Saturday, December 22, 2007

నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే...

గుప్పెడు క్షణాల్ని దోసిట్లో పోసి ఇక నీ ఇష్టం అని ఆమె చినుకుల్లో చినుకుగా మాయమైంది.. ఈ క్షణాలు కరిగిపోయేలోగా అతడిని కలుసుకోవాలి. చుట్టూ కురుస్తున్న వర్షం....కొండ కోనల్లో వర్షం.. గుండె లోయల్లో వర్షం.. లోకంలోని కల్మషాన్నంతటినీ కడిగేస్తూ వర్షం.. హర్ష వర్షం... వర్ష హర్షం.. నేలని చినుకు పెదవులతో కోటి సార్లు ముద్దాడుతూ ఆకాశం..మబ్బులన్నీ కరిగిపోగా విశాలంగా నవ్వుతూ ఆకాశం... చిన్ని చిన్ని నీటి మడుగుల్లో తనని తాను చూసుకుని మురిసిపోతూ ఆకాశం...

ఇంత చిన్ని నీటి మడుగు అంత పెద్ద ఆకాశానికి అద్దం ఎలా అయిందని విస్మయపడుతూ నేను. సృష్టి తనని తాను అనేకానేక రూపాల్లో వ్యక్తపరుచుకోవడం దర్శించినప్పుడల్లా నాలో ఇదే ఆశ్చర్యం. ఇలాంటప్పుడే పచ్చికబయళ్ళెమ్మట పరుగులు పెట్టిన వాన వెలిసిపోగానే తేటపడ్డ లేతగడ్డి పువ్వులా మనసు గెంతులు వేస్తుంది. తలెత్తి చూసాను. కనుచూపు మేరంతా విశాలంగా పరుచుకున్న మైదానం. మైదానంలో విశృంఖలంగా నర్తిస్తూ సంధ్య ప్రవేశిస్తోంది.శబ్దాలన్నీ మౌనపు లోతుల్లోకి మునిగిపోతున్నాయి. లోకమంతా చీకటి కౌగిలిలో ఒదిగిపోతోంది. మట్టివాసన గుండెనిండా పీల్చుకుని, జ్ఞాపకాలని మూట కట్టుకుని బయలుదేరాను. ఆకుల చెంపలపైనుండి కన్నీరు బొట్లు బొట్లుగా జారుతుంటే బారులు తీరిన చెట్లన్నీ నాకు వీడ్కోలు పలుకుతున్నాయి.

మార్గం సుదీర్ఘం. చుట్టూ నిబిడాంధకారం. అయితేనేం నాకు దారి చూపేందుకు అనంత కోటి నక్షత్రాలు. అతడిని కలుస్తున్నానన్న ఆనందం మరొక నక్షత్రమై ఆకాశాన్ని చేరి మెరుస్తోంది.పక్షులన్నీ మా ఇద్దరి కలయికనీ గానం చేస్తాయన్న తలంపు నాకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తోంది.సరిగ్గా ఇదే సమయానికి అతను చీకటి సముద్రపు లోతుల్లో బయలుదేరి ఉంటాడు. అతడు సంద్రాన్ని చీల్చుకుని పైకి వచ్చేసరికి నేను కూడా సముద్రాన్ని చేరుకోవాలి. అతడి బంగారు కిరణాల దారాలతో నా ఆత్మ చిరుగుల్ని కుట్టుకోవాలి. తొందరపడాలి.

రాత్రి కళ్ళు మిటకరిస్తోందా అన్నట్టు అక్కడక్కడా మిణుగురులు. రాత్రి గుండెచప్పుడా అన్నట్టు కీచురాళ్ళు . ఇక నేను ఒంటరినెలా అవుతాను? ఆ ఉత్సాహంలో అనంతంగా పరుచుకున్న నల్లని రాత్రిని దాటి అతనికంటే ఒక అడుగు ముందే సముద్రాన్ని చేరుకున్నాను. సముద్రాన్ని చీల్చుకుని అతను బయటకి వచ్చే దృశ్యం. అదొక అద్భుతం! అసలు ఆ దృశ్యాన్ని చూడ్డానికే ఈ జన్మ ఎత్తితేనేమనిపించింది. ఆ ఉద్వేగంలో గుండెలు బ్రద్దలైపోతేనేమనిపించింది. నా కళ్ళు చెప్పలేని ఆనందంతో తడిసాయి. కలా నిజమా అని చూస్తుంటే మొహానికెదురుగా చేతులాడించినట్టు అతని కిరణాలు. అనుకున్నట్టుగానే పక్షులన్నీ అతని ఆగమనాన్ని గానం చేస్తుంటే నన్ను చూసి చిరునవ్వు నవ్వుతూ అతనన్నాడు కదా.. "నువ్వు నా పై పై వెలుగునే చూస్తున్నావు. నాలో నిరంతరం రగిలే అగ్ని గుండాన్ని చూడట్లేదు" అని

అప్పుడు నాకర్ధమైంది వెలుగునివ్వాలంటే రగిలిపోవాలని!

(“You must have chaos within you to give birth to a dancing star.”అన్న నీషే ప్రవచనం ఆధారంగా..)

4 comments:

నిషిగంధ said...

idi maatram naa all time fav!!
Nice to see all your poems here :-)

మోహన said...

chala bagundi.

Unknown said...

చాల బాగుందండి ... పదాలు ఎక్కడినుంచి పట్టుకోచ్చారండి బాబు ... చాల సరళంగా ... ఉన్నాయ్ ... చాల కస్టపడినట్లున్నారు ఇది వ్రాయడానికి ... కదా !!!!

జ్యోతిర్మయి said...

మీ బ్లాగు లోతుల్లోకి వెళితే, నా ప్రయాణం వృధా కాలేదు మత్యం దొరికింది..