండలో
కొంత భాగాన్నే చూస్తున్నాడు
సూర్యుడు

7.
రంగు రంగుల పూలు
రంగులు వెలసిన ఆకులు
ఒకే చెట్టుకి!

8.
వచ్చేముందు
గాలిని కుడా చల్లబరిచింది
వర్షం

9.
కొండ మీద పడుకుని
ఆకాశాన్ని చూస్తుంటే
చీకటి పడిపోయింది

10.
కొండెక్కుతుంటే
మూతి ముడుచుకున్న పువ్వు
దిగుతుంటే నవ్వుతూ పలకరించింది

15 comments:

Vamsi M Maganti said...

పదవది ఒక్కటీ నిజంగా బావుంది...మిగతావన్నీ నా మటుకు కల్లుతాగిన అక్షరాలను కోర్చి కూరిచినట్టు ఉన్నది...

సాగర తరంగాన్ని కాలువలో వదిలితే ఏమవుతుంది? గమన శక్తిని పోగొట్టుకుని నిర్జీవమవుతుందా? కాలువలో కల్లోలాలు సృష్టిస్తుందా?

Afsar said...

naaku padee nacchaayi.
aa vokko padyam nijaaniki vokko podavayina free verse cheyyocchu.

kaani, ee meraku ide baagundi.

afsar

MURALI said...

nAvaraku oka pAThakuDigA annI bAgA naccAyi.

నల్లమోతు శ్రీధర్ said...

తక్కువ పదాల్లో చక్కని ఎక్స్ ప్రెషన్లు. నాకు చాలా నచ్చాయి.

Srinivas said...

నాకెందుకో ఇది కవిత్వంలా అనిపించడం లేదు. నచ్చిన చదువరులు ఈ వాక్యాలు తమలో కలిగించిన అనుభూతిని మిగతా వారితో పంచుకోవలసిందిగా ప్రార్థన. (అంటే చక్కగా వుంది, చాలా బావునాయి అని కాకుండా ఒక మామూలు వాక్యం కంటే ఎక్కువగా ఏ భావోద్వేగాన్ని కలగజేశాయో మాబోంట్లకు అర్థమయ్యేలా)

బొల్లోజు బాబా said...

విప్పి చెప్పేది వచనమైతే కప్పి చెప్పేది కవిత్వం అని సినారె గారి నిర్వచనం. దాని ప్రకారం ఈ పది హైకూలు/మినీ కవితల వెనుక ఒక జీవన సత్యమో/దృశ్యమో తొణికిసలాడుతూంటుంది.
ఇవి నాకర్ధమయిన భావనలు. ఇవే అంతిమం కాకపోవచ్చు.
1. ఈ చిన్ని తోట అంటే ఈ ప్రపంచం. ఎంత మంది మనుషులో, ఎన్ని ఆలోచనలో, ఎన్ని మార్గాలో, ఎన్ని యుద్దాలో, ఎన్ని ప్రేమలో అన్న భావాలు
కనపడుతున్నాయి.

2. మనం ఊహించని ఒక పని. ఒక చక్కని దృశ్యం. మిడత గెంతటమే కనిపిస్తుంది కానీ అది అంతవరకూ ఎక్కడ ఉందో మనం పట్టించుకోం/కనపడదు.

3. ముళ్ల చెట్టు నీడను వాంచించే వారు తక్కువ. ఎందుకంటే క్రింద ముల్లు ఉండవచ్చు కనుక. అందుకే ముళ్ల చెట్టు నీడ నిచ్చేది బండరాళ్ళకే. ఇక్కద ముళ్ళ చెట్టు దుర్మార్గుడవ్వొచ్చు/సైతాను కావొచ్చు, నీడను తీసుకొనేది మరోచెడ్డవాడు.

4.ఇది మరొక దృశ్యం. కొండకు ఒకపక్క నివసించేవారికి ఇది అనుభవమే. పగలంతా గాలిలేక చెమట్లు పడుతుంది, సాయింత్రమైతే కొండగాలితిరిగి చిరుగాలులు వీస్తారు. బహుసా దేముడూ అంతే మొదట కష్టాలు పెట్టి తరువాత సుఖాలనివ్వొచ్చు అనే భావం

5. ఇది జీవితానికే ఒక పోలిక. అంతే కదా ఇటు అటూ తిరుగుతూ ఎటో తెలియని పయనమే ఈ జీవితం

6. రవిగాంచనిచో కవిగాంచునన్నదానికి చక్కని ఉదాహరణ.
ఎంతటి సూర్యుడైనా కొండలో కొంత భాగాన్నే చూడగలడని ఒక అర్ధం. ఇక మానవుడేపాటి? ఈ ప్రాపంచికపు సంపూర్ణ సత్యాన్నావిష్కరించటానికి.

