Sunday, December 21, 2008

నూతి మీద మూడు కవితలు

1.
మధ్యాహ్నపు మండుటెండలో
పల్లెటూరి నేల నూతిలో
నిశ్చలంగా నీరు
నిలకడగా ఆకాశం

నీటి తపస్సుని
చేద భగ్నం చేయగానే
ఎంత అలజడి!

కోపంతో నుయ్యి
ఏ ప్రతిబింబాన్నీ
చూపించడం మానేసింది

2.
నూతిని వీడలేని
నీటి చుక్కలు కొన్ని
చేదలోంచి చల్లగా
జారుకుంటున్నాయి!

3.
పల్లెటూరి నేల నూతిలో
పాకుడుపట్టిన రాళ్ళ మధ్య
మొలకెత్తిన పిచ్చి మొక్కని

ఆమె చేదలోంచి జారిన
నీటి చుక్కలు కొన్ని
నా మీద పడగానే..

ఆనందంతో
అటు ఇటు ఊగుతాను!

4 comments:

మాగంటి వంశీ మోహన్ said...

ప్రపంచానికి ప్రళయమే స్పీడుబ్రేకరు
బావికి, బావిలో చేదకి ఈ కవితే బ్రేకరు
గూట్లో బందీ కావటం గరుత్మంతుడికి అవమానం
బావిలోని నీళ్ళకు....

ఇంతే సంగతులు చిత్తగించవలెను...

Anonymous said...

బాగుంది.

Bolloju Baba said...

వంశీ గారు
కొద్ది కాలంగా గమనిస్తున్నాను మీ కామెంట్లు చిక్కగా మార్మికతతో ఉంటున్నాయి.
బావుంటున్నాయి లెండి.

సుబ్బు గారు (అలా అనొచ్చా నేను)
బాగున్నాయండీ.

rākeśvara said...

బాగున్నాయి.
మొదటి రెండూ చాలా బాగా నచ్చాయి.

ఎప్పుడైనా మీకు వీలయితే, మీరు ఏ సంఘటనని చూసి కవితకు స్ఫూర్తినొందారో దాన్ని ఫొటో తీసి, కవితతోఁ బాటు టాపా వేయండి.
ఉదా- ఈ కవితతో పాటు మీకు స్ఫూర్తినిచ్చిన నుయ్యి.
అంటే నుయ్యి మీ ఊహల్లోనే వుంటే ప్చ్.

కానీ ఎప్పుడైనా మీకు కవిత స్ఫురించనపుడు మీ దగ్గర కెమరా వుండడం తటస్తిస్తే, నా కొఱిక తప్పక మన్నించగలరు.