Thursday, October 27, 2011

నిశ్చల యాత్ర

' ఈ సారి ఎలాగైనా దాటేద్దాం........పద ' అర్ధరాత్రి ఎవరో పిలుస్తున్నారు.


గత కొన్ని రోజులుగా ఈ పిలుపు వినిపిస్తోంది. ఇవాళ ఈ సంగతి తేల్చాలి అని అటువైపు నడిచా. ఎటుచూసినా చిక్కని చీకటి. శూన్యం. ఏమీ లేనితనం. ఎందరు సూర్యులు వెలుగుతున్నా విశ్వం అంతా అలముకొన్న చీకటిలా! అక్కడ అస్తిపంజరం లా ఉన్న మానవాకారం. కానీ అతనిలో ఏదో తేజస్సు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్న అతని పిలుపు. అంత చీకటి నీ నిలువు గా చీలుస్తున్న అతని తేజస్సు.


ఎవరితను?

ఏమా తేజస్సు?

ఏమిటిదంతా?

నాకేమీ అర్ధం కావడం లేదు. ఎంత సాధిస్తున్నా మనిషికి కొన్ని ఎప్పటికీ అర్ధం కావేమో! ఇంతకీ ఎవరితను? కొంపతీసి పిచ్చివాడు కాదు కదా! గొప్ప సత్యాన్ని అన్వేషించి, నలుగురికీ ఆ సత్యాన్ని చెప్పాలనుకొన్న వాళ్ళందరినీ పిచ్చివాళ్ళనుకోవడం ఈ లోకానికి ఆలవాటే కదా! ఇంక జుట్టు పీక్కోవడం అనవసరం అనిపించి అడిగేసా.


'ఎవరు మీరు? దేన్ని దాటడం?'


"నన్నే గుర్తు పట్టలేక పోయావా? అవునులే నేనున్నట్టే చాలామందికి తెలియదు. నువ్వు గుర్తుపట్టలేక పోవడం వింతేమీ కాదు. రోజు రోజుకీ క్షీణిస్తూ ఇప్పటికి ఇలా తయారయ్యాను. ఇంక ఇక్కడ బ్రతకలేకుండా ఉన్నాను. ఆ అగాధానికి అటువైపు పోదాం పద"


"స్వామీ మీరెవరో ఇంకా నేను గుర్తుపట్టలేకుండా ఉన్నాను. నా ఊహ గాని నిజమైతే మీరు దైవం , అటువైపు ఉన్నది స్వర్గం అయ్యుండాలీ"

అతను బిగ్గరగా నవ్వాడు. "పిచ్చివాడా! ఉన్నాడో లేడో తెలియని దేవుడి మీద ఎందుకంత నమ్మకం మనుషులకి? స్వర్గం పై ఎందుకంత మక్కువ? అసలు మానవాతీత విషయాలపై ఎందుకంత జిజ్ఞాస?"

"ఆ జిజ్ఞాసే కదా స్వామీ మనిషిని ముందుకు నడిపిస్తోంది. ఇవాళ అతీతమైనవన్నీ రేపు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కదా?"

అతనితో వాదించగలుగుతున్నందుకు లోలోపల ఆనందం గా ఉంది. అయితే అతనికివేవీ పట్టనట్టు ' ఈ వాదించుకోవడాలు, మా సిద్ధాంతం గొప్పదంటే మా సిద్ధాంతం గొప్పదనుకోవడాలు ఇవే ప్రగతి కి అవరోధాలు. వీటి వల్ల కొంచెం కూడా ఉపయోగం లేదు.అ యినా ఇవన్నీ చర్చించడానికి మనకి వ్యవధి లేదు. పద. ఇవాళే దాటాలి. రేపుందో లేదో కూడా తెలియదు. నేడే సత్యం. అంతా ఈ క్షణమే.


ఈ అవకాశం మళ్ళా లభించక పోవచ్చు. పద ' అన్నాడు.

'స్వామీ ఇంకా మీరెవరో చెప్పలేదు?'

'ఏం చెబితేగాని రావా?'

'క్షమించాలి. ఎందుకూ అన్న పునాదుల మీద తర్క శాస్త్రాన్ని నిర్మించాం.దాని సహాయంతోనే  ప్రకృతిని జయిస్తున్నాం. ప్రపంచాన్ని కుగ్రామం గా మార్చేసాం . కాంతి వేగం తో ప్రయాణిస్తున్నాం. కాలాన్ని మరణాన్ని కూడా జయించడానికి సిద్ధం గా ఉన్నాం '

'దాని సహాయంతోనే యంత్రాలకి మీరు బానిసలయ్యారు.కాంతి వేగం తో ప్రయాణించినా ఒకరి మనసుల్లోకి ఒకరు వెళ్ళలేకపోతున్నారు. ఇంకా అడవి మనుషుల్లానే ప్రవర్తిస్తున్నారు '


'స్వామీ క్షమించాలి.మనిషి స్వభావాన్ని మార్చగల యంత్రం ఇంకా కనుక్కోబడలేదు '


'మనిషి స్వభావాన్ని కూడా యంత్రం సహాయంతో మార్చగలననుకొనే నవీన మానవుడా..నీకు జోహార్లు '



నాకు సిగ్గేసింది. ఎవరితను? తర్కం తర్కం. దేన్నీ ఒప్పుకోలేని తర్కం. కృష్ణ శాస్త్రి కవితని ఆస్వాదించడానికి కూడా రీజన్ అవసరమయ్యే తర్కం. దేన్నీ ప్రేమించలేని తర్కం.



' నేనెవరో చెబుతా విను.నన్ను 'అంతరాత్మ ' అంటారు. ఇప్పటికైనా వస్తావా? ఆ అగాధం దాటడానికి? '



' ఏమి అగాధం స్వామీ అది? '


' నీ తర్కానికో నమస్కారం . నీ భౌతిక యంత్రాల సహాయంతో దాటలేవు నాయనా. అది మనిషినీ మనీషినీ, ఆలోచననీ ఆచరణనీ వేరు చేసే అగాధం '

'అంటే మనీషులంతా ఆ అగాధాన్ని దాటేరంటారా?'



'ఖచ్చితంగా. నా పోరు పడలేకే దాటారు ' అతని స్వరంలో గాంభీర్యత చూసి ఇంక అతనితో వాదించదల్చుకోలేదు. నడుస్తున్నాం. ఇద్దరి మధ్య మౌనం. యుగ యుగాలుగా మనిషి జీవితం లో పేరుకుపోయిన నిశ్శబ్దం. చుట్టూ చీకటి. నడుస్తున్నాం . ఇంకా నడుస్తున్నాం.


' స్వామీ నేను అలసిపోతున్నాను . ఈ దారి కూడా సరిగ్గా లేదు '

అతను మరొకసారి బిగ్గరగా నవ్వాడు. మూర్ఖుడా దారి శుభ్రం గా ఉండి ప్రయాణం సులభతరమైతే అందరూ ఈపాటికి దాటేసేవారు. ఇది మనిషి ని మనీషిగా మార్చే ప్రయాణం. మరొకసారి గుర్తు చేసాడు. నేనేమీ మాట్లాడలేదు. అతడిని అనుసరించా! ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి చూడకు అని ఆదేశించాడు. నడుస్తున్నాం. నడుస్తూనే ఉన్నాం . మెల్లగా చీకటి తెరలు తొలగిపోతున్నాయి. ఉదయభానుని స్వాతి కిరణాలు అంతఃలోకమంతటా పరచుకొంటున్నాయి. ఇప్పుడు నూతనోత్సాహం వెల్లి విరుస్తోంది. వెలుతురుసోకిన అతని శరీరం ఇంకా వెలిగిపోతోంది. చుట్టూ పక్షుల కిలకిలా రావాలు. మృత్యు నిశ్శబ్దం నుంచి మృదుజీవ రవళి దాకా ప్రయాణించామనిపించింది.

  అతను తాదాత్మ్యత తో సాగిపోతున్నాడు. ప్రకృతితో మమేకమైపోయాడు. ఆ పక్షులతో తనూ శ్రుతి కలిపాడు. అంతటా ప్రశాంతత వెల్లి విరుస్తోంది. ఆ వాతావరణాన్ని ప్రయోగశాలలో సృష్టించడానికి మనిషికి ఇంకా వెయ్యేళ్ళు పట్టొచ్చు. 



అతడిని అడిగా ' స్వామీ మీ ఆహారం ? '


'సౌందర్యం .శాశ్వతమైన, సత్యమూ నిత్యమూ అయిన సౌందర్యం . నువ్వనుకొనే సౌందర్యం కాదు ' సూటిగా తగిలింది ఆలోచనా సరిహద్దుల్లో.

మెల్లగా ఆ అగాధాన్ని చేరుకొన్నాం. అతనొక తాడు తీసాడు. 'ఏమిటి స్వామీ ఈ తాడు?' 'ఇది ప్రయత్నం నాయనా. ఇది లేకుండా ఆ అగాధాన్ని దాటడం అసాధ్యం ' అని ఆ తాడుని ఇటొక చెట్టుకీ అటొక చెట్టుకీ కట్టాడు.

' చిన్న సందేహం. అటువైపు వెళితే ఏమొస్తుంది? '

' ప్రతీ దాన్నీ లాభ నష్టాలతో బేరీజు వేసుకోవడం కూడా నవీనత్వం లో భాగం కాబోలు. అటువైపు వెళితే సంతృప్తి వస్తుంది. మీ డబ్బుతో కొనలేనిది.' తాడు కట్టడం పూర్తి చేసి ఆదేశించాడు.


' ఇప్పుడు కాసేపు ప్రార్ధించుకో '



 'ఎవరిని స్వామీ దేవుడినా?'


 'అహం బ్రహ్మాస్మి ' తర్వాత అతని మౌనం .

రెండు క్షణాల తర్వాత 'పద తాడు సహాయంతో అటువైపు వెళదాం . ఒక మహత్తర విజయం సాధించడం లో నేను నీ వెనకే ఉంటాను. అయితే ఇప్పటిదాకా వచ్చింది ఒక ఎత్తు. ఇప్పుడు చెయ్యబోయేది ఒక ఎత్తు. మరొక ఆలోచన నీ మనసులోకి రానివ్వొద్దు. నీ లక్ష్యం అవతలి గట్టు చేరడం ' అన్నాడు.


ఇద్దరం తాడు సాయంతో అటువైపు వెళుతున్నాం . అతను చెప్పినట్టుగానే ఆ అగాధం భయంకరం గా ఉంది. అయినా ధైర్యం గా ముందుకు సాగుతున్నాం . సరిగ్గా అప్పుడు వచ్చాయి ఎక్కడినుంచో ఆరు రాబందులు. నన్ను పొడవడం మొదలెట్టాయి.



'ఏమిటి స్వామీ ఈ రాబందులు?'



'అవి అంతః శతృవులు నాయనా . ఆఖరి మజిలీలో ఎల్లప్పుడూ ఆటంకం కలిగిస్తాయి. అధైర్య పడకు. ప్రయత్నం వదలకు. నీకేం భయం లేదు నేనున్నాను '


కాస్త ధైర్యం వచ్చింది వాటిని లెక్క చెయ్యడం లేదు. మేం లెక్కచెయ్యకపోవడం తో అవి మరింత రెచ్చిపోయాయి. వాడైన తమ ముక్కులతో ప్రయత్నాన్ని పొడవడం మొదలెట్టాయి. వెనకనుంచి అంతరాత్మ ఘోషిస్తున్నాడు. వాటిని తరిమెయ్యి నాయనా తరిమెయ్యి అని. వాటిని తరమడానికి నా సంకల్ప శక్తి సరిపోవడం లేదు. నేను నిస్సహాయుడినైపోతున్నాను. మనిషికి అసాధ్యమైనది లేదని ప్రగల్భాలు పలికి ఈ స్థితి కి చేరుకొన్నాను. మనిషి మనీషి ఎందుకు కాలేకపోతున్నాడో ఇప్పుడు అర్ధం అవుతోంది. అయినా ఏం లాభం ?


అవి ప్రయత్నాన్ని తెంపేసాయి. ఆ అగాధంలో వేలాడుతున్నాం . ' పద నాయనా తొందర గా బయట పడాలి. ఆశ వదలకు. అదే నీ శ్వాస ' అని ఇంకా ఏవేవో చెబుతున్నాడు. అతను ఉంటే నేను బ్రతికి బయట పడెలా లేను. ఎవ్వరో ఒకరమే బ్రతికేలా ఉన్నాం . ఒక వేళ కష్టపడి అతడిని బ్రతికించినా మళ్ళీ మళ్ళీ ఈ అగాధం దాటాలంటాడు. ఆశ వదలొద్దు ధైర్యమే ఒక కవచం అంటాడు. అందుకే ఆలోచించి ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చి అతడిని ఆ అగాధం లోకి తోసేసి నేను బయటపడ్డా. అగాధంలోకి పడిపోతూ అతడన్న మాటలు నా చెవిలో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి.



"నన్ను బ్రతికించడంకోసం తమ ప్రాణాలు బలిచ్చిన వారినీ చూసాను, తమ ప్రాణాలు కాపాడుకోడానికి నన్ను బలిస్తున్న వారినీ చూస్తున్నాను. వర్ధిల్లు నవీన మానవుడా వర్ధిల్లు !! "

(ఇది నా మొదటి వచన రచన. 2003 నవంబరులో రాసింది)

4 comments:

Anonymous said...

చాలా బాగా వ్రాశారండి.

Padmarpita said...

చాలా బాగుందండి.

kiran said...

excellent...!!

Anonymous said...

Chala baaga vrasarandi.. naveena manavudu gurinchi meeru ichhinna vissleshana chala chakkaga undiandi