Tuesday, April 2, 2013

కాసిన్ని అక్షరాలు - కామేశ్వరరావు గారి అభిప్రాయాలు.


"ఈ కాసిన్ని అక్షరాలు" శీర్షికతో నేను రాసిన కవితల మీద భైరవభట్ల కామేశ్వరరావు గారు ఒక సుదీర్ఘమైన కామెంటు రాసారు. అయితే కామెంటు పరిమితి దృష్ట్యా blogger.com ఆ కామెంటుని అనుమతించలేదు. ఆయన లేవనెత్తిన అంశాలు కవిత్వాన్ని చదవడంలోనూ, అర్ధం చేసుకోవడంలోనూ కవులకి, పాఠకులకీ ఉపయుక్తంగా ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.


=================

బహుశా ఇంతకు ముందెప్పుడూ మీ కవితల గురించి యింత విపులంగా నేను నా అభిప్రాయాలు చెప్పినట్టు లేదు! :-) ముందు నేరుగా మిమ్మల్ని సంబోధిస్తూ మధ్యమపురుషలో రాద్దామని అనుకున్నాను కాని ఎందుకో తెలియకుండా, ప్రథమపురుషలో సాగిపోయింది. అయినా, యిది ఆత్మీయమిత్రుని అభిప్రాయంగానే తప్ప ఏదో పెద్ద విమర్శకుని విమర్శలాగా తీసుకోవద్దు.:-)


1."శృంగేరిలో సూర్యాస్తమయం..."


కవిత్వంలో సాధారణంగా, ఆలోచనా అనుభూతీ అనే రెండు అంశాలు ఉంటూ ఉంటాయి. రెండూ కలిసిపోయిన కవిత్వం కూడా ఉండవచ్చు. ఈ కవితలో, ఆలోచనే ప్రధానంగా ఉన్నట్టనిపించింది నాకు. మౌనంలోకి లీనమైన ఓంకారం అనుభవంలోకి వచ్చి ఉంటే, యిన్ని అక్షరాలు ఉండేవి కావు. అయితే, కవికుండే ఒకానొక సహజమైన ఆర్తి ధ్వనిస్తూ ఉంది. మదిలో కదిలే చేపలని అక్షరాలతో పట్టుకోవాలనే ఆర్తి. అమ్మ నవ్వింది, "పాపం ఎందుకొచ్చిన ఆర్తీ!" అనే కాబోలు!


2. "పాటే అక్కరలేదు..."

ఇది కవి అనుభవంలోంచి వచ్చిన ఒక statement, అంతే. అలాంటి అనుభవమే తమకూ ఉన్న పాఠకులు, అవును కదా అని తల ఊపుతారు, లేకపోతే లేదు. అంతకన్నా వేరే ఎలాంటి స్పందనా కలిగిస్తుందని నేననుకోను.


3. "బెండకాయ వేపుడు..."


నాక్కూడా బెండకాయవేపుడు ఇష్టమే.:) కవి అనుభూతిని వ్యక్తీకరించే ప్రయత్నం ఇందులో ఉంది. ఇందులో మరేమైనా అంతరార్థం ఉందెమో నాకు తెలీదు, తెలుసుకోవాలనుకోను. ఎందుకంటే నా దృష్టంతా బెండకాయవేపుడు పైనే నిలిచిపోయింది. అయితే, రుచుల గురించి వర్ణించాలంటే ఏ శ్రీనాథుడో, శ్రీకృష్ణదేవరాయలో, పోనీ ఓ శ్రీరమణో నాకు అవసరం. ఇలాంటి విషయంలో యిలాంటి కవిత్వం, నాకు క్లుప్తతలా అనిపించదు. పిసినారితనంలా అనిపిస్తుంది.:-)

4. "హోరుమని వర్షం..."


ఇందులో కవి పొందిన అనుభూతి ఉంది. అది అనిర్వచనీయమైన అనుభూతి. తనకి దేనివల్ల ఆ అనుభూతి కలిగిందో కవికి కూడా తెలియలేదు. అది ఒక ఆల్కెమీ! ఇక్కడ కవి వెతుక్కుంటున్నది తన అనుభూతిని వ్యక్తపరిచే అక్షరాలను కాదు. ఆ అనుభూతి రసాయనంలో ఉన్న మూలకాలను.