7. చెట్టు ఇక్కడ జీవితం/ప్రపంచం/. ఎన్ని రంగురంగు ల పూలు, అంటే మంచి అనుభవాలు, లేదా గొప్ప వ్యక్తులు. రంగులువెలసిన ఆకులు అంటే చెరిగిపోతున్న జ్ఞాపకాలు/ వృద్ద జీవాలు.

8. దైవ కరుణ కురిసేముందు, నిర్ధయుని హృదయంకూడా కరుగుతుందన్న సూచన.

9.ఆకాశం : సృష్టి రహస్యం. అలా ఏమిటీలోకం, ఎవరు ఈ సృష్టికి మూలం, ఏమిటీ జీవితం అంటూ ఆలోచిస్తూంటే జీవితం అయిపోయింది.

10. గొప్ప దృశ్యం: మూతిముడుచుకొన్న పువ్వు:మొగ్గ. నవ్వుతూ పలకరించటం అంటే వికసించటం.
దూరమౌతున్నప్పుడు ్మూతిముడుచుకోవటం, దగ్గరవుతున్నపుడు ఆనందించటం.

పై వివరణలన్నీ నాకు కనిపించిన విషయాలు. అవే అంతిమంకావు, ఇంకా గొప్ప అర్ధాలు ఉండవచ్చనే అవకాసాన్ని నేను కాదనను.

సుబ్రహ్మణ్యంగారి కవిత్వంలో చిన్నచిన్న పదాలతోనే, గొప్ప దృశ్యాన్నో, లేక ఒక గొప్ప లోతైన భావాన్నో తనదైన శైలిలో అత్యద్భుతంగా ఆవిష్కరిస్తారు.
అభినందనలు.

నేస్తం said...

బాబా గారి వివరణతో నేను మరింత ఆస్వాదించాను ఈ కవితలను ... :)

Srinivas said...

శ్రమ తీసుకుని వివరించినందుకు బాబా గారికి ధన్యవాదాలు. ఇలా ఓపిగ్గా చెప్పేవారుంటే కవిత్వం ఇంకాస్త ఎక్కువ మంది చదువుతారేమో!

బాబా గారూ, నాలుగో దానికి మీరు అన్వయించుకున్న అర్థం సరి కాదేమో! కొండపైకి ఎక్కుతున్నంతసేపూ చెమట్లు పట్టి ఎక్కాక చల్లటి గాలి వీయడాన్ని గురించి అనుకుంటాను ఆ నాలుగో ఖండిక.

మీ వివరణ చదివాక మరికొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి నాకు. ప్రతిదాన్నీ ఇలా ప్రతీకగా తీసుకుంటూంటే మామూలు వాక్యంలో కూడా కవిత్వం చూడవచ్చేమో! ఉదా:
పండు
రాలి పడింది
తిన్నాను
దీనికి మీరు ఏ అర్థం చెప్తారు? ఇదే ఇందులో పదకొండో ఖండిక అయి ఉంటే అర్థం మారుతుందా? కాక సుబ్రమణ్యం గారు దీన్ని వేరే చోట రాసిఉంటే మీకు వేరే అర్థం స్ఫురిస్తుందా? మూల వాక్యంలో కవి ఉద్దేశించని అర్థం,కవిత్వం చదువరికి తడితే అప్పుడు ఆ కవిత్వం కవిదా? చదువరిదా?

(సుబ్రమణ్యం గారూ క్షమించాలి కవిత్వం చదవడం కాస్త నేర్చుకుందామనే ప్రయత్నానికి మీ బ్లాగు వేదికా, మీ కవిత్వం సమిధా చేస్తున్నందుకు)

బొల్లోజు బాబా said...

శ్రీనివాస్ గారు
మాంచి చర్చకుతెరతీసారు. ఆఫీసుకు టైం అవుతుంది రాత్రికి వ్రాస్తానుసమాధానం.
వచనాని కవిత్వానికి తేడాలపై నా అభిప్రాయాలను ఒక కామెంటులో ఇక్కడ చూడండి
http://sahitheeyanam.blogspot.com/2008/12/i.html

కలుద్దాం

బొల్లోజు బాబా said...
This comment has been removed by the author.
బొల్లోజు బాబా said...

