Thursday, April 22, 2010

చిట్టి కవితలు

1.

ఇప్పటిదాకా నేర్చుకున్న
భాషలన్నీ మర్చిపోయి
నీతో మాట్లాడేందుకు
ఒక కొత్త భాషని
సృష్టించుకుంటాను

నీ కేరింతల్లో
నా కేరింతలు కూడా
కలిసిపోతాయి

2.

పాకడమైనా రాని నువ్వు
ఎక్కడెక్కడి లోకాలకో
తీసుకుపోతుంటే

ఆనందంగా
నీ వెనక నేను!

3.

నీ సమక్షంలో
చైతన్యమొచ్చిన బొమ్మల మధ్య
కదలక మెదలక నిల్చున్న బొమ్మ

అది నేనే!

4.

నీ చుట్టూ
నిరంతరం ఎగిరే
జంట సీతాకోకలు

అమ్మా, నేను!


5.

మనసులో ఏ మూలో
మంచులా ఉన్న నా పసితనం
నీ వెచ్చని బోసినవ్వులతో
మళ్ళీ కరిగి ప్రవహిస్తుంది

ఆ ప్రవాహంలో
ఒక కాగితప్పడవనై
అలా..అలా
తేలిపోతుంటాను

మళ్ళీ
నీ చిట్టి చేతులే
ఒడ్డుకి చేర్చాలి!

6.

ఆడి ఆడి అలసిపోయిన నిన్ను
నిద్రకు ముందు ఆవరించే నిశ్శబ్దంలో
నా గుండె చప్పుడు నాకు
తృప్తిగా వినిపిస్తుంది!

11 comments:

అక్షర మోహనం said...

ఆరు చిట్టి కవితలు నన్ను హాయిగా ఒడ్డుకు చేర్చాయి.

మధురవాణి said...

Simply superb!

విజయవర్ధన్ (Vijayavardhan) said...

"ఆడి ఆడి అలసిపోయిన నిన్ను
నిద్రకు ముందు ఆవరించే నిశ్శబ్దంలో
నా గుండె చప్పుడు నాకు
తృప్తిగా వినిపిస్తుంది! "

చాలా బాగుంది

SRRao said...

సుబ్రహ్మణ్యం గారూ !
ఏటి ఒడ్డున నీటి గలగలలు మీ కవితలు. ఆ గలగలలెంత మధురమో మీ కవితలంత మనోహరంగా వున్నాయి. అభినందనలు.

Srinivas said...

బావున్నాయి. అయిదు మరీ.

మరువం ఉష said...

అద్దం ముందు బొమ్మ, అద్దంలో బొమ్మ కలిసి నాన్నతనపు వెల్లువన్నమాట! బావుందండి. ముద్ద కుడుములు, బొబ్బట్ల ముచ్చట్లు కూడా కలిపే పని.

ఎం. ఎస్. నాయుడు said...

కదలక మెదలక నిల్చున్న బొమ్మ ayyaanu

శివరంజని said...

చిట్టి చిట్టి కవితలు నాకెంతో నచ్చాయ్

రాధిక(నాని ) said...

మీకవితలన్నీ చదివాను బాగున్నాయి .చాలా హాయిగా ఉన్నాయి చదువుతుంటే.

Anonymous Techie from Bangalore said...

Chala baunnaye

Anonymous said...

mee kavitalu chala bagunna..cheppadaluchukunna danni..chala simple ga chepparu