5. "కవ్వం.. లాంతరు.. "

ఇక్కడ కవి జ్ఞాపకాల్లోని వస్తుప్రపంచం మాత్రమే కవిత్వంలోకి వచ్చినట్టుంది. అవి మోసుకొచ్చే అనుభూతుల గురించి కవి పూర్తిగా మౌనం వహించాడు. అయితే, పై కవితకీ దీనికీ ఒక పెద్ద తేడా ఉంది. పై కవితలో అనుభూతి కొంత సార్వజనీనమైంది. అంటే, ఎవరికైనా ఎప్పుడైనా కలిగే అవకాశం ఉంది. ప్రత్యేకమైనది కూడా, అంటే ఒక ప్రత్యేకమైన సన్నివేశం, వాతావరణం వగైరాలన్నీ అక్కడున్నాయి. అందువల్ల ఆ కవితని పాఠకుడు అనుభవించడానికి ఎక్కువ శ్రమ పడనక్కర లేదు. ఈ కవిత అలా కాదు. ఈ వస్తువుల జ్ఞాపకాలున్న పాఠకులకే యిది పరిమితం. వాటి వెనకనుండే అనుభవాలు విస్తృతం. కాబట్టి పై కవితలోని చిక్కదనం ఇందులో లేదు.


6. "బోను తలుపు తెరవగానే..."

ఇది పూర్తిగా ఆలోచనకు సంబంధించినదే. ప్రధానంగా ఇక్కడ పనిచేస్తున్నది కవి బుద్ధి కాని హృదయం కాదనిపిస్తోంది. పైగా కవి మనసులోని ఆలోచన పూర్తిగా వాచ్యమయ్యింది. పూర్వ కవిత్వంలో "పంజరం వీడిని చిలక", ఇందులో "బోను వదిలిన ఎలక"య్యింది, అంతే.


7. "ఏదో దాహం తీరక..."


ఇది కూడా పూర్తిగా ఆలోచనాత్మకమైన కవితే. పాఠకుని మెదడుకి కాస్తంత మేత. కొంత లోతైన తత్త్వం.


8. "వికసిస్తున్నాయి..."


తన అనుభూతిని అక్షరాలలో అనువదించాలనే ఉబలాటం కనిపిస్తున్న కవిత యిది. అయితే వాడిన పనిముట్టు పాతదవ్వడం వల్ల కాబోలు, అంత ప్రభావం చూపించ లేదు. పైగా "వికసిస్తున్నాయి" అనే అమహద్వాచకం, "పిల్లలు" అనే మహద్వాచకానికి అన్వయించుకోవడం నాలాంటి చాదస్తులకి కష్టం! :-)


9. "ఉజ్వలంగా వెలిగిన..."


ఈ కవితలన్నిటిలోనూ యిది ఉజ్జ్వలంగా వెలిగిన కవితలా అనిపించింది నాకు. ఇది కూడా చూడగానే ఒక statementలా అనిపిస్తుంది. కాని యిది రెండవ కవితలాగా ఒక generalized statement కాదు. నిజానికిక్కడున్నది, ఒకానొక సందర్భంలో, కరగిన కర్పూరహారతి, కవి హృదయంలో నింపిన అనుభూతి వెలుగులని ప్రతిఫలించే కవిత్వం. చిక్కని అనుభూతీ, లోతైన ఆలోచనా రెండూ నాలో కలిగించిందిది.


10. "నిరీక్షిస్తాను.."

ఇది అచ్చమైన అనుభూతి నిండిన కవితే. మొదటి కవితలో ఒక కవి ఆర్తి కనిపిస్తే, ఇందులో ఒక తాత్త్వికుని ఆర్తి వినిపిస్తుంది. ఇది విన్నప్పుడు బహుశా అమ్మకి నవ్వురాదు, జాలి కలుగుతుంది.

11. "స్తంభించిన ట్రాఫికులో..."

ఇలాంటి దానికి ఆలంకారిక పరిభాషలో ఒక పదం ఉంది, "నీచోపమ"! :-)

12. "చప్పున ఎగసి..."

ఇదీ, పై కవితా కేవలం చమత్కారమైన ఊహలు తప్ప కవిత్వం అయ్యాయనుకోను.


13. "కోరికలు దహించి వేస్తాయి..."


ఇందులో, తాత్త్వికుడు కవిని ఆక్రమిస్తూ... మిస్తూ... ఉండడం కనిపిస్తోంది. సగం వచనం, సగం కవిత్వం. ఆ వచనం, పొంగుకొస్తున్న అతని ఆర్తిని సూచిస్తున్న మాట నిజమే. ఆర్తి అచ్చమైన వచనంలోనూ బలంగానే వ్యక్తీకరించ వచ్చు కదా. ఈ కవి కవితా స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు, ఇందులోని వచనం కవిత చిక్కదనానికి ఆటంకమయ్యిందని చెప్పక తప్పదు.


14. "ఎక్కడో ఒక పువ్వు..."


చాలా మంచి అభివ్యక్తి. ఇందులో ఒక తమాషా అయిన మార్మికత ఉంది. పువ్వు, చినుకు, ఎక్కడనుండి రాల్తున్నాయో చెప్పలేదు. ఎక్కడ రాలాయో, దేనికి తాకాయో ఉన్నది. కానీ అక్షరాలు మాత్రం ఎక్కడనుండి రాలాయో ఉంది (కవిలోంచి). ఎక్కడ రాలాయో లేదు. వాటికీ వీటికీ ముడిపెట్టి వదిలేసాడు కవి. చెట్టెవరు, గడ్డి ఎవరు? మేఘం ఎవరు, నది ఎవరు? అది పాఠకునికే వదిలేసాడు! మొత్తానికి తాత్త్వికుని మాట ఎలా ఉన్నా, అమ్మ కవిని కరుణించినట్లే ఉంది! :-)


పైన నేను చెప్పినట్లు, కవిత్వంలో ఆలోచనా ఉండవచ్చు, అనుభూతీ ఉండవచ్చు. రెండురకాల కవితలూ కలగలిసినప్పుడు మాత్రం, వాటిని ఎలా చదవాలనే విషయంలో పాఠకుడు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది!


-- కామేశ్వరరావు

3 comments:

రవి said...

నాకు కవిత్వం అనేది చాలా డ్రై సబ్జెక్టు. అయినా దిగుతున్నాను. అధిక ప్రసంగాన్ని మన్నించాలి.

2. ఇక్కడ నేపథ్యం కూడా కొంత పాత్ర వహిస్తుందని నా 'కపి ' హృదయం ఘోషిస్తూంది. మాటలు కరువైన భార్యాభర్తలకు ఇది ఆర్ద్రంగా అనిపించే అవకాశం ఉంది.

3. బెండకాయ వేపుడు - ఇక్కడ కవి 'రుచి ' గురించి కాక ఆకలి గురించి చెబుతున్నాడని నాకు అనిపిస్తున్నది. నిజంగా ఆకలే సబ్జెక్ట్ అయితే బెండకాయ వేపుడు బదులు రాగి సంగటి, శనక్కాయ ఊరిమిండి ఇంకొంచెం బాగా తగిలి ఉండేదని నా అనుకోలు.:)

4. వచన కవిత్వం లో శబ్దసౌందర్యం/శబ్ద ఔచిత్యం పాత్ర ఎంతో తెలియదు కానీ -రెండవపాదంలో - కొండపైకి 'వెళ్ళాం ' బదులుగా కొండపైకి 'నడక ' అనే నామవాచకం బావుండేదని నాకు అనిపించినది.

6. ఇది 'పూర్తిగా ' ఆలోచన కాదని నా అనుకోలు. స్వేచ్ఛా కాంక్షకు అనాలజీకన్నా వాచ్యమే మేలని కవి భావించి ఉంటాడని నా అనుమానం.

రవి said...

రెండవ ఇన్స్టాల్ మెంటు.

12. ఛప్పున ఎగసి చతికిలబడే కవి - ఇక్కడ చతికిలబడడం అంటే తన్మయత్వాన్ని మాటల్లో చెప్పలేని అశక్తుడు - లేదా చెప్పవలసి వచ్చినందుకు అక్షరాలు దొరకని అవస్థలో ఉన్న భావుకుడు అన్న అర్థం స్ఫురిస్తుంది. ఇది కామేశ్వర్రావు గారన్నట్టు చమత్కారం కాదనుకుంటున్నాను.

13. దీనినికి నాకు అనిపించిన భావం చెప్పాలంటే పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళినట్టు - (వచన) కవిత్వం లో భావం ముఖ్యమా, శబ్దమా, వాటి పరిమితులు - ఈ టాపిక్ లోకి దిగాలి. ఎందుకొచ్చిన గొడవ. నిప్పు రాజేసి తప్పుకుంటానంతే. :)

14. చివరి కవిత అద్భుతమైన కవిత.

Nagaraju said...

బావుంది, కాని కవిత్వాన్ని ఆకళింపుచేసుకోడానికి దాన్ని ఇట్లా పీక్కుతినడం అవసరమా అనిపిస్తుంటుంది ఒక్కోసారి :)