శ్రీనివాస్ గారు
పైన మనం చర్చించుకొంటున్నవి హైకులు

హైకూలంటేహైకూలు జపాను వారి పద్య ఛందో విశేషం. మొత్తం 17 అక్షరాలు, మూడు పాదాల్లో 5,7,5 లెక్కన రావాలి. ఇటువంటి సాంప్రదాయం మన తెలుగుకు వచ్చేసరికి అంత నిర్ధిష్టంగా అమరక పోవచ్చు. అయినప్పటికీ,తెలుగులో కూడా కొంత స్వేచ్ఛ తీసుకొని, (అంటే పాదాలు, అక్షరాల విషయంలో) గొప్ప హైకూలను చాలామంది వ్రాసారు, వ్రాస్తున్నారు.

హైకూలపై కొత్తపాళీ గారి అభిప్రాయం ఇలా ఉంది.
"హైకూకి మార్మికత ఒక్కటే కాదు లక్షణం. భావాన్ని
వెలిబుచ్చే పద్ధతిలో కూడా దానికో సొంత పద్ధతి ఉంది.
సాంప్రదాయకంగా బాషో వంటి మహానుభావులు రాసిన
జపనీయ హైకూల్లో ప్రకృతి ఆరాధన, పద చిత్రాలు కూడా విశేషంగా కనబడతాయి."
చూ: http://chandrima.wordpress.com/2008/10/27/%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B9%E0%B1%88%E0%B0%95%E0%B1%82%
E0%B0%B2%E0%B1%81/

హైకూలను తీసుకొంటే ఎంత స్వేచ్చ తీసుకొన్నా బ్రెవిటీ అనేది తప్పని సరి. ఇక్కడే వస్తుంది అసలు చిక్కు, ఎందుకంటే కవితను బ్రెవిటీ అనే చట్రంలో ఇమిడ్చితే, దానిలోని మధువుని తాగినంత వాళ్లకు తాగినంత అన్న పరిస్థితి ఏర్పడుతుంది.

ఏది వచనం ఏది కవిత్వం అని అంత సులభంగా విడదీయలేమని ఇప్పటికీ నా అభిప్రాయమే. బహుసా నేను పైన ఉటంకించిన లింకులోని నా భావాలను గ్రహించి ఉంటారని భావిస్తున్నాను.

కవిత్వానికి అన్ని సందర్భాలలోనూ అన్వయం అవసరం
కాకపోయినా హైకూలు, మినీ కవిత్వాల విషయంలో ఎక్కువ అవసరం అన్నది నా అభిప్రాయం.

ఇక మీరు వ్యంగ్యంగా వ్రాసిన పాదం
పండు
రాలి పడింది
తిన్నాను
దీనికి మట్టి/మట్టి స్వగతం అని పేరు పెట్టినట్లయితే ఇది
కూడా ఏదో విషయాన్ని కప్పిచెప్పుతున్నట్లవదూ?

-----మూల వాక్యంలో కవి ఉద్దేశించని అర్థం,కవిత్వం చదువరికి తడితే అప్పుడు ఆ కవిత్వం కవిదా? చదువరిదా?------
ఇది చాలా మంచి ప్రశ్న.
ఏ కవైనా తన అనుభవం లోంచి పుట్టిన ఆలోచనను
అక్షరబద్దం చేస్తాడు. దాన్ని చదువరి చదివేటపుడు దాన్ని అర్ధం చే్సుకోవటానికి అవే అనుభవాలు అతని కి ఉండొచ్చు ఉండకపోవచ్చు, . అలా అర్ధం చేసుకొనే
ప్రయత్నంలో ఆ చదువరి తనకున్న అనుభవాలతో లింక్ చేసుకొని అన్వయించుకోవచ్చు . ఈ అన్వయం కవి
ఊహించిన దానికన్న గొప్పగానూ ఉండొచ్చు. లేక
అధ్వాన్నంగానూ ఉండవచ్చు.

గొప్ప అన్వయానికి ఒక ఉదాహరణ: నా బ్లాగులో ఈ
లింకులో నేను వ్రాసిన ఒక కవితకు ఆత్రేయగారు చేసిన ఒక అన్వయం నన్ను విస్మయానికి ఆనందానికి గురిచేసింది. చూడండి.
http://sahitheeyanam.blogspot.com/2008/12/blog-post_29.html

చెడ్డ అన్వయానికి ఒక ఉదాహరణ: రాధిక గారి స్నేహమా బ్లాగులో ప్రయాణం అనే కవితకు నేను చేసిన అన్వయం:
http://snehama.blogspot.com/2008/05/blog-post_06.html

ఏది ఏమైనప్పటికీ ఒక కవివ్రాసిన కవితలో ఎన్నిఅర్ధాలు పల్లవించినా, ఆప్రతిభ కవిదే (వాటిని కవి ఊహించ కపోయినప్పటికీ కూడా) తప్ప చదువరిది కాదు. అంటే నా ఉద్దేశ్యం ఒక కవితలో ఒక కొత్త అర్ధాన్ని వెలికి తీసి, దానికి సంబందించి ఆ కవిత అట్టి విమర్శకునిదో/చదువరిదో అయిపోదు.
ఒక కవిత లో భిన్న అర్ధాలు ధ్వనిస్తున్నాయంటే
అది ఆ కవిత గొప్పతనమే. కొన్ని సందర్భాలలో కవిదీ కాకపోవచ్చు.
ఒక కవితలో భిన్న కోణాలను/అర్ధాలను వెతకటం, వాటిని ఆస్వాదించటం చదువరి సహృదయత గా నేను భావిస్తాను.

అందుకనే ఎవరో అన్నారు కవిత్వాన్ని చదవటం న్యూస్ పేపర్ చదవటం ఒకటి కాదని.
ఎందుకంటే ఒక కవిత చదువుతున్నప్పుడు ఏమిటీ ఈ కవి చెప్పదలచుకొన్నాడు, ఏమిటి చెపుతున్నాడు, ఎలా చెపుతున్నాడు, ఏమిటి ఇతని బాధ అని ప్రశ్నించుకొంటే, ఆ కవి యొక్క సమర్ధతా అసమర్ధతలు ఆ కవితలోనే కొట్టొచ్చినట్ట్లు కనపడతాయి అనటంలో సందేహం లేదు.
ఈ సమాధానంలో మీసందేహాలలో కొన్నింటికైనా సమాధానాలు దొరికాయని భావిస్తాను.

అభినందనలతో

సుబ్రహ్మణ్యంగారూ మీ బ్లాగు వేదికకావటం మీకు ఒకే అనే ధైర్యంతోనే ...........

బొల్లోజు బాబా

హైకూ పీడితుడు said...

గెంతే దాకా
ఎక్కడుందో?
గడ్డిలో మిడత

మనం ఊహించని ఒక పని. ఒక చక్కని దృశ్యం. మిడత గెంతటమే కనిపిస్తుంది కానీ అది అంతవరకూ ఎక్కడ ఉందో మనం పట్టించుకోం/కనపడదు.

పోయే దాకా
ఎక్కడుందో?
బుర్రలో మెదడు

మనం ఊహించని ఒక పని. ఒక చక్కని దృశ్యం. మెదడు పోవటమే కనిపిస్తుంది కానీ అది అంతవరకూ ఎక్కడ ఉందో మనం పట్టించుకోం/కనపడదు.

ఏమిటో ఈ ఒకళ్ళ వీపులు మరొకళ్ళ గోకుళ్ళు.....

డా.ఇస్మాయిల్ said...

అద్భుతం! కాస్త మనస్సు పెడితే ఈ మూడు ముక్కల్లో మూడు లోకాలను చూడొచ్చు. వీటి గొప్పదనం మన ఊహల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది.
నా నుంచి ఒక హైకూ...

అనుభూతి
------
"ఏటి ఒడ్డున చెట్టు,
చెట్టు కొమ్మన పిట్ట,
నా మనస్సు ఎటో ఎగిరెళ్లిపోయింది!"
-ఇస్మాయిల్.

@బాబా గారు...
చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పినట్టు 'మట్టి' అన్న శీర్షిక పెడితే శ్రీనివాస్ గారిదీ ఓ మంచి హైకూ అవుతుంది. అలాగే హై.భా. రాసిన పదాలకు 'పిచ్చోడు' అన్న శీర్షిక పెడితే అదీ బావుంటుంది:-)
సూచన:ఇది హై.భా మీద వ్యక్తిగత దాడి ఎంత మాత్రం కాదు.

Meher said...

తొమ్మిదో నంబరు బాగుంది.

ప్రణీత స్వాతి said...

7,8,10 చాలా బాగున్నాయండీ.