Saturday, December 3, 2011

పదచిత్రాలు

జోరుగా వర్షం పడుతుంటే
గొడుగున్న వాడి
ధైర్యం


చలికాలపు ఉదయం
ఒంటిమీద
చన్నీళ్ళు పడ్డప్పటి
ఉలికిపాటు

జారుడుబల్ల
కిందనుంచి పైకెక్కే
పసికాళ్ళలోని
పట్టుదల


పల్లెటూరిలో ట్రాక్టర్ వెనక
అలుపెరుగక పరుగెత్తే
చిరిగిన నిక్కర్ల
అమాయక ఆనందం


ఒక్కొక్కరికే ప్రశ్నాపత్రాలు
అందిపోతుంటే
ఆఖరి బెంచీలో పెరిగే
ఆతృత


ఎక్స్ ప్రెస్ రైలు
ఆగకుండా వెళ్ళిపోతే
మారుమూల ప్లాట్ ఫాం
నిర్లిప్తత


దురదేసినా గోక్కోలేని
గోరింటాకు చేతుల
నిస్సహాయత


కచేరీలో
ఒక చేతినుండి మరొక చేతికి
ప్రవహించే చప్పట్లలోని
ప్రేరణ

చన్నీటిజల్లులో
స్నానం చేస్తుంటే
దేహంపై మెరిసే
నీటిబొట్లలాంటి
జ్ఞాపకాలు


గాయం మానాక
పొరలు పొరలుగా చిగురించే
కొత్త చర్మంలాంటి
ఆశ


26-12-2004

( ఏటి ఒడ్డున కవితా సంకలనం నుంచి... )

4 comments:

తెలుగు పాటలు said...

Subrahmanyam Mula గారు అన్ని పదచిత్రాలు బాగున్నాయి...
ఒక్కొక్కరికే ప్రశ్నాపత్రాలు
అందిపోతుంటే
ఆఖరి బెంచీలో పెరిగే
ఆతృత.. మళ్ళి స్కూల్ డేస్ గుర్తుకు చేశాయి

జ్యోతిర్మయి said...

బావున్నయండీ మీ పదచిత్రాలు.

రసజ్ఞ said...

చాలా బాగున్నాయి!

MURALI said...

కొన్ని చిరునవ్వు తెప్పిస్తూ కొన్ని భలే అనిపిస్తూ బావున్నాయి చక్కగా.