Tuesday, November 17, 2009

కళాకారుడు

ఒంటరిగా తప్ప ప్రవేశించలేని
నిన్ను నువ్వు కాల్చుకుంటే తప్ప
ఏమీ కనబడని చీకటి గుహలో

ప్రతి రాత్రీ..
ఏదో వెతుక్కుంటూ...

* * *

లోతు బావిలో నీళ్ళని
జల్లెళ్ళతో తోడాలని
ప్రయత్నించి ప్రయత్నించి

ఆ బావి గట్టునే..
దాహం తీరకుండానే...

Thursday, November 12, 2009

రాత్రి వాన

కరెంటు పోయిన
నవంబరు రాత్రి
ఒంటరిగా నేను

కొవ్వొత్తి
రాత్రి
మౌనంగా
కరుగుతుంటాయి

ఏ పిలుపు
తన గుండెని మ్రోగిస్తుందోనని
మొబైలు ఫోను చూస్తుంటుంది

గడియారపు సెకెన్ల ముల్లు
గదిలో మౌనపు లోతుల్ని
కొలుస్తుంటుంది

హృదయాకాశంలో
దిగంతాల దాకా వ్యాపించిన
దిగులు మబ్బులు

ఇందాకే వాన కురిసి
కిటికీకవతలి ప్రపంచాన్ని
కడిగేసింది

ఏ వాన కురిసి
నా లోపలి ప్రపంచాన్ని
కడగనుందో!

Tuesday, November 3, 2009

చిరుజల్లులో పూలు

1.
పూవులా వికసించింది
పూలని చూసిన
ఆమె ముఖం

2.
వర్ణించలేను
ఈ పూవులోని
వర్ణాల్ని!

3.
ఎన్ని వక్ర రేఖలో!
రెండు చుక్కల్ని
కలిపేందుకు

4.
దిగేకొద్దీ
లోతు
పెరుగుతోంది

5.
గాడిలో పడేలోపు
ఎన్ని గెంతులో
బొంగరం

6.
బెంచీ పైన అమ్మాయిలూ
బెంచీ పక్కన పూలూ
ఒకటే నవ్వులు

7.
కలిసిపోయాయి
మీద కొమ్మలూ కింద నీడలూ
ఏ నీడ ఏ చెట్టుదో!

8.
పక్క పక్క కొండలు
ఒకటి ఎండలో
మరొకటి నీడలో

9.
వరిచేను గట్టుపై
ఒంటరి సైనికుడు
కొబ్బరి చెట్టు

10.
ఏటి ఇసుక
నీరు పారినంత వరకే
దీని అందం