Friday, March 22, 2013

ఈ కాసిన్ని అక్షరాలు

1.


శృంగేరిలో సూర్యాస్తమయం
తుంగనది అనంతంలోకి..
ఓంకారం మౌనంలోకీ..
నదిలో చేపలు.. మదిలోనో?
దేన్నీ పట్టుకోలేను
చంటాడితో పాటు
నాకూ కొన్ని కొత్త అక్షరాలు!?
గుడిలో అమ్మ నవ్వుతుంది.

2.

పాటే అక్కరలేదు
ఒక్కోమాటు
చిన్న మాటైనా చాలు
జ్ఞాపకాల
మూట విప్పేందుకు!

3.

బెండకాయ వేపుడు
వేడి వేడి అన్నం
ఆకలీ అన్నం కలిసి
చాలా కాలమైనట్టుంది

4.

హోరుమని వర్షం
కొండెక్కి వెళ్ళాం
తడి బట్టలు
వణికించే చలి
చిన్ని ప్రమిద వెలుతురు
గుహలో శివలింగం

5.

కవ్వం.. లాంతరు..
రుబ్బురోలు..తిరగలి
కవిత్వంలోనూ..
జ్ఞాపకాల్లోనే..

6.

బోను తలుపు తెరవగానే
పరుగులు పెట్టే ఎలక
ఆ కాళ్ళలోని స్వేచ్ఛా కాంక్షకి
అబ్బురపడతాను

7.

ఏదో దాహం తీరక
మళ్ళీ ఈ ఒడ్డుకి వస్తావు

జుత్తులు విరబోసుకుని
కాళీ ఆ ఒడ్డునే కూచుంటుంది
నీ జుత్తు పట్టుకుని
నీటిలో ధబీ ధబీమని

ఉక్కిరిబిక్కిరౌతూ..
నేను కాదు నేను కాదు
అంతా నువ్వే అనేవరకూ


8.

వికసిస్తున్నాయి
కిటికీ బయట పూలు
లోపల పిల్లలు

విచ్చుకుంటున్న పూల మధ్య
మేం కూడా ఒక పువ్వుని ఉంచాం


9.

ఉజ్వలంగా వెలిగిన కర్పూరపు గుర్తులేవీ
లోపలే తప్పితే బయట మరి కనిపించవు.


10.

నిరీక్షిస్తాను..
నిరీక్షిస్తాను..
నీ అంతట నువ్వు
కరుణించే వరకూ

ఎక్కణ్ణుంచో వచ్చి
కాసిని చినుకులు రాల్చేసి
ఎక్కడికో వెళ్ళిపోతావు

11.

స్తంభించిన ట్రాఫికులో
చలనం వచ్చినట్టు
అప్పుడప్పుడూ
కవిత్వం..

12.

చప్పున ఎగసి
చతికిలపడే అల
కవి!

13.

కోరికలు దహించి వేస్తాయి
ఏవేవో పట్టి పీడిస్తాయి
అసహ్యమైనవన్నీ
వచ్చి చేరుతాయి

అందరి కాళ్ళనీ
మందిరానికి చేర్చే
గుడి మెట్టులా
మారాలని ఉంటుంది

14.

ఎక్కడో ఒక పువ్వు
గడ్డిలో రాలుతుంది
ఎక్కడో ఒక చినుకు
నదిని తాకుతుంది
ఈ సాయంత్రం నాలోంచి
ఈ కాసిన్ని అక్షరాలు..

6 comments:

ఎం. ఎస్. నాయుడు said...

చప్పున ఎగసి
చతికిలపడే అల
కవి!

భలే రాసారు

Anonymous said...

chatikila padda mallee uvvettuna egasipade ala kavi!

తెలుగమ్మాయి said...

ప్రతిపదంలో మల్లెల గుభాళింపులే

Padmarpita said...

మీ కవిత వేసవిలో హాయిగొలుపుతున్నట్లుందండి

Padmarpita said...

మీ కవిత వేసవిలో హాయిగొలుపుతున్నట్లుందండి

Sag said...

ఈ సాయంత్రం నాలోంచి
ఈ కాసిన్ని అక్షరాలు..

కవితా సాగరంలో కలుస్తాయి...

అన్ని బాగున్నాయి.
14th one నాకు చాల బాగా అనిపించింది ....