Saturday, September 3, 2011

త్రిపుర


ఒకదాన్నొకటి తరుముకునొచ్చే అలలు, అర్ధమవని గుండెలు కోసే స్త్రీ రోదనలు, గుడ్డి దీపం కింద రగ్గుతో కప్పబడిన శవం నీదే అన్న కఠోర నిజాన్ని కప్పిపుచ్చే అబద్దాలు, గులకరాళ్ళ తపస్సుని భగ్నం చేసే సెలయేళ్ళు, మసక కాంతిలో మట్టి అరుగుమీద చీకట్లో ఎక్కణ్ణుంచో బారులు కట్టి ఎక్కడికో వెళ్తున్న చీమలు , అర్ధరాత్రి అలల మీదకి మౌనంగా ఒదిగే చంద్రుడు, నిరంతరం బండలకేసి తలబాదుకుని రోదించే సముద్రం, మహానదుల్ని సైతం రెండుగా చీల్చే నావలు, ఉన్నదంతా ఇచ్చేసి దేశాన్ని ఇనప చీపుళ్ళతో ఊడ్చడానికి రంగూన్ నుంచి వాల్తేరు చేరే వీరాస్వాములు, రండి మీరు కోరుకున్న తీరాలకి చేరుస్తామని అనంతంగా పరుచుకుని ఆహ్వానించే రైలు పట్టాలు, కొమ్మల కుంచెలతో గాల్లోనే అధివాస్తవిక చిత్రాలు గీసే కొబ్బరిచెట్లు, గంగ ఒడ్డున మెలికలు తిరిగే ధూళిబాట మీదకి బరువుగా జారే సాయంకాలాలు, బలంగా అల్లుకునే ప్రశ్నార్ధకాల రంగు రంగుల గొలుసులు, విశాలంగా చెదిరి పెరిగే వలయాలు, విషవలయాలు, ఆలోచనకీ తెలుసుకోడానికీ మధ్య అగాధాలు...

కళ్ళ ముందు మిరుమిట్లు గొలిపే ఆకాశపు అంచుల్నీ , చూపులకందని అంతరంగ అగాధపు లోతుల్నీ అక్షరాల్లోకి పడదామనుకుంటే... జల్లెడలో నీళ్ళలా జారిపోగా జారిపోగా... మూడు బొట్లు మాత్రం మిగిలాయి.. అవి...

త్రి... పు.... ర(నేను అత్యంత అభిమానించే రచయిత త్రిపుర గారి ఎనభై మూడవ పుట్టినరోజు సందర్భంగా...)

4 comments:

Bhupatiraju vihang said...

nice....

kiran said...

ఆహా ...ఎంత బాగుందో..

మనసు పలికే said...

అద్భుతం..:))))

రాజ్ కుమార్ said...

బాగుందండీ ;